రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

డురండ్ కప్ ఆటల పోటీ ట్రోఫీలను ఆవిష్కరించిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 07 JUL 2026 2:09PM by PIB Hyderabad

‘డురండ్ కప్ ఆటల పోటీ - 2026’ ట్రోఫీలను ఈ రోజు.. అంటే 2026 జులై 7న రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, అనేక మంది ప్రతిభావంతులకు ఫుట్‌బాల్ ఆటలో పాలుపంచుకొనేందుకు  ఈ ఆటల పోటీ ఒక అవకాశాన్ని అందించిందంటూ, డురండ్ కప్‌తో అనుబంధం ఉన్న పూర్వ, ప్రస్తుత అధికారులు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
డురండ్ కప్‌, ప్రెసిడెంట్స్ కప్, సిమ్లా ట్రోఫీ గెలవడానికి ఈ సంవత్సరం కొన్ని కొత్త జట్లు పోటీపడనున్నాయని, వాటిలో శ్రీలంకకు చెందిన ఒక జట్టు కూడా ఉందని రాష్ట్రపతి తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొత్త జట్ల చేరిక ఈ చరిత్రాత్మక పోటీకి ప్రజాదరణ మరింత పెరిగేటట్లు చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. పాల్గొంటున్న జట్లన్నీ మంచి ఆటతీరును కనబరచాలని రాష్ట్రపతి శుభాకాంక్షలను తెలిపారు.  
ప్రపంచంలో అన్నింటి కన్నా అత్యంత ఆదరణ లభిస్తున్న క్రీడలలో ఫుట్‌బాల్ ఒకటని రాష్ట్రపతి అన్నారు. ఇది శ్రేష్ఠత్వానికి, ఏకతకి, క్రీడాభావనలకి సాటి లేని ఉదాహరణగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫీఫా వరల్డ్ కప్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు, క్రీడాకారులు తమ తమ దేశాల ఫుట్‌బాల్ ప్రతిష్ఠను పెంపొందింప చేయడానికి పోటీపడుతున్నారని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయా జట్లకు, క్రీడాకారులకు ప్రపంచమంతటా అభిమానులు ఉన్నారని, వారంతా ఈ జట్లు, క్రీడాకారుల శ్రేష్ఠమైన ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తుంటారని రాష్ట్రపతి అన్నారు. ఫుట్‌బాల్ క్రీడ ప్రజలను పరస్పరం అనుసంధానిస్తుందని, క్రీడాకారుల అసాధరణ ఆట తీరు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులందరికీ స్ఫూర్తిని అందిస్తుందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.

ఫుట్‌బాల్ క్రీడలో భారత్ ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇంకా ఎంతో దూరం ప్రయాణించవలసి ఉందని రాష్ట్రపతి అన్నారు. ఈ ఆటల పోటీ ఫుట్‌బాల్ క్రీడాకారుల ప్రతిభకు పదును పెట్టడంలో చెప్పుకోదగిన పాత్రను పోషించగలదన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
క్రీడలకు సంబంధించిన ఉత్సాహం ఒక్క ఆటలకే పరిమితం కాదని రాష్ట్రపతి అన్నారు. ఇది మనకు జీవితంలో సమానత్వ, సహకార విలువలను బోధించడంతో పాటు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దృఢంగా ఉండాలని బోధిస్తుందన్నారు. మనం 2047 కల్లా భారత్‌ను ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దే దిశగా పురోగమిస్తున్నామని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ విధంగా ఫుట్‌బాల్‌ క్రీడలో ఆటగాళ్లు ఒకరితో మరొకరు సహకరించుకుంటూ జట్టును విజేతగా నిలబెడతారో, అదే మాదిరిగా మన దేశ పౌరులందరూ కలిసికట్టుగా ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో విజయం సాధిస్తారన్న నమ్మకం తనకు ఉందని రాష్ట్రపతి అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చదవడానికి దయచేసి ఈ కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయగలరు:
Please click here to see the President's Speech

 

***


(रिलीज़ आईडी: 2282212) आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam