అణుశక్తి విభాగం
ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన అణుశక్తి శాఖ (డీఏఈ)
ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి వెలువడే అణు ఉష్ణాన్ని ఉపయోగించి 'కాపర్- క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్' ఆధారంగా పని చేయనున్న కేంద్రం
ఎఫ్‌బీటీఆర్ నుంచి వచ్చే అణు ఉష్ణాన్ని ఉపయోగించుకుంటూ 'కాపర్- క్లోరిన్' థర్మోకెమికల్ పద్ధతిలో పనిచేసే ఇది, ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఉత్పాదక కేంద్రం
ప్రస్తుతం భారత్‌లో పనిచేస్తున్న ఏకైక ఫాస్ట్ రియాక్టర్ పరిశోధన కేంద్రమైన ఎఫ్‌బీటీఆర్ విశిష్ట సామర్థ్యాల ఆధారంగా జరిగిన నిర్మాణం
అధునాతన రియాక్టర్ సాంకేతికతలు, అణుశక్తికి సంబంధించిన వినూత్న విద్యుతేతర అనువర్తనాలలో ఐజీకార్ అగ్రగామి పాత్రను తెలియజేస్తున్న ఈ కేంద్రం
‘బార్క్’ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన 'కాపర్- క్లోరిన్' థర్మోకెమికల్ హైడ్రోజన్ ఉత్పాదక సాంకేతికతను విజయవంతంగా క్షేత్రస్థాయి పరిశ్రమగా మార్చడాన్ని చాటిచెబుతున్న ఈ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం
అణుశక్తి పాత్రను కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం చేయకుండా పర్యావరణహిత హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి కూడా విస్తరించడం ద్వారా ముందుకెళ్తున్న భారతదేశపు మూడంచెల అణు కార్యక్రమం
प्रविष्टि तिथि:
26 JUN 2026 9:14PM by PIB Hyderabad
భారతదేశ పర్యావరణహిత ఇంధన, అధునాతన అణు సాంకేతిక కార్యక్రమాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. కల్పాక్కంలోని 'ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్'లో (ఐజీకార్) ఉన్న ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (ఎఫ్‌బీటీఆర్) నుంచి అణు ప్రక్రియలో భాగంగా వెలువడే ఉష్ణాన్ని (ప్రాసెస్ హీట్) ఉపయోగించి 'కాపర్-క్లోరిన్' థర్మోకెమికల్ సైకిల్ ఆధారంగా పనిచేసే ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని అణుశక్తి శాఖ (డీఏఈ) ఈ రోజు అధికారికంగా ప్రారంభించింది. ఐజీకార్ డైరెక్టర్ శ్రీ శ్రీకుమార్ జీ. పిళ్లై సమక్షంలో అణుశక్తి శాఖ కార్యదర్శి, అణు శక్తి కమిషన్ (ఏఈసీ) చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మహంతి ఈ సరికొత్త కేంద్రాన్ని ప్రారంభించారు.
ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన 'కాపర్-క్లోరిన్' థర్మోకెమికల్ ప్రక్రియ ద్వారా అణుశక్తిని ఉపయోగించి హైడ్రోజన్‌ను ఎలా ఉత్పత్తి చేయోచ్చో నిరూపించడానికి ఒక సాంకేతిక ప్రదర్శన కేంద్రంగా దీనిని ఏర్పాటు చేశారు. అణు ప్రక్రియలో వచ్చే ఉష్ణాన్ని హైడ్రోజన్ ఉత్పత్తి ప్రక్రియతో విజయవంతంగా అనుసంధానించడం అనేది ఒక అద్భుతమైన సాంకేతిక ఘనత కానుంది. ఇది అధునాతన అణు రియాక్టర్లను ఉపయోగించి పర్యావరణహిత, కర్బన రహిత హైడ్రోజన్‌ను భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఒక ఆశాజనకమైన మార్గాన్ని సుగమం చేస్తుంది.
భవిష్యత్తులో హైడ్రోజన్ ఒక అత్యంత కీలకమైన ఇంధన వాహకంగా ఉండబోతుంది. పర్యావరణహిత, సుస్థిర ఇంధన వనరుల వైపు ప్రపంచ దేశాలు సాగిస్తున్న ప్రయాణంలో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వివిధ రకాల హైడ్రోజన్ ఉత్పాదక సాంకేతికతల్లో 'కాపర్- క్లోరిన్' థర్మోకెమికల్ సైకిల్ అత్యంత ఆశాజనకమైన పద్ధతుల్లో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఇది తక్కువ నిర్వహణ ఉష్ణోగ్రత వద్ద పనిచేయడమే కాకుండా అత్యధిక ఉష్ణగతిక సామర్థ్యాన్ని (థర్మోడైనమిక్ ఎఫిషియెన్సీ) కలిగి ఉంటుంది. ఫాస్ట్ రియాక్టర్ల నుంచి వెలువడే అణు ఉష్ణాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రక్రియ సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా పాత పద్ధతుల్లో హైడ్రోజన్ ఉత్పత్తి చేసినప్పుడు వెలువడే హరితగృహ వాయువులను పూర్తిగా నివారిస్తుంది.
బార్క్, ఐజీకార్ సంయుక్తంగా చేపట్టిన విస్తృత పరిశోధనలు, ప్రక్రియల అభివృద్ధి (ప్రాసెస్ డెవలప్‌మెంట్), ఇంజనీరింగ్ డిజైన్, పరికరాల తయారీ (ఫ్యాబ్రికేషన్), ఇన్‌స్టాలేషన్, పరీక్షలు, కమీషనింగ్ ప్రయత్నాల ఫలితంగానే ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రం పరిశోధకులకు విలువైన కార్యాచరణ అనుభవాన్ని అందించడమే కాకుండా 'కాపర్- క్లోరిన్' ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా వాణిజ్యపరమైన వినియోగం కోసం అణుశక్తి ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి సాంకేతికతలను భారీ ఎత్తున విస్తరించే భవిష్యత్ పరిశోధనలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ అజిత్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. "హైడ్రోజన్ ఉత్పత్తి వంటి సరికొత్త పర్యావరణహిత ఇంధన సాంకేతికతలతో అణుశక్తిని అనుసంధానించడం అనేది సుస్థిర ఇంధన భవిష్యత్తు వైపు ఒక వ్యూహాత్మక మార్గాన్ని చూపుతుంది. నమ్మకమైన, కర్బన రహిత విద్యుత్‌ను అందించడమే కాకుండా ప్రక్రియలో భాగంగా వెలువడే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన వేడిని కూడా సమకూర్చగల విశిష్ట సామర్థ్యం ఒక్క అణుశక్తికే ఉంది. ఇది భారత ఇంధన భద్రత, కర్బన ఉద్గారాల నిర్మూలన లక్ష్యాలు, దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతూనే మరోవైపు భారీ ఎత్తున హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి సరిగ్గా సరిపోతుంది. నిరంతర అంకితభావం, ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యంతో ఒక అధునాతన శాస్త్రీయ భావనను క్షేత్రస్థాయి వాస్తవంగా మార్చిన బార్క్, ఐజీకార్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక బృందాలను నేను అభినందిస్తున్నాను. అధునాతన అణు సాంకేతికతలు, పర్యావరణహిత ఇంధన వ్యవస్థల్లో భారత్‌కు పెరుగుతున్న సామర్థ్యాలకు ఈ విజయమే నిదర్శనం" అని పేర్కొన్నారు.
అణుశక్తి శాఖ పరిధిలోని భారతదేశపు అగ్రగామి అణు పరిశోధన సంస్థలలో ఒకటైన ఐజీకార్.. 1971లో ఏర్పాటైనప్పటి నుంచి దేశంలోని 'ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్' కార్యక్రమాలలో అగ్రభాగాన నిలిచింది. ఈ కేంద్రం 'ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్'ను (ఎఫ్‌బీటీఆర్) విజయవంతంగా డిజైన్ చేసి నిర్మించటంతో పాటు విజయవంతంగా నిర్వహించింది. ఈ రియాక్టర్ నాలుగు దశాబ్దాలకు పైగా ఇంధనాలు, పదార్థాలు, సోడియం సాంకేతికతల అభివృద్ధి, వాటి ప్రామాణీకరణకు (వాలిడేషన్) ఒక అమూల్యమైన వేదికగా ఉపయోగపడింది. ఎఫ్‌బీటీఆర్ ద్వారా లభించిన విజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం.. భారత ఫాస్ట్ రియాక్టర్ కార్యక్రమానికి బలమైన పునాదిని వేశాయి. భారతదేశపు మూడంచెల అణు విద్యుత్ కార్యక్రమంలో రెండో దశకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 500 మెగావాట్ ఎలక్ట్రికల్ 'ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్' (పీఎఫ్‌బీఆర్) అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించింది.
ఐజీకార్ డైరెక్టర్ శ్రీ శ్రీకుమార్ జీ. పిళ్లై మాట్లాడుతూ.. "ఐజీకార్‌లో చేపట్టిన ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ కార్యక్రమం ద్వారా లభించిన నాలుగు దశాబ్దాలకు పైగా కార్యాచరణ అనుభవం, సాంకేతిక నైపుణ్యాల పునాదిపైనే ఈ అద్భుత విజయం సాకారమైంది. అణు ప్రక్రియలోని ఉష్ణాన్ని ఉపయోగించి హైడ్రోజన్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేయటం అనేది అధునాతన అణు వ్యవస్థల బహుముఖ ప్రజ్ఞను చాటిచెబుతోంది. భారతదేశ పర్యావరణహిత ఇంధన పరివర్తనకు, దీర్ఘకాలిక ఇంధన భద్రతకు దోహదపడే వినూత్న సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఐజీకార్‌కు ఉన్న నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది" అని పేర్కొన్నారు.
గడిచిన సంవత్సరాల్లో రియాక్టర్లకు సంబంధించిన భౌతిక శాస్త్రం, థర్మల్ హైడ్రాలిక్స్, అధునాతన పదార్థాలు, సోడియం సాంకేతికత, ఇంధన చక్రం పరిశోధన, ఇన్‌స్ట్రుమెంటేషన్, నియంత్రణ వ్యవస్థలు, రిమోట్ హ్యాండ్లింగ్, విధ్వంసక రహిత ఇవాల్యుయేషన్, అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతకు సంబంధించిన ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ఐజీకార్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సామర్థ్యాలను సాధించింది. దీని అద్భుతమైన సహకారం భారత సాంకేతిక స్వయంసమృద్ధిని నిరంతరం బలోపేతం చేయడమే కాకుండా అధునాతన అణు సాంకేతికతల్లో ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలిచిన మన దేశ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తోంది.
ఈ కేంద్రం ప్రారంభమవటం... అణుశక్తి, పర్యావరణహిత హైడ్రోజన్ సాంకేతికతల కలయిక ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికతను సాకారం చేసుకునే దిశగా పడిన ఒక అతిపెద్ద అడుగు. ఇది స్వదేశీ ఆవిష్కరణల పట్ల అణుశక్తి శాఖకు ఉన్న నిరంతర నిబద్ధతను చాటిచెబుతోంది. 'వికసిత్ భారత్' కోసం ఒక సుస్థిరమైన, సురక్షితమైన, తక్కువ కర్బనం కలిగిన ఇంధన భవిష్యత్తును నిర్మించాలనే భారత దృఢ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2278522)
आगंतुक पटल : 17