ఆర్థిక మంత్రిత్వ శాఖ
చెన్నై, ముంబయిలలో చైనా బాణసంచా స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేసిన డీఆర్‌ఐ
రూ. 35 కోట్ల విలువైన చైనా పటాకుల స్వాధీనం, 12 మంది అరెస్ట్
प्रविष्टि तिथि:
27 JUN 2026 9:14PM by PIB Hyderabad
ప్రమాదకరమైన నిషేధిత వస్తువుల అక్రమ రవాణా విషయంలో కొనసాగుతున్న వరుస తనిఖీలలో భాగంగా చెన్నై ఓడరేవు ద్వారా చైనా నుంచి భారత్‌లోకి చైనా బాణసంచాను అక్రమంగా తరలించేందుకు జరిగిన రెండు వేర్వేరు ప్రయత్నాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) విజయవంతంగా అడ్డుకుంది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా చైనా నుంచి వచ్చిన రెండు 40 అడుగుల కంటైనర్లను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితులు ఈ కంటైనర్లలో ట్రాలీ బ్యాగులు, స్ప్రేయర్లు ఉన్నట్లు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. అధికారులు నిశితంగా తనిఖీ చేయగా పైన ఉన్న సరుకు వెనుక చాలా చాకచక్యంగా దాచి ఉంచిన సుమారు 46,000 చైనా బాణసంచా బయటపడ్డాయి.
డీఆర్‌ఐ అందించిన పక్కా సమాచారంతో చేపట్టిన మరో ఆపరేషన్‌లో చెన్నై కస్టమ్స్ అధికారులు.. 18.7 మెట్రిక్ టన్నుల చైనా బాణసంచాను రహస్యంగా తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. కస్టమ్స్ అధికారుల అనుమతి లేకుండానే నిషేధిత వస్తువులు ఉన్న కంటైనర్‌ను కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్ఎస్) నుంచి అక్రమంగా బయటకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత అందులోని బాణసంచాను దించి ఆ కంటైనర్‌లో వేరే సరుకును నింపి యథావిధిగా తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. ఈ రహస్య ఆపరేషన్ సజావుగా సాగడానికి ఒక సీఎఫ్ఎస్ సిబ్బంది సహాయం చేశారు. ఈ కేసులో సదరు సీఎఫ్ఎస్ సిబ్బందితో సహా ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు.
విదేశీ వాణిజ్య విధానం కింద ఐటీసీ (హెచ్ఎస్) వర్గీకరణ ప్రకారం బాణసంచా దిగుమతి 'పరిమితం చేసిన (రిస్ట్రిక్టెడ్)’ విభాగం కిందకు వస్తుంది. వీటికి పేలుడు పదార్థాల నిబంధనలు- 2008 ప్రకారం డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), పెసో (పీఈఎస్ఓ - పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) రెండింటి నుంచి చెల్లుబాటు అయ్యే లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలి. ఇటువంటి ప్రమాదకరమైన వస్తువులను అక్రమంగా దిగుమతి చేసుకోవడం వల్ల ప్రజల భద్రతకు, దేశ రక్షణకు, ఓడరేవుల మౌలిక సదుపాయాలకు, షిప్పింగ్- లాజిస్టిక్స్ రంగానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది.
2026 మే నుంచి ముంబయిలో డీఆర్‌ఐ వరుసగా నిర్వహించిన ఆపరేషన్లలో మొత్తంగా 100 మెట్రిక్ టన్నులకు పైగా చైనా బాణసంచాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలో డీఆర్‌ఐ నమోదు చేసిన ఒక కేసులో స్మగ్లింగ్‌కు సహకరించడం, సరుకును మార్పిడి చేయడానికి ప్రయత్నించడంలో సీఎఫ్ఎస్ ఉద్యోగుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఎగుమతుల మేనేజర్‌తో సహా నలుగురు సీఎఫ్ఎస్ సిబ్బంది.. మొత్తం 10 మంది నిందితులను అధికారులు అరెస్టు చేశారు.
మొత్తం మీద తాజా స్వాధీనంతో కలిపి ఈ ఆపరేషన్లలో భారీ ఎత్తున సుమారు రూ. 35 కోట్ల విలువైన చైనా బాణసంచాను స్వాధీనం చేసుకోవడమే కాకుండా మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేశారు.
***
(रिलीज़ आईडी: 2278770)
आगंतुक पटल : 25