ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చిన్న క్లినిక్‌ల కోసం ‘సీ-డాక్’ రూపొందించిన ‘లైట్‌ ఏబీడీఎం’ ఆధారిత ‘ఇ-సుశ్రుత్@క్లినిక్’ సదుపాయాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె.పి.నడ్డా


చిన్న క్లినిక్‌లలో ఆరోగ్య వ్యవస్థ డిజిటలీకరణ సమస్యలను ఇది పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ మద్దతుగల చౌక ‘హెచ్‌ఎంఐఎస్’ అవసరాన్ని ఇది తీరుస్తుంది

प्रविष्टि तिथि: 29 JUN 2026 4:54PM by PIB Hyderabad

  దేశంలోని అనేక చిన్న ఔట్‌ పేషెంట్ క్లినిక్‌లు నేటి ఆధునిక యుగంలోనూ మానవ శక్తి వినియోగ పద్ధతుల్లో సేవలందిస్తున్నాయి. మరోవైపు డిజిటల్‌ సాంకేతిక పరిష్కారాల కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి చిన్న ఆస్పత్రులు భారీ ఆరోగ్య సమాచార నిర్వహణ వ్యవస్థను (హెచ్‌ఎంఐఎస్) సమకూర్చుకోవడంలో సంక్లిష్టమే కాకుండా ఆర్థిక భారం కూడా మోయాల్సి వస్తుంది. అందువల్ల అలాంటి క్లినిక్‌లు ఆరోగ్య వ్యవస్థ డిజిటలీకరణ సదుపాయాలను అందిపుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. ప్రైవేట్ ‘హెచ్‌ఎంఐఎస్’లు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ సంక్లిష్టత, ఆర్థిక భారం నేపథ్యంలో ప్రభుత్వ మద్దతుగల చౌక ‘హెచ్‌ఎంఐఎస్’ల అవసరాన్ని వివిధ మైక్రోసైట్ భాగస్వామ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణలో ఇలాంటి సౌకర్యాల వినియోగంపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఆరోగ్య సంరక్షణ రంగం డిజిటలీకరణ ఇంకా తరుణ దశలో ఉన్నందున తదనుగుణ ‘హెచ్‌ఎంఐఎస్’ను అందుబాటులోకి తెస్తే ‘ఏబీడీఎం’ అమలులోనూ ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు న్యూఢిల్లీలో “ఇ-సుశ్రుత్@క్లినిక్‌” పేరిట తేలికపాటి ‘హెచ్‌ఎంఐఎస్‌’ ను ప్రారంభించారు. చిన్న ఔట్‌పేషెంట్ క్లినిక్‌ల కోసం ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్’ (సి-డాక్) ఈ సదుపాయాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. దీని ద్వారా వినియోగదారు అనుకూల డిజిటల్ సౌకర్యం  చౌకగా, సరళంగా అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రభుత్వ ‘పీహెచ్‌సీలు, హెచ్‌డబ్ల్యూసీలు, సబ్‌సెంటర్లు’ సహా ప్రైవేట్ క్లినిక్‌లకూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 800కు పైగా ఆరోగ్య కేంద్రాలు ‘ఇ-సుశ్రుత్@క్లినిక్‌’ కింద నమోదు చేసుకుని, 680కి పైగా ఆరోగ్య రికార్డులను సృష్టిస్తున్నాయి. మరోవైపు ఇ-సుశ్రుత్ సాఫ్ట్‌వేర్‌ను కూడా ‘సీ-డాక్’ అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్రస్తుతం దేశవ్యాప్తంగా గల 15కు పైగా ‘ఎయిమ్స్‌’ సహా వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తున్నారు.

‘ఇ-సుశ్రుత్@క్లినిక్’ విశిష్టతలు:

ఔట్‌పేషెంట్ క్లినిక్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తేలికపాటి, క్లౌడ్-ఆధారిత ‘హెచ్‌ఎంఐఎస్‌’ సౌలభ్యం కల్పించే ఈ డిజిటల్‌ వేదిక కింది సౌకర్యాలు కల్పిస్తుంది:

·        క్లినిక్ కార్యకలాపాలు స్వయంచలితం: పేషెంట్ రిజిస్ట్రేషన్, బిల్లింగ్, ఎంఐఎస్‌ రిపోర్టింగ్, స్పీచ్ టు టెక్స్ట్ వర్క్‌ఫ్లో, క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ వంటి పనులు సులువవుతాయి. తద్వారా పనిభారంతోపాటు తప్పులు తగ్గుతాయి.

·        స్వల్ప వ్యయంతో లభ్యత: చిన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, క్లినిక్‌లకు స్వల్ప వ్యయంతో డిజిటల్ ఆరోగ్య సేవల ప్రదానానికి వీలు కల్పించడం ద్వారా ఆర్థిక భారం తగ్గింపు.

·        వినియోగ సౌలభ్యం: క్లినిక్ సిబ్బందికి ఎలాంటి సాంకేతిక నైపుణ్యం లేకపోయినా, సరళంగా, సులువుగా అర్థం చేసుకుంటూ వినియోగించేలా రూపకల్పన.

·        క్లౌడ్-ఆధారిత వ్యవస్థ: సంక్లిష్ట సెటప్‌ అవసరం లేకుండా ఏ పరికరం ద్వారానైనా వినియోగ సౌలభ్యంగల సరళ వేదిక.

·        హెచ్‌పీఆర్‌.. హెచ్‌ఎఫ్‌ఆర్‌ నమోదు ప్రక్రియలో ఇదొక భాగం. హెచ్‌పీఆర్‌ లేని వైద్యులు దీన్ని ఉపయోగించలేరు కాబట్టి, అధీకృత వైద్యులు మాత్రమే ‘ఇ-సుశ్రుత్@క్లినిక్‌’ను వాడేవిధంగా ఇది భరోసా ఇస్తుంది.

·        ‘ఏబీడీఎం’ సంబంధిత తాజా విశిష్టతలు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి (ఉదా॥ Find ABHA, CDSS, Scan & Share, Speech to text).

డిజిటల్ ఆరోగ్యం, ‘ఏబీడీఎం’ వినియోగాన్ని పెంచే కర్తవ్యంలో భాగంగా నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) ‘సీ-డాక్‌’తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దీని ప్రకారం- సాఫ్ట్‌వేర్ నిర్వహణ, ఉన్నతీకరణ బాధ్యతలను ‘సీ-డాక్‌’ చూసుకుంటుంది. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయంతోపాటు ‘ఎన్‌హెచ్‌ఏ’ తన వంతు సహకారం అందిస్తుంది. ఈ ఆర్థిక సహాయం కింది అంశాలకు సంబంధించినదిగా ఉంటుంది:

·        ఏబీడీఎం, ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి రోగులకు పంపే ‘ఎస్‌ఎంఎస్‌’ ఛార్జీలు

·        అనువర్తన సంబంధిత ‘క్లౌడ్ హోస్టింగ్’ ఛార్జీలు

వినియోగదారులకు ‘ఎల్‌1’ స్థాయి మద్దతు దిశగా కాల్ సెంటర్ సేవలను ‘ఎన్‌హెచ్‌ఏ’ విస్తరిస్తోంది. కాల్ సెంటర్ ఉద్యోగులకు శిక్షణతోపాటు నాణ్యత తనిఖీ బాధ్యతలను ‘సీ-డాక్‌’ నిర్వర్తిస్తుంది.

‘ఇ-సుశ్రుత్@క్లినిక్‌’పై వ్యయాన్ని ఐదుగురు వినియోగదారులకు నెలకు ₹499గా అంచనా వేశారు. ‘ఎన్‌హెచ్‌ఏ’తో ఒప్పందం వల్ల ఇందులో ₹200 తగ్గింపు లభిస్తుంది కాబట్టి, వాస్తవ వ్యయం నెలకు ₹299కి తగ్గుతుంది. ఇక తొలి 3 నెలల పాటు ఈ సాఫ్ట్‌వేర్ ఉచితంగా లభిస్తుంది... అటుపైన నిర్ణీత ఐదుగురు వినియోగదారుల పరిమితికి మించి అదనంగా చేరే ప్రతి ఒక్కరికీ తలా ₹50 వంతున ఛార్జీ విధిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2279188) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil