ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘జాతీయ పెట్టుబడులు-మౌలిక సదుపాయాల నిధి’లో రూ.30వేల కోట్ల అదనపు పెట్టుబడికి మంత్రిమండలి ఆమోదం


భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడుల పెంపు... సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం

ఈ నిర్ణయంతో ‘ఎన్‌ఐఐఎఫ్‌’లో కేంద్ర ప్రభుత్వ మొత్తం పెట్టుబడి హామీ రూ.60,000 కోట్లకు చేరిక

प्रविष्टि तिथि: 29 JUN 2026 7:16PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఇతర జాతీయ ప్రాధాన్య రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడి హామీని మరింత బలోపేతం చేసే దిశగా గతవారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జాతీయ పెట్టుబడులు-మౌలిక సదుపాయాల నిధి (ఎన్‌ఐఐఎఫ్‌)కి కొత్త కేటాయింపులు సహా భవిష్యత్‌ నిధుల సమీకరణ నిమిత్తం అదనంగా రూ.30 వేల కోట్లు సమకూర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనితో ‘ఎన్‌ఐఐఎఫ్‌’కు కేంద్ర ప్రభుత్వ హామీ నిధుల మొత్తం రూ.60,000 కోట్లకు చేరింది.

భారత స్వతంత్ర పతిపత్త నిధి అయిన ‘ఎన్‌ఐఐఎఫ్‌’ను ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ (ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌) వృత్తిగతంగా నిర్వహిస్తుంది. ఈ నిధిలో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం కాగా, ప్రస్తుతం తన నిధులు-పెట్టుబడి వ్యూహాల ద్వారా దాదాపు రూ.40,000 కోట్ల మూలధన హామీతో దాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మూలధన వినియోగం-రాబడుల రీత్యా ‘ఎన్‌ఐఐఎఫ్‌’ బలమైన పనితీరును ప్రదర్శించింది. తదనుగుణంగా భారీ పోర్ట్‌ఫోలియోల నుంచి నిష్క్రమణ ద్వారా పెట్టుబడిదారులకు రూ.12,000 కోట్లు వాపసుఏ ఇచ్చింది.

“సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మల్టీలేటరల్ డెవలప్‌మెంట్”, ప్రసిద్ధ దేశీయ ఆర్థిక సంస్థలు సహా అగ్రశ్రేణి సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ‘ఎన్‌ఐఐఎఫ్‌’ మూలధనాన్ని సమీకరించింది. ఇలా నిధులు సమకూర్చిన సంస్థలలో “అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఆస్ట్రేలియన్ సూపర్, సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్, టెమాసెక్, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, యు.ఎస్.ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” వంటి దిగ్గజాలున్నాయి.

ఈ పెట్టుబడిదారు సంస్థలు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సహా విభిన్న భౌగోళిక ప్రాంతాలకు చెందినవి. వీటి నుంచి నిధులు భారీగా నిధులు సమకూరడాన్ని బట్టి, భారత్‌ పురోగమన వేగంతోపాటు ‘ఎన్‌ఐఐఎఫ్‌’ నిర్వహణ సామర్థ్యం, వాణిజ్య రంగ పనితీరుపై అంతర్జాతీయ విశ్వాసం ఇనుమడిస్తున్నదని స్పష్టమవుతోంది.

‘ఎన్‌ఐఐఎఫ్‌’ పెట్టుబడి కార్యాచరణ వ్యూహాల్లో భాగమైన మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ మార్కెట్లు, గ్రోత్ ఈక్విటీ, ఇండియా-జపాన్ బిజినెస్ కారిడార్‌లోని వాతావరణ పెట్టుబడులు గణనీయ పెట్టుబడి వేగానికి దోహదం చేశాయి.

దేశంలో తొలిసారి రూ.16000 కోట్ల మూలనిధితో ఏర్పాటైన ‘ఎన్‌ఐఐఎఫ్‌’ భారత్‌లో మునుపెన్నడూ లేనంత అతిపెద్ద దేశీయ మౌలిక సదుపాయాల నిధిగా రూపొందింది. రవాణా (రోడ్లు, రేవులు, సంబంధిత సదుపాయాలు, విమానాశ్రయాలు), ఇంధనం (పునరుత్పాదక ఇంధనం, స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ప్రసారం), డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో పురోగమనానికి ఇది అనువైన వేదికలను సృష్టించింది. స్వదేశీ నిర్వాహకుల ఆధ్వర్యంలోని అనేక అనుబంధ ‘ఏఐఎఫ్‌’లలో ‘ఎన్‌ఐఐఎఫ్‌’ పరిధిలోని ప్రైవేట్ మార్కెట్స్ ఫండ్లు పెట్టుబడి పెట్టాయి. ఆ నిధులను అవి వాతావరణ ఉపశమన ప్రాజెక్టులు, చౌక ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ సహా వెంచర్ క్యాపిటల్ సాంకేతికతల వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాయి. ఇక ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి వృద్ధి ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులపై ‘ఎన్‌ఐఐఎఫ్‌’ పరిధిలోని స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ ఫండ్ దృష్టి సారించింది. ఇందులో ఇండియా-జపాన్ ఫండ్ దాని తొలి ద్వైపాక్షిక నిధిగా ఏర్పడి, వాతావరణ, వర్తుల ఆర్థిక వ్యవస్థ, ఇంధన మార్పిడి, భారత్‌-జపాన్ వాణిజ్య కారిడార్‌ పురోగమనానికి తోడ్పడే పెట్టుబడులపై దృష్టి పెడుతోంది.

‘ఎన్ఐఐఎఫ్’ నిర్వహించే నిధులన్నీ సమష్టిగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రవాణా, ఇంధన మార్పిడి, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిక్ రవాణా, చౌక ఇళ్ల నిర్మాణం, తయారీ, సాంకేతికత వంటి కీలక రంగాల్లో పెట్టుబడులకు మూలధనాన్ని కేటాయించాయి. ఈ పెట్టుబడులన్నీ గతిశక్తి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, సీఓపీ బాధ్యతలు, ‘ఫేమ్‌’, పీఎం ఇ-డ్రైవ్‌ వంటి ప్రధాన పథకాల జాతీయ ప్రాథమ్యాలకు అనుగుణంగా ఉండటం గమనార్హం.

మరోవైపు ప్రైవేట్ రంగ పెట్టుబడులను వేగిరపరచే కొత్త ‘పీపీపీ’ కార్యక్రమాలు, పెట్టుబడి వ్యూహాలకు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర సంస్థలకు ఆర్థిక చేయూత ద్వారా ‘ఎన్ఐఐఎఫ్’ వ్యూహాత్మక సలహాదారు పాత్రను కూడా పోషిస్తోంది. ఇందులో ‘మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్, రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్’ వంటివాటిని రూపొందించే దిశగా సలహాలు-విధానపరమైన మద్దతు, ద్రవ్యీకరణ, ‘పీపీపీ’ నిర్మాణాలపై ప్రభుత్వ అధికారుల ద్వారా సహకారం, జాతీయ ప్రాధాన్యాల మేరకు ఇతర రంగాల వారీ పెట్టుబడి చట్రాలపై  సలహాలు, సూచనలు కూడా ఇస్తోంది.

దేశానికి అదనపు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్సించడంతోపాటు భారత ప్రగతి ప్రస్థానానికి తోడ్పడటంలో ‘ఎన్ఐఐఎఫ్’ ఏళ్ల తరబడి కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిధి విశిష్టతను గుర్తిస్తూ అదనపు ఆర్థిక తోడ్పాటుకు ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల రవాణా, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, ఇ-మొబిలిటీ, ఇతర జాతీయ ప్రాముఖ్యంగల ప్రాజెక్టులు సహా పలు రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఈ నిర్ణయం దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ‘ఎన్ఐఐఎఫ్‌’కు సమకూర్చే రూ.30 వేల కోట్ల అదనపు పెట్టుబడి ఆధారంగా దీనికింద రెండో మౌలిక సదుపాయాల కేంద్రక నిధి (‘ఎన్ఐఐఎఫ్‌’ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్-II)ని ఏర్పాటు చేస్తారు. ఇది తొలి ప్రధాన నిధికి వారస నిధిగా సుమారు రూ.30,000 కోట్ల నిధుల సమీకరణపై లక్ష్యనిర్దేశంతో కృషి చేస్తుంది. ఇది రవాణా, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, ఇ-మొబిలిటీ వంటి వర్ధమాన రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ కేటాయింపు ద్వారా కొత్త వ్యూహాలకు, తదుపరి ద్వైపాక్షిక, ఇతర వ్యూహాత్మక నిధులకు కూడా ‘ఎన్ఐఐఎఫ్’ రెండో నిధి మద్దతిస్తుంది.

ప్రస్తుత ప్రభుత్వ కేటాయింపులు, అంతర్లీన ఆస్తులు, పోర్ట్‌ఫోలియో కంపెనీలలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థపై బహుళ ప్రభావం చూపుతుందని అంచనా. తద్వారా ఇది నాణ్యమైన మౌలిక సదుపాయాలకు, ప్రత్యక్ష-పరోక్ష ఉద్యోగాల కల్పనకు, జాతీయ ప్రాధాన్యంగల కీలక రంగాల వృద్ధికి దోహదం చేస్తుంది. తద్వారా స్వయంసమృద్ధికి, దేశం 2047 నాటికి ‘వికసిత భారత్‌’గా రూపొందడానికి సారథ్యం వహించగలదు.

***


(रिलीज़ आईडी: 2279199) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada