మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూపు సమావేశానికి భారత్ ఆతిథ్యం కొచ్చి వేదికగా ఈ నెల 6-7 తేదీల్లో జరగనున్న సమావేశం
భారత బ్రిక్స్ అధ్యక్షతన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం,
కీలక ఫలితాలపై చర్చించనున్న సభ్య దేశాల అధికారులు
प्रविष्टि तिथि:
05 JUL 2026 10:11AM by PIB Hyderabad
ఈ సంవత్సరం బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా... బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూపు సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. కేరళలోని కొచ్చి వేదికగా ఈ నెల 6-7 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుంది. బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలో అభివృద్ధికి సంబంధించిన కీలక సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఉమ్మడి ప్రాధాన్యాల విషయంలో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలనూ వారు చర్చిస్తారు.
ప్రజాకేంద్రిత, మానవతా ప్రాధాన్య విధానాన్ని ప్రతిబింబించే "సమర్థత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల నిర్మాణం" అనే ఇతివృత్తం మార్గదర్శనంలో భారత బ్రిక్స్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పరిపాలన, నాయకత్వంలో మహిళలు... మహిళల డిజిటల్, ఆర్థిక నైపుణ్యాలు... మహిళల వ్యవస్థాపన సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ధి... వాతావరణపరమైన చర్యలు, ఆహార భద్రత, పోషణలో మహిళల పాత్ర అనే నాలుగు ప్రాధాన్య అంశాలపై ఈ సమావేశంలో బ్రిక్స్ మహిళా విభాగం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు సభ్య దేశాలు చర్చించి, ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోవడానికి ఈ మహిళా వర్కింగ్ గ్రూపు సమావేశం మంచి అవకాశం కల్పిస్తుంది.
బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే 11 దేశాలు భాగంగా ఉన్నాయి. ఇవి ఉమ్మడిగా ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ప్రపంచంలోని సుమారు 49.5 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రతి రంగంలోనూ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. అందుకే బ్రిక్స్-2026లో మహిళా విభాగం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనదిగా నిలుస్తుంది.
వీడియో అనుసంధానం ద్వారా 30 ఏప్రిల్ 2026, 22 మే 2026, 29 జూన్ 2026 తేదీల్లో నిర్వహించిన మూడు సన్నాహక సమావేశాల ద్వారా జరిగిన విస్తృత సంప్రదింపుల ఆధారంగా ఈ వర్కింగ్ గ్రూపు సమావేశాన్ని రూపొందించారు. ఈ సంప్రదింపులు కొచ్చిలో జరగబోయే సమావేశాలకు ముందుగానే చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి సభ్య దేశాలకు వీలు కల్పించాయి.
ఆచరణాత్మక సహకారం, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి పట్ల బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... ఈ నెల 8-9 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశానికి ఈ బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూపు సమావేశం బలమైన పునాది వేస్తుందని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2281425)
आगंतुक पटल : 13