పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీపై విధించిన తాత్కాలిక ఆంక్షలను ఉపసంహరించిన ప్రభుత్వం
प्रविष्टि तिथि:
29 JUN 2026 8:00PM by PIB Hyderabad
ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) బంకుల్లో పెట్రోల్ (ఎంఎస్-మోటార్ స్పిరిట్), డీజిల్ (హెచ్ఎస్‌డీ- హై స్పీడ్ డీజిల్) అమ్మకాలు, పంపిణీపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉపసంహరించింది. ఇది 2026 జూలై 1 నుంచి అమలులోకి రానుంది.
పశ్చిమాసియా సంక్షోభంతో సరఫరా అంతరాయాలు ఏర్పడిన సమయంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ రిటైల్ వినియోగదారులపై ఆ భారం పడకుండా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచింది. దీనివల్ల సాధారణ రిటైల్ ఇంధన ధరలకు, భారీ మొత్తంలో కొనుగోలు చేసే (బల్క్) వినియోగదారులకు వర్తించే ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఫలితంగా కొందరు పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు తమకు కావలసిన ఇంధనాన్ని రిటైల్ బంకుల నుంచి కొనుగోలు చేయటం ప్రారంభించారు. ఇది ఇంధన మళ్లింపు, అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌కు దారితీయటంతో ఇంధనం విషయంలో సమాన పంపిణీకి ఆటంకం కలిగింది.
ఈ పరిస్థితిని అదుపు చేయడం కోసం 2026 జూన్ 12న ప్రభుత్వం తాత్కాలిక నియంత్రణ చర్యలను ప్రవేశపెట్టింది. రిటైల్ బంకుల్లో ఒక వినియోగదారుడు లేదా వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ (హెచ్ఎస్‌డీ) మాత్రమే ఇచ్చేలా తాత్కాలిక పరిమితిని విధించింది. పారిశ్రామిక, సంస్థాగత, వాణిజ్య వినియోగదారులు రిటైల్ బంకుల నుంచి కాకుండా వారి కోసం కేటాయించిన ప్రత్యేక పంపుల ద్వారానే ఇంధనాన్ని కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టింది. సాధారణ రిటైల్ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉంచడంతో పాటు డీజిల్ నల్లబజారు క్రయవిక్రయాలు, అక్రమ నిల్వ, మళ్లింపులను అరికట్టే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంది.
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రజా ప్రయోజనార్థం ఇకపై తాత్కాలిక నియంత్రణ చర్యలు అవసరం లేదని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దీని ప్రకారం 2026 జూన్ 12 నాటి ఉత్తర్వులను 2026 జూలై 1 నుంచి అమలులోకి వచ్చేలా రద్దు చేసింది.
ఈ తాత్కాలిక చర్యలు సాధారణ రిటైల్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత మొత్తంలో అందుబాటులో ఉండేలా చేయడంలో సహాయపడ్డాయి. ఇప్పుడు ఈ ఆంక్షలను రద్దు చేయడం అనేది ఇంధన సరఫరా పరిస్థితి మెరుగుపడటాన్ని, సరఫరా ఏర్పాట్లు మళ్లీ యథాస్థితికి చేరుకోవడాన్ని తెలియజేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2279195)
आगंतुक पटल : 18