జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత అతిపెద్ద ప్రపంచస్థాయి వస్త్ర ప్రదర్శన 'భారత్ టెక్స్-2026' కోసం ప్రారంభమైన కౌంట్‌డౌన్


‘భారత్ టెక్స్-2026: భారతీయ వస్త్ర పరిశ్రమ నాణ్యత, నైపుణ్యాలను ప్రపంచ ఆర్థిక వృద్ధితో అనుసంధానించడం’

प्रविष्टि तिथि: 02 JUL 2026 4:28PM by PIB Hyderabad

భారత వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అతిపెద్ద ప్రపంచస్థాయి కార్యక్రమం ‘భారత్ టెక్స్-2026’ ఈ నెల 14 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఇది భారత వస్త్ర పరిశ్రమ విస్తరణను, శ్రేష్ఠతను ప్రపంచస్థాయి వేదికపై ప్రదర్శిస్తుంది. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో... వస్త్రాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి, పారిశ్రామిక సంస్థల సమాఖ్య అయిన భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వస్త్రాలు, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో పెరుగుతున్న భారత ప్రపంచస్థాయి నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 5ఎఫ్ విజన్ - ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్ స్ఫూర్తితో... తయారీ నుంచి సరఫరా ప్రక్రియ దాకా వస్త్ర పరిశ్రమ అంతటా వ్యాపారం, పెట్టుబడులు, ముడిసరుకుల సేకరణ, ఆవిష్కరణలు, విధానపరమైన చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం భారత్ టెక్స్-2026 ఒక ప్రధాన ప్రపంచస్థాయి వేదికగా రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచ వ్యాప్త కొనుగోలుదారులు, బ్రాండ్లు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, రాష్ట్రాలు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, డిజైనర్లు, కళాకారులు, అంకురసంస్థలు, సాంకేతిక నిపుణులు ఒకేచోట సమావేశమవుతారు.

మూడో ఎడిషన్‌లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 1.3 లక్షల మంది వాణిజ్య సందర్శకులు, 20,000కు పైగా వస్త్ర ఉత్పత్తులతో 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రదర్శన జరుగుతుందని అంచనా. ఈ కార్యక్రమం అర్థవంతమైన వాణిజ్య ఒప్పందాలకూ మార్గం సుగమం చేయనుంది.

20కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ నిపుణులు, జాతీయ పారిశ్రామిక నాయకులు, సీఎక్స్ఓలు, విధాన రూపకర్తలు, మేధావులు సహా 350 మందికి పైగా వక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడానికి, వివిధ దేశాల మధ్య నిర్మాణాత్మక సంబంధాలను సులభతరం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన అంతర్జాతీయ పెవిలియన్‌నూ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, కెనడా, పోర్చుగల్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, శ్రీలంక, హాంగ్‌కాంగ్, స్వీడన్, కెన్యా, బంగ్లాదేశ్, వియత్నాం, ఈజిప్ట్, ఇండోనేషియా దేశాల నుంచి వక్తలు, నిపుణులు చర్చల్లో పాల్గొంటారని భావిస్తున్నారు.

ఈ ఎడిషన్‌లో మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు సహా ఎనిమిది స్పాన్సర్ రాష్ట్రాల భాగస్వామ్యం కీలకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. భారత ప్రాంతీయ వస్త్ర పరిశ్రమ సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలు, క్లస్టర్ సామర్థ్యాలు, తయారీ మౌలిక సదుపాయాలు, విధాన - నియంత్రణ పరమైన మద్దతును ఈ రాష్ట్రాల భాగస్వామ్యం ప్రదర్శిస్తుంది.

భారత్ టెక్స్-2026 ప్రధానంగా తయారీ నుంచి సరఫరా వరకు మొత్తం భారత వస్త్ర పరిశ్రమ శ్రేష్ఠతను సమగ్రంగా ప్రదర్శిస్తుంది. పత్తి, దారాలు, వస్త్రాలు, దుస్తులు, ఫ్యాషన్, గృహోపయోగ వస్త్రాలు, సాంకేతిక వస్త్రాలు, అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు ఈ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొంటున్నారు. తిరుపూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారత వస్త్ర క్లస్టర్‌లను గుర్తించి, ప్రదర్శించడం ఈ ప్రదర్శన మరో ముఖ్య విశేషం. ఈ ఎడిషన్‌లో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్ వంటి 14 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్‌ల నుంచీ బలమైన సంస్థాగత ప్రాతినిధ్యం ఉంటుంది. ట్రైడెంట్, వర్ధమాన్ టెక్స్‌టైల్స్, ఆర్‌ఎస్‌డబ్ల్యూఎం, షాహి ఎక్స్‌పోర్ట్స్, కలర్‌జెట్, అరవింద్, పీడీఎస్ లిమిటెడ్, సత్వా వంటి కీలక స్పాన్సర్‌లతో పారిశ్రామిక రంగ బలమైన భాగస్వామ్యం ఉండనుంది. ఇవన్నీ భారత్ టెక్స్‌-2026ను దేశపు అతిపెద్ద ప్రపంచస్థాయి వస్త్ర ప్రదర్శనగా నిలుపుతున్నాయి.

ఈ కార్యక్రమ మూడో ఎడిషన్‌లో 100కు పైగా విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇది గత ఎడిషన్‌తో పోలిస్తే గణనీయ పెరుగుదలను ఇది సూచిస్తుంది. 39 ప్యానెల్ చర్చలు, 16 రౌండ్‌టేబుల్ సమావేశాలు, 37 మాస్టర్ క్లాసులు, 8 రాష్ట్ర స్థాయి సదస్సులు, ఇతర ప్రత్యేక ఫార్మాట్‌లూ వీటిలో భాగంగా ఉన్నాయి. ఈ విజ్ఞాన కార్యక్రమానికి మద్దతునివ్వడానికి 50కి పైగా భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. వాణిజ్యం-పెట్టుబడి, సాంకేతికత-ఆవిష్కరణ, సుస్థిరత-సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ, ఫ్యాషన్-హస్తకళలు, విధాన సదస్సులు, ప్రత్యేక రాష్ట్ర స్థాయి సదస్సుల వంటి కీలక అంశాలను ఇందులో చేర్చారు. ఈ సదస్సులు వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తాయి. ఎగుమతి సంసిద్ధత, సుస్థిరత నిబంధనల పాటించడం, ఇండస్ట్రీ 5.0, ఫైబర్ భద్రత, ఉత్పత్తి ఆవిష్కరణ, గ్లోబల్ సోర్సింగ్ మెగా ధోరణులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి కీలక అంశాలను ఈ సదస్సుల్లో చర్చిస్తారు. ఇవి ఎంఎస్‌ఎంఈలు, వర్ధమాన ఎగుమతిదారులు కీలక మార్కెట్లలో మెరుగ్గా పోటీ పడటానికి సహాయపడతాయి.

ఈ కార్యక్రమం ద్వారా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, సుస్థిరత, మార్కెట్‌ను అందుబాటులో ఉంచడం, సంస్థాగత సహకారం వంటి అంశాలపై సుమారు 3,500 ఎంపిక చేసిన బీ2బీ సమావేశాలు... 100కు పైగా బీ2జీ సమావేశాలు20కి పైగా అవగాహన ఒప్పందాలు జరగనున్నాయని అంచనా. ఈ కార్యక్రమాల ద్వారా ఎగుమతిదారులు, తయారీదారులు, కొనుగోలుదారులు, సరఫరాదారులు, రాష్ట్రాలు, అంతర్జాతీయ భాగస్వాములకు స్పష్టమైన ఫలితాలు లభిస్తాయని భావిస్తున్నారు. పెట్టుబడులకు ప్రోత్సాహం, గ్లోబల్ సోర్సింగ్ భాగస్వామ్యాలు, ఎంఎస్ఎంఈల ఏకీకరణ, సాంకేతిక వస్త్రాల వృద్ధి, సుస్థిర తయారీలతో పాటు ప్రపంచ టెక్స్‌టైల్ మార్కెట్లలో బ్రాండ్ ఇండియా స్థానానికి ఈ కార్యక్రమం మరింత ఊపునిస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వాలు, పరిశ్రమల సంఘాలు, ప్రపంచ వస్త్ర రంగ భాగస్వాముల నుంచి పెరుగుతున్న ఆసక్తితో భారత్ టెక్స్-2026 అంతర్జాతీయ ప్రాముఖ్యత విస్తరిస్తూనే ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక, జోర్డాన్, కంబోడియా, బ్రూనై వంటి దేశాల నుంచి మంత్రుల స్థాయి ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపాయి. వస్త్ర రంగంలో అంతర్జాతీయ విధాన చర్చలు, ద్వైపాక్షిక సహకారానికి భారత్ టెక్స్ ఒక ముఖ్య వేదికగా ఆవిర్భవించడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, ఉగాండా వంటి దేశాల నుంచి పారిశ్రామిక, వ్యాపార ప్రతినిధి బృందాలు పాల్గొంటాయని భావిస్తున్నారు. దీనివల్ల ప్రపంచస్థాయిలో తయారీ నుంచి సరఫరా దాకా వస్త్ర పరిశ్రమ అంతటా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడి భాగస్వామ్యాలు, వ్యాపార సహకారానికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయి. ప్రతి ప్రతినిధి బృంద నిర్దిష్ట అవసరాలను ప్రతిబింబిస్తూ... ద్వైపాక్షిక వాణిజ్య ప్రాధాన్యాలు, ఉమ్మడి పారిశ్రామిక ప్రయోజనాలకు అనుగుణంగా ఈ సమావేశాలను రూపొందించారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పత్తి ఉత్పత్తిలో భారత్-అమెరికా భాగస్వామ్యం, భారత్-న్యూజిలాండ్ ఉన్ని ఉత్పత్తి వ్యవస్థ, భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందం భాగస్వామ్యం, రష్యాతో వస్త్ర రంగ సంబంధిత సంప్రదింపుల వంటి అంశాలపై చర్చిస్తారు.

ఈ ఎడిషన్ మరో ముఖ్య ప్రత్యేకత... రాష్ట్ర స్థాయి పెట్టుబడిదారుల అనుసంధాన సమావేశాలు. ఈ సమావేశాలు రాష్ట్రాలకు పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పీఎం మిత్ర అనుసంధానాలు, విధానపరమైన మద్దతు, ఆయా రంగాల ప్రత్యేక సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఒక వేదికను అందిస్తాయి. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల కోసం సమావేశాలతో పాటు... ప్రత్యేకంగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్ పీఎం మిత్రా మాస్టర్ డెవలపర్ సెషన్‌నూ నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు కేంద్ర-రాష్ట్ర-పరిశ్రమల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ప్రపంచంతో పోటీపడగల వస్త్ర తయారీ వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని భావిస్తున్నారు.

సీఐటీఐ టెక్స్‌టైల్ సస్టెయినెబిలిటీ పురస్కారాలు-2026కూ భారత్ టెక్స్-2026 ఆతిథ్యమిస్తోంది. ఈ పురస్కారాలు వనరుల సామర్థ్యం, ఇంధనం-ఉద్గారాలు, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ, సుస్థిర ముడి పదార్థాలు, సామాజిక బాధ్యత, బాధ్యతాయుత వ్యాపారం, పరిశ్రమల సహకారం అనే ఏడు ప్రధాన అంశాలు కేంద్రంగా రూపొందించినవి. ఇవి నీరు, పదార్థాల పరిరక్షణ, పునరుత్పాదక ఇంధనాల వినియోగం నుంచి సర్క్యులర్ ఆవిష్కరణలు, బాధ్యతాయుతమైన సరుకు రవాణా వ్యవస్థలు, క్లస్టర్-స్థాయి భాగస్వామ్యాల వరకు... తయారీ నుంచి సరఫరా దాకా మొత్తం వస్త్ర పరిశ్రమలో అనుసరిస్తున్న సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పద్ధతులను ప్రతిబింబిస్తాయి.

డిజిటల్ సాధికారత బలోపేతం లక్ష్యంగా ప్రదర్శనకారులు, కొనుగోలుదారులు, ప్రతినిధులు, వక్తలు, సందర్శకుల కోసం ఒక ఏకీకృత డిజిటల్ మార్గదర్శిగా భారత్ టెక్స్-2026 మొబైల్ యాప్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఈ యాప్ సులభమైన ఈవెంట్ నావిగేషన్, ప్రదర్శనకారులను కనుగొనడం, బీ2బీ సమావేశాల షెడ్యూల్, డిజిటల్ బ్యాడ్జ్ యాక్సెస్, క్యూఆర్-ఆధారిత లీడ్ క్యాప్చర్, లైవ్ అజెండా యాక్సెస్, AI-ఆధారిత సహాయాన్ని అందిస్తుంది. కొనుగోలుదారులు, ప్రతినిధులు, ప్రదర్శనకారులకు మధ్యవర్తిత్వం వహించడం, సమావేశాల నిర్వహణ, బూత్‌లను గుర్తించడం, ఫ్లోర్ ప్లాన్‌లను యాక్సెస్ చేయడం, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందడం, కార్యక్రమానంతరం క్రమబద్ధమైన లీడ్‌లను రూపొందించడంలో ఈ యాప్ సహాయపడుతుంది. ఈవెంట్‌ను సందర్శించాలనుకునేవారు యాప్‌లో వారి పేరు నమోదు చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, https://onelink.to/zcrm4s పై క్లిక్ చేయండి లేదా భారత్ టెక్స్ అధికారిక వెబ్‌సైట్, @https://bharat-tex.com/general-visitor-registration/ లోనూ నమోదు చేసుకోవచ్చు.

ఈవెంట్‌కు ముందే కొనుగోలుదారు-విక్రేతల మధ్య అనుసంధానాన్ని ప్రీ-ఫెయిర్ డైరెక్టరీ సులభతరం చేస్తుంది. కొనుగోలుదారులు, ప్రదర్శనకారులు, సోర్సింగ్ కన్సల్టెంట్‌లు సంబంధిత కంపెనీలను, ఉత్పత్తి వర్గాలను, వ్యాపార భాగస్వాములను ముందుగానే గుర్తించడానికి ఈ డైరెక్టరీ వీలు కల్పిస్తుంది. ఈవెంట్ సమయంలో సమావేశాలు మరింత ఫలవంతంగా జరిగేలా చేస్తుంది. భారత్ టెక్స్-2026ను మరింత డిజిటల్ ఆధారిత, డేటా-ఆధారిత, వ్యాపార-కేంద్రీకృత వాణిజ్య వేదికగా మార్చడంలో ఈ మొబైల్ యాప్, ప్రీ-ఫెయిర్ డైరెక్టరీలు సహాయపడతాయి.

భారత్ టెక్స్-2026 ప్రపంచ వస్త్ర పరిశ్రమకు ద్వారాలు తెరుస్తున్న తరుణంలో కేవలం భారత వస్త్ర రంగ సామర్థ్యాలను ప్రదర్శించడమే కాకుండా... వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలకూ కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఇది ప్రపంచంతో పోటీపడగల, పటిష్ఠమైన, సుస్థిరమైన వస్త్రరంగాన్ని నిర్మించాలన్న భారత దార్శనికతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఇది ప్రపంచ వస్త్ర రంగ వృద్ధి తదుపరి దశను తీర్చిదిద్దడంలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్రభుత్వాలు, పరిశ్రమల నాయకులు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, డిజైనర్లు, కొనుగోలుదారులు, ముడిపదార్థాలను అందించే సంస్థల యజమానులు, తయారీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఈ భారత్ టెక్స్-2026... అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించడానికి, కొత్త వాణిజ్య-పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఆవిష్కరణలు-సుస్థిరతను వేగవంతం చేయడానికి, ప్రపంచస్థాయిలో వస్త్రరంగ వాణిజ్య కార్యకలాపాల్లో విశ్వసనీయ, ప్రాధాన్య భాగస్వామిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది. ప్రపంచ వస్త్ర పరిశ్రమ భవిష్యత్తుకు నాయకత్వం వహించడంలో పెరుగుతున్న భారత్ విశ్వాసం, సామర్థ్యం, నిబద్ధతలను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.

మరిన్ని వివరాల కోసం, www.bharat-tex.com ను సందర్శించండి.


(रिलीज़ आईडी: 2280566) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada