వ్యవసాయ మంత్రిత్వ శాఖ
తోతాపురి మామిడి ధరల పతనంపై కేంద్రం తక్షణ చర్యలు; మొత్తం విలువ వ్యవస్థను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ మామిడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్... క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న ఐసీఏఆర్ నిపుణుల బృందం
ఆంధ్రప్రదేశ్ మామిడి రంగాన్ని బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్... ఐసీఏఆర్ బృందం మోహరింపు
ఆంధ్రప్రదేశ్ తోతాపురి మామిడి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాల రూపకల్పనకు ఐసీఏఆర్ నిపుణులను రంగంలోకి దించిన కేంద్రం
प्रविष्टि तिथि:
03 JUL 2026 4:09PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు, ఈ రంగం దీర్ఘకాలిక అభివృద్ధికి తగిన చర్యలను సిఫార్సు చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. కేంద్ర మంత్రి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సందర్భంగా తోతాపురి మామిడి రైతులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడారు. ఈ పర్యటనలో వ్యక్తమైన రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రితో జరిగిన ఈ చర్చల సందర్భంగా శుద్ధి పరిశ్రమల కోసం తాము పెద్ద ఎత్తున పండించే తోతాపురి మామిడి రకం ధరలు గత కొన్ని నెలలుగా గణనీయంగా పడిపోయాయని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్‌లో ధరలు నిరంతరాయంగా పతనం కావడం వల్ల తమ ఆదాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని, దీనివల్ల రాష్ట్రంలోని మామిడి పండించే రైతులంతా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి, ఇబ్బందులకు గురవుతున్నారని వారు వివరించారు.
ఈ సమస్యపై తక్షణమే స్పందించిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.. తోతాపురి మామిడి రంగానికి సంబంధించి సమగ్రమైన అంచనాను రూపొందించడానికి శాస్త్రవేత్తలు, సంబంధిత సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఐసీఏఆర్‌ను ఆదేశించారు. మామిడి సాగు, శుద్ధి నుంచి మొదలుకొని మార్కెటింగ్, దేశీయ వాణిజ్యం, ఎగుమతుల వరకు ఉన్న మొత్తం విలువ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. రైతులకు లాభదాయకమైన రాబడులను అందించేందుకు, ఈ రంగాన్ని సుస్థిరమైన ప్రాతిపదికన బలోపేతం చేసేందుకు అవసరమైన తగిన చర్యలను సిఫార్సు చేయాలని కమిటీని ఆదేశించారు.
లక్నోలోని ఐసీఏఆర్–సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ (కేంద్ర ఉప ఉష్ణమండల ఉద్యానవన శాఖ పరిశోధన సంస్థ) జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వుల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రంగంపై అధ్యయనం చేయబోయే ఈ ఉన్నత స్థాయి కమిటీకి ఐసీఏఆర్-సీఐఎస్‌హెచ్ డైరెక్టర్ డాక్టర్ టీ దామోదరన్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా బెంగళూరులోని ఐసీఏఆర్ కేంద్ర ఉప ఉష్ణమండల ఉద్యానవన శాఖ పరిశోధనా సంస్థ పండ్ల తోటల విభాగం అధిపతి డాక్టర్ ఎం. శంకరన్, లక్నో ఐసీఏఆర్-సీఐఎస్‌హెచ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్‌ఎస్ సింగ్, ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం చెందిన అనంతరాజుపేట హార్టికల్చర్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ డీ శ్రీనివాస రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యానవన శాఖ డైరెక్టర్ లేదా వారి ప్రతినిధి ఉంటారు. రాబోయే పది రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన తోతాపురి మామిడి సాగు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని కేంద్ర మంత్రి ఈ కమిటీని ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సమగ్రమైన అవగాహన తెచ్చుకోవడానికి కమిటీ సభ్యులు.. రైతులు, శుద్ధి పరిశ్రమ ప్రతినిధులు, ఎగుమతిదారులు, రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఈ రంగానికి సంబంధించిన ఇతర వాటాదారులతో నేరుగా ముఖాముఖి చర్చలు జరపనున్నారు.
ఈ నిపుణుల కమిటీ తోతాపురి మామిడి సాగు ప్రస్తుత స్థితిగతులు, పెట్టుబడి ఖర్చులు, రైతుల ఆదాయాలు, శుద్ధి పరిశ్రమల సామర్థ్యం-వినియోగం, డిమాండ్-సరఫరా సమీకరణాలు, దేశీయ మార్కెట్లతో పాటు ఎగుమతి మార్కెట్లలో ఇటీవలి కాలంలో ధరలు పడిపోవడానికి దారి తీసిన కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అలాగే విలువ వ్యవస్థలోని వివిధ దశల్లో ఎదురవుతున్న సవాళ్లను అంచనా వేయడంతో పాటు... సామర్థ్యం, పోటీతత్వం, మార్కెట్ అందుబాటును మెరుగుపరచడానికి ఉన్న అవకాశాలను గుర్తిస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలనలు, వాటాదారుల సంప్రదింపులు, శాస్త్రీయ విశ్లేషణల ఆధారంగా ఈ కమిటీ ధరల పతనానికి గల కారణాలపై ఒక వివరణాత్మక అంచనా నివేదికను తయారు చేస్తుంది. తద్వారా ఆధారాలతో కూడిన విధానపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమం అవుతుంది.
క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తయిన తర్వాత ఈ నిపుణుల కమిటీ తన సమగ్ర నివేదికను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించనుంది. ఈ నివేదికలో తోతాపురి మామిడి ధరల స్థిరీకరణకు తీసుకోవాల్సిన చర్యలు, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం, శుద్ధి, ఎగుమతి సామర్థ్యాల పెంపుదల, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు,శుద్ధి పరిశ్రమలు-ఎగుమతిదారుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై కీలక సిఫార్సులు ఉండనున్నాయి. వీటితో పాటు తోతాపురి మామిడి రంగం దీర్ఘకాలిక, సుస్థిర అభివృద్ధికి అవసరమైన విధానపరమైన చర్యలపై కూడా కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ సిఫార్సుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సమన్వయంతో తదుపరి చర్యలు చేపడతాయి.
తోతాపురి మామిడి సాగుదారుల ఆదాయాన్ని, వారి జీవనోపాధిని రక్షించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. మామిడి రైతులకు స్థిరమైన మద్దతును అందించడానికి, విలువ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఈ రంగంలో విలువ జోడింపు , ఎగుమతులు, పెట్టుబడులు, ఉపాధి కల్పనలో సరికొత్త అవకాశాలను సృష్టించేందుకు కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2280960)
आगंतुक पटल : 9