మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై జాతీయ టాస్క్ ఫోర్స్... మే 2025 నుంచి 10 రాష్ట్రాల పరిధిలోని 30 ఉన్నత విద్యా సంస్థల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు
అంతర్ విభాగాల సమన్వయం, సమానత్వంతో కూడిన విధానాన్ని నిర్ధారించడానికి పలు విడతలుగా సంప్రదింపులు
प्रविष्टि तिथि:
30 JUN 2026 3:51PM by PIB Hyderabad
ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై ఏర్పాటైన జాతీయ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టీఎఫ్), ప్రాంతీయ, సంస్థాగత పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవడం కోసం మే 2025 నుంచి 10 రాష్ట్రాల పరిధిలోని 30 ఉన్నత విద్యాసంస్థల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించింది. అంతర్ విభాగాల సమన్వయం, సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని నిర్దారించేందుక ఈ టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకు 25 మంది వాటాదారులతో సంప్రదింపులను నిర్వహించింది. 2026 జనవరి నుంచి కింది ప్రత్యేక అంశాలపై ఎన్‌టీఎఫ్ అదనపు సంప్రదింపులను పూర్తి చేసింది.
· దివ్యాంగులైన విద్యార్థులు, అధ్యాపకులు
· ఉన్నత విద్యలో కుల వివక్ష
· లింగభేదం, మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యలు
· ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్యార్థులు
· మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యను నేరపూరితం కానిదిగా మార్చడం
· ఉన్నత విద్యలో విద్యార్థుల ఆత్మహత్యల్లో లింగ సమస్య
· మానసిక ఆరోగ్య రంగంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సంప్రదింపులు
· న్యాయశాస్త్ర విద్యార్థులతో సంప్రదింపులు
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు, అలాగే వారి మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి భారత సుప్రీంకోర్టు 24 మార్చి 2025న ఈ జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తన 27 మే 2026 ఉత్తర్వుల ప్రకారం ఈ టాస్క్ ఫోర్స్ తన తుది నివేదికను సమర్పించడానికి 31 అక్టోబర్ 2026 వరకు గడువు పొడిగించింది. సర్వే డేటాను మరింత శాస్త్రీయంగా విశ్లేషించడం కోసం 6 ఫిబ్రవరి 2026 నాటి కోర్టు ఆదేశాల మేరకు భారత మాజీ ప్రధాన గణాంక అధికారి ప్రొఫెసర్ టీసీఏ అనంత్‌ను ఈ కమిటీకి సాంకేతిక సలహాదరుగా నియమించారు.
జాతీయ టాస్క్ ఫోర్స్ 3 ప్రధాన లక్ష్యాలు
1. విద్యార్ధుల ఆత్మహత్యలకు దారితీసే ప్రధాన కారణాలను గుర్తించడం
2. సంబంధిత చట్టాలు, విధానాలు, సంస్థాగత వ్యవస్థల పనితీరును విశ్లేషించడం
3. మరింత పటిష్టమైన అమలు, జవాబుదారీతనం, నివారణ చర్యలను నిర్ధారించడానికి ప్రస్తుతం ఉన్న చట్టపరమైన, సంస్థాగత వ్యవస్థల్లో అవసరమైన సంస్కరణలను ప్రతిపాదించడం. ఇందులో ప్రస్తుత లోపాలను సరిదిద్దడానికి తగిన సిఫార్సులు చేయడం, మరింత సమ్మిళిత, సహాయకరమైన విద్యా వాతావరణాన్ని సృష్టించడం, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి సమాన అవకాశాలను కల్పించడం వంటివి ఉన్నాయి.
జాతీయ టాస్క్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ (https://ntf.education.gov.in) లోని ‘పత్రికా ప్రకటనలు, నోటీసులు’ విభాగంలో ఈ కింది పత్రాలు అందుబాటులో ఉన్నాయి:
మధ్యంతర నివేదిక (నవంబర్ 2025): ఈ నివేదిక తన బాధ్యతల్లో భాగంగా మొదటి దశలో టాస్క్ ఫోర్స్ చేపట్టిన పనులను వివరిస్తుంది. ఇది ఎన్‌టీఎఫ్ పరిధి, పని విధానాన్ని స్పష్టం చేయడంతో పాటు దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టపరమైన, విధానపరమైన వ్యవస్థలను, అంతర్జాతీయ పద్ధతులను పరిశీలిస్తుంది. కొన్ని మధ్యంతర సిఫార్సులను కూడా ఇందులో పొందుపరిచారు.
స్థితిగతుల నివేదిక (జూలై 2025, మే 2026): ఈ స్థితి నివేదిక ఎన్‌టీఎఫ్ చేపట్టిన పనులను వివరిస్తూనే.. విద్యాసంస్థల క్షేత్రస్థాయి పర్యటనలు, వాటాదారుల సంప్రదింపులు, ఉన్నత విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, మానసిక ఆరోగ్య నిపుణులు పూర్తి చేసిన ఆన్‌లైన్ సర్వేలకు సంబంధించిన తాజా గణాంకాలను అందిస్తుంది.
మధ్యంతర ఉత్తర్వులు: అమిత్ కుమార్ అండ్ ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఇతరులు (క్రిమినల్ అప్పీల్ నంబర్ 1425/2025) కేసులో భారత సుప్రీం కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
***
(रिलीज़ आईडी: 2279542)
आगंतुक पटल : 5