ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ ప్రధానమంత్రితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
प्रविष्टि तिथि:
02 JUL 2026 2:25PM by PIB Hyderabad
గౌరవనీయులు, సోదరీ సమానురాలైన ప్రధానమంత్రి తకాయిచీ గారు...
రెండు దేశాల ప్రతినిధి బృంద సభ్యులు సహా ప్రసార-ప్రచురణ మాధ్యమాల మిత్రులారా...
నమస్కారం!.. కొన్నీచివా!
భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కోసం తొలిసారి మా దేశానికి విచ్చేసిన ప్రధానమంత్రి గౌరవనీయ తకాయిచీ గారిని స్వాగతించడం నాకెంతో ఆనందదాయకం.
ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి మాత్రమే కాదు... దార్శనికురాలు, విస్తృత ప్రజాదరణగల నాయకురాలు. అలాగే, భారత్-జపాన్ ఉమ్మడి బౌద్ధ వారసత్వంగల జపాన్‌లోని నారా ప్రీఫెక్చర్ (రాష్ట్రం) వాస్తవ్యురాలు కావడం మరో విశిష్టత.
మిత్రులారా!
నేటి ప్రపంచ అనిశ్చితి, గందరగోళ వాతావరణం నడుమ పరస్పర విశ్వాసమే మన అతిపెద్ద వ్యూహాత్మక సంపదని ఇటీవలే నేను జీ7 శిఖరాగ్ర సదస్సులో చెప్పాను. ఈ సూత్రీకరణకు భారత్-జపాన్ భాగస్వామ్యం అన్నివిధాలా తిరుగులేని నిదర్శనమని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను.
ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ అన్ని రంగాల్లోనూ భారత్ వృద్ధి పయనంలో గత అనేక దశాబ్దాలుగా జపాన్ కీలక ఓ భాగస్వామి. పరస్పర విశ్వాసం, స్నేహబంధానికి ఇదొక అమూల్య పెన్నిధి.
ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి తకాయిచీ పర్యటనతో మా ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాం.
మిత్రులారా!
భారత్, జపాన్ రెండూ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్నాయి. స్వేచ్ఛాయుత, సుసంపన్న, నిబంధనాధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతం ఉభయ దేశాలకూ ఉమ్మడి ప్రాధాన్యం.
ఈ ప్రాంతంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా నేడు అనేక ముఖ్యమైన కార్యక్రమాలను మేం ప్రారంభించాం. ఈ ప్రాంతమంతటా శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం దిశగా మార్గం సుగమం చేయడంలో ఇవన్నీ దోహదం చేస్తాయి.
మిత్రులారా!
ఉభయ దేశాల మధ్య సహకారానికి సాంకేతిక భాగస్వామ్యం అత్యంత బలమైన మూలస్తంభమని మేమిద్దరం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ దార్శనికతను సాకారం చేసుకోవడంలో భాగంగా ఈ రోజు కృత్రిమ మేధ (ఏఐ)పై ఒక సంయుక్త ప్రకటన కూడా చేశాం. అలాగే, భారత ఏఐ వ్యవస్థలోని అనేక ప్రముఖ సంస్థలు కూడా తమ జపనీస్ భాగస్వాములతో నేడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జపాన్ సునిశిత సాంకేతికతలు, భారత సాఫ్ట్‌వేర్ సామర్థ్యాల సమ్మేళనం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రగతికి నవ్యోత్తేజాన్ని, శక్తిని సమకూరుస్తుంది.
రక్షణ రంగంలో భారత్-జపాన్ తొలి సంయుక్త-అభివృద్ధి ప్రాజెక్టుపై ఈ రోజున ఒక ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా వినూత్న రేడియో యాంటెన్నా ప్రాజెక్టు మా రక్షణ సాంకేతిక భాగస్వామ్యంలో నూతనాధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. భవిష్యత్తులో ప్రాంతీయ శాంతి, సముద్ర భద్రత, నిబంధనాధారిత వ్యవస్థను బలోపేతం చేయగల రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను మేం సంయుక్తంగా రూపొందిస్తాం.
ఔషధ, వైద్య ఉపకరణాల, జీవ సాంకేతిక రంగాల్లో నేటి మా ఒప్పందాలు ప్రపంచ ఆరోగ్య భద్రతకు దోహదపడటంలో మాకు వీలు కల్పిస్తాయి. భారత్ భారీస్థాయిని జపాన్ నాణ్యతతో మేళవించడం ద్వారా ప్రపంచానికి చౌక, విశ్వసనీయ, అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు సమకూర్చడానికి మేం సంయుక్తంగా కృషి చేస్తాం.
మిత్రులారా!
భారత్-జపాన్ పెట్టుబడి భాగస్వామ్యం ఎప్పటికప్పుడు మరింత పటిష్టమవుతోంది. ఈ మేరకు గత ఏడాది వ్యవధిలో 100కు పైగా కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరాయి. తద్వారా భారత్‌లో 10 బిలియన్ డాలర్లకు పైగా జపాన్ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. రెండు దేశాల ఆర్థిక సేవా సంస్థల మధ్య నేటి ఒప్పందంతో మూలధనం-పెట్టుబడుల పరస్పర ప్రవాహానికి బాటలు పడతాయి.
రాబోయే పదేళ్లలో భారత్‌లోకి 10 ట్రిలియన్ యెన్‌ల జపాన్ పెట్టుబడులను ఆకర్షించడం సహా ఇక్కడి జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడం మా విస్పష్ట లక్ష్యం. భారత్‌లో నిరంతర సంస్కరణలు వ్యాపార సౌలభ్యాన్ని గణనీయంగా పెంచాయి. ఈ నేపథ్యంలో జపాన్ కంపెనీలు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునే తరుణమిదే.
మిత్రులారా!
నేటి అనిశ్చిత శకంలో భారత్-జపాన్ రెండూ ఆర్థిక-ఇంధన భద్రతల ప్రాధాన్యాన్ని లోతుగా అవగాహన చేసుకున్నాయి. అందుకే, మేమీ రోజున ఆర్థిక భద్రతపై ఉమ్మడి వ్యూహాత్మక ప్రణాళికను ఆమోదించాం. దీని అమలు ద్వారా సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, అత్యాధునిక పదార్థ విజ్ఞానం వంటి వ్యూహాత్మక రంగాలలో సరఫరా వ్యవస్థ పునరుత్థాన సామర్థ్యాన్ని మేం బలోపేతం చేస్తాం.
ఇంధన భద్రత రంగంలోనూ ఇవాళ అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. భారత్-జపాన్ బయోగ్యాస్ కార్యక్రమం ద్వారా భారత్ అంతటా వెయ్యి బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల ప్లాంట్ల స్థాపనకు మద్దతిస్తాం. దీనివల్ల మా దేశంలో ‘గోబర్ధన్’ కార్యక్రమానికి మరింత బలం చేకూరుతుంది.
ఈ కార్యక్రమం ద్వారా భారత గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిరత, సౌభాగ్యం, గ్రామీణ జీవనోపాధికి మరింత ఉత్తేజం లభిస్తుంది. చమురు సంక్షోభాల వంటి సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కోవడంలో భాగంగా ఇంధన పునరుత్థాన సామర్థ్యం పెంపుపై మేమొక కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరోవైపు బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, అణుశక్తి రంగాల్లో మన సహకారం ప్రపంచ కాలుష్య రహిత ఇంధన భవితకు గణనీయంగా తోడ్పడుతుంది.
భారత్-జపాన్ ఆర్థిక భద్రతను ఒక ఉమ్మడి ఆవశ్యకాంశంగా, ఇంధన మార్పిడిని ఉమ్మడి అవకాశంగా పరిగణిస్తున్నాం. ఇలా సమష్టి దృక్పథంతో ఈ రెండింటినీ అమలులోకి తెచ్చి, విస్పష్ట ఫలితాల సాధనకు భుజం కలిపి కృషి చేస్తాం.
మిత్రులారా!
భారత్-జపాన్ భావితరం రవాణా భాగస్వామ్య చట్రాన్ని కూడా ఇవాళ ఖరారు చేశాం. దీంతో ఆటోమోటివ్ రంగంలో మా విజయ గాథను నౌకా నిర్మాణం, విమాన, లాజిస్టిక్స్ వంటి కొత్త రంగాల్లో పునరావృతం చేసే వెసులుబాటు కలుగుతుంది.
మిత్రులారా!
రెండు దేశాల ప్రజల మధ్యగల సంబంధాలు మన స్నేహబంధానికి తిరుగులేని బలం. ప్రతిభా చలనశీలత, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణ కార్యక్రమాల దిశగా అవకాశాలను మేం మరింత విస్తరింపజేస్తున్నాం. దీంతోపాటు పరిశోధన, విద్యాభ్యాసం, అంకురావరణ వ్యవస్థలో మా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాం.
ఉభయ దేశాల దౌత్య సంబంధాలకు వచ్చే ఏడాదితో 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సంబరాల నిర్వహణకు మేమెంతో ఉత్సాహంతో సిద్ధమవుతున్నాం. ఇలాంటి కీలక సందర్భంలో సంస్కృతి, పర్యాటకం, సృజనార్థిక వ్యవస్థ పరంగా మెరుగైన సహకారం ద్వారా ప్రజల మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తాం.
మహోదయా!
భారత్-జపాన్ ఆర్థిక వ్యవస్థలు పరస్పర పూరకాలు. మన ఉమ్మడి సాంస్కృతిక విలువల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దాకా దృక్కోణాలు, విధానాల్లో ఎంతో సామీప్యం ఉంది.
అన్నింటికన్నా ముఖ్యంగా- తిరుగులేని పరస్పర విశ్వాసమే మన స్నేహసంబంధాలకు పునాది. శక్తియుత, సుసంపన్న జపాన్ దిశగా మీ స్వప్నానికి, వికసిత భారత్ రూకల్పనపై మా సంకల్పానికి ఈ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం అదనపు శక్తినిస్తుంది. అదే సమయంలో ప్రపంచ ప్రగతిని సమున్నత శిఖరాలకు చేర్చే దిశగా సారథ్యం వహిస్తుందని నా దృఢ విశ్వాసం.
ఆ మేరకు బలమైన, సుసంపన్నమైన జపాన్‌పై మీ దార్శనికత, వికసిత భారత్ సాకారంపై మా సంకల్పం సహా యావత్ ప్రపంచ పురోగమనం, సౌభాగ్యం దిశగా సమష్టి ఆకాంక్షను సంయుక్తంగా నెరవేర్చేందుకు కృషి చేద్దాం.
మరోసారి మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, సాదరంగా స్వాగతిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
(रिलीज़ आईडी: 2280628)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam