ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్ యాప్ ద్వారా ఆధార్‌లో ఉచితంగా మెయిల్ అప్‌డేట్ సదుపాయం కల్పించిన యూఐడీఏఐ
తొలి రెండు రోజుల్లోనే దాదాపు 2.5 లక్షలకు పైగా ఈమెయిల్ అప్‌డేట్ల నమోదు
प्रविष्टि तिथि:
03 JUL 2026 12:45PM by PIB Hyderabad
ఆధార్ కార్డు వినియోగదారుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో తమ ఈమెయిల్ ఐడీని అనుసంధానించేందుకు లేదా మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆధార్ యాప్ ద్వారా మొబైల్‌లోనే అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఉచిత సేవ కేవలం ఆధార్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుంది. 2026 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం రాబోయే ఆరు నెలల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రజలు తమ ఆధార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం మునుపటి కంటే ఎంతో సులభతరం అవుతుంది. ఆధార్ కేంద్రాలకు వెళ్లే శ్రమను తప్పించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష సాధన దిశగా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సులభమైన డిజిటల్ సేవలను అందించాలనే యూఏడీఏఐ నిబద్ధతను ఈ కార్యక్రమం చాటుచెబుతుంది.
ఆధార్ యాప్‌లో ఈ కొత్త సేవ ప్రారంభమైన కేవలం రెండు రోజుల్లోనే 2,50,000 కంటే ఎక్కువ మంది పౌరులు తమ ఈమెయిళ్లను యాప్ ద్వారా విజయవంతంగా అప్‌డేట్ చేసుకున్నారు. ఆధార్ కార్డుతో ఈమెయిల్ ఐడీని అనుసంధానించడం వల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా ఆధార్ నిర్ధారణ ప్రక్రియ జరిగినప్పుడు, తక్షణమే సదరు వినియోగదారుడి ఈమెయిల్‌కు నోటిఫికేషన్ అందుతుంది.
ఇది ఆధార్ వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, తమ ఆధార్ నంబర్‌ను ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నారనే సమాచారాన్ని కార్డుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ, అదనపు భద్రతను అందిస్తుంది.
ప్రజల జీవన ప్రమాణాలను, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన ఈ సరికొత్త ఆధార్ యాప్ ద్వారా కేవలం ఈమెయిల్ మాత్రమే కాకుండా.. మొబైల్ నంబర్ అప్‌డేట్, చిరునామా అప్‌డేట్ వంటి మరెన్నో సేవలను ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచే నేరుగా, సులభంగా పొందుతున్నారు.
ఇప్పటివరకు 40 లక్షల మందికి పైగా ప్రజలు కొత్త ఆధార్ యాప్‌ను ఉపయోగించి మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసుకోగా, దాదాపు 10 లక్షల మంది తమ చిరునామాను మార్చుకోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించారు.
ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని అనుసంధానించుకోవడానికి లేదా మార్చుకోవడానికి కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలను యూఐడీఏఐ కోరుతోంది. వినియోగదారులు తమ మొబైల్‌లో ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ఇప్పటికే ఉన్న యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈమెయిల్ అప్‌డేట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ వేదికలో ఈ కొత్త ఆధార్ యాప్ అందుబాటులో ఉంది. పౌరులు కింద పేర్కొన్న లింకుల ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్: https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.pehchaan&hl=en_IN
ఐఓఎస్: https://apps.apple.com/in/app/aadhaar/id6744029871
***
(रिलीज़ आईडी: 2280736)
आगंतुक पटल : 8