వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సహకారాన్ని పెంపొందించడం కోసం ఎగుమతుల ప్రోత్సాహానికి తొలి ఇండియా - మాలి ఫోరమ్‌ను నిర్వహించిన భారత్ - మాలీ
2025–26 ఆర్థిక సంవత్సరంలో 326 మిలియన్ అమెరికన్ డాలర్లను దాటి 55 శాతం వృద్ధిని నమోదు చేసిన భారత్ - మాలీ ద్వైపాక్షిక వాణిజ్యం
ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేయడం కోసం పత్తి, గనుల తవ్వకం, ఇంధనం, ఔషధ రంగాలు, సామాజిక మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన భారత్ - మాలీ
డిసెంబర్ 2026లో పెట్టుబడుల ఫోరం సదస్సు నిర్వహించనున్నట్టు ప్రకటించిన మాలీ
प्रविष्टि तिथि:
03 JUL 2026 7:03PM by PIB Hyderabad
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన చర్యగా భారత్, మాలీ దేశాలు తమ పెరుగుతున్న వాణిజ్య భాగస్వామ్యాన్ని సుస్థిరం చేస్తూ తొలి ఇండియా - మాలి ఎగుమతుల ప్రోత్సాహ ఫోరమ్‌ను నిర్వహించాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ఈ వేదికను ఉద్దేశించారు.
వ్యాపార, వ్యూహాత్మక భాగస్వామ్యాల బలోపేతం అనే ఇతివృత్తంతో బామాకోలో జరిగిన ఈ రెండు రోజుల ఫోరమ్‌కు మాలీ తాత్కాలిక ప్రధాన మంత్రి మేజర్ జనరల్ అబ్దులాయ్ మైగా అధ్యక్షత వహించారు. దీనిని మాలీ పరిశ్రమల, వాణిజ్య మంత్రిత్వ శాఖ, బామాకోలోని భారత రాయబార కార్యాలయం, మాలీ ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (అపెక్స్-మాలి) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ఫోరమ్‌లో ఇరు దేశాల ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు, సుమారు 30 మంది భారతీయ వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ (ఎఫ్టీ-ఆఫ్రికా) శ్రీ అమిత్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి మాలీలో భారత రాయబారి డాక్టర్ ఎన్. నందకుమార్ ప్రాతినిధ్యం వహించారు.
భారత్, మాలీ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 55 శాతం వృద్ధిని నమోదు చేసి, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 326.61 మిలియన్ అమెరికన్ డాలర్లను అధిగమించింది. భారతదేశానికి మాలీ చేసే ప్రధాన ఎగుమతులలో ముడి పత్తి, ప్రాసెస్ చేసిన తోలు, జీడిపప్పు, సీసం, జిగురు, నువ్వులు ఉన్నాయి; కాగా భారతదేశం నుంచి మాలీకి ప్రధాన ఎగుమతులలో ఔషధాలు, పత్తి వస్త్రాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సైకిళ్లు ఉన్నాయి. భారతదేశానికి చెందిన డ్యూటీ-ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ (డీఎఫ్టీపీ) పథకం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రధాన ఉత్ప్రేరకంగా నిలిచింది. మాలీ దేశపు మొత్తం ప్రపంచవ్యాప్త ఎగుమతులు సుమారు 4 బిలియన్ అమెరికన్ డాలర్లు కాగా, భారత మార్కెట్లో ఇంకా వినియోగించుకోని ఆ దేశపు ఎగుమతి అవకాశాలు దాదాపు 3.96 బిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా. ఇది రాబోయే కాలంలో మరింత వృద్ధి సాధించడానికి ఉన్న భారీ అవకాశాలను సూచిస్తోంది.
ప్రారంభ సమావేశం అనంతరం సోనాలికా ట్రాక్టర్లు, మహీంద్రా, టాటా మోటార్స్ సంస్థలు తయారు చేసిన వాహనాలతో ఏర్పాటు చేసిన భారత్, మాలీ దేశాల ప్రదర్శన స్టాళ్లను ప్రతినిధి బృందాలు సందర్శించాయి. ఆ తర్వాత వారు బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-గవర్నమెంట్, గవర్నమెంట్-టు-గవర్నమెంట్లతో కూడిన వరుస ముఖాముఖి సమావేశాలలో చురుగ్గా పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధనం, ఔషధాలు , వస్త్రాలు, ఆటోమోటివ్ తయారీ, మైనింగ్ రంగాలపై ఈ చర్చలు జరిగాయి. వ్యాపార అవకాశాలను వాణిజ్య భాగస్వామ్యాలుగానూ, అవగాహనా ఒప్పందాలుగానూ మార్చడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి.
రెండవ రోజున, భారత ప్రతినిధి బృందం మాలీ పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ మూసా అలస్సానే దియాల్లోను కలుసుకుంది. తక్షణ పెట్టుబడి అవకాశాల కోసం అపెక్స్ - మాలి సంస్థ (సిద్ధంగా ఉన్న వ్యాపార ప్రణాళికలను సమర్పించింది. ఆ తర్వాత ఈ ప్రతినిధి బృందం మాలీ తాత్కాలిక ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుంది.
ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడానికి ప్రాధాన్యత రంగాలుగా పత్తి, వస్త్రాలు, మైనింగ్, ఇంధనం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, షియా ప్రాసెసింగ్, ఔషధాలు, ఆరోగ్యం, విద్యతో కూడిన సామాజిక మౌలిక సదుపాయాలను ఇరుపక్షాలు గుర్తించాయి. మాలీ తన 'సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్' వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి భారత్ మద్దతు పట్ల, ఆమోదం పొందిన భారతీయ ఔషధ ఉత్పత్తులను త్వరితగతిన రిజిస్టర్ చేయడం పట్ల బలమైన ఆసక్తిని కనబరిచింది. షియా-నట్ ఎగుమతి నిషేధాన్ని పునఃసమీక్షించాలని భారత బృందం కోరింది, భారతీయ పౌరులు, పెట్టుబడుల రక్షణ యొక్క ప్రాముఖ్యతను కూడా పునరుద్ఘాటించింది.
ఈ ఫోరమ్ దీర్ఘకాలిక భాగస్వామ్యానికి పునాదిగా రూపొందింది.మాలీ దేశం తన 'విజన్ మాలీ 2063' ప్రణాళిక కింద వ్యాపార వాతావరణానికి భద్రత కల్పించడానికీ, పశ్చిమ ఆఫ్రికాకు ఒక వ్యూహాత్మక పెట్టుబడి కేంద్రంగా తనను తాను నిలబెట్టుకోవడానికీ నిబద్ధతను పునరుద్ఘాటించడంతో ఈ సదస్సు ముగిసింది. ఒక నిర్దిష్టమైన తదుపరి అడుగుగా, 2026 డిసెంబర్ 3,4 తేదీలలో ఒక ప్రత్యేక పెట్టుబడుల సదస్సును నిర్వహించబోతున్నట్లు మాలీ ప్రకటించింది. ఈ సదస్సులో అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం మరిన్ని లాభదాయకమైన ప్రాజెక్టులను అందుబాటులో ఉంచనున్నారు.
***
(रिलीज़ आईडी: 2280956)
आगंतुक पटल : 7