సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
అత్యవసర పరిస్థితి 50 ఏళ్ల సందర్భాన్ని రాజ్యాంగ హత్యగా అభివర్ణిస్తూ
ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ
కార్యక్రమానికి నేతృత్వం వహించిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
प्रविष्टि तिथि:
25 JUN 2026 9:27PM by PIB Hyderabad
అత్యవసర పరిస్థితి 50 ఏళ్ల సందర్భాన్ని రాజ్యాంగ హత్యగా అభివర్ణిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్టీ) న్యూఢిల్లీలోని తన క్యాంపస్‌లో సంవిధాన్ హత్యా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1975లో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)కి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యత, పౌరుల హక్కుల పట్ల ప్రజల్లో అవగాహనను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్యం భారతదేశ మూలాల్లోనే ఉందని, ఈ కార్యక్రమం స్వాతంత్ర్యం కోసం పోరాడిన అజ్ఞాత వీరులను గౌరవించుకునే గొప్ప సందర్భమని పేర్కొన్నారు. గడచిన కాలంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ భారత ప్రజాస్వామ్యం సుస్థిర మనుగడకు, దృఢత్వానికి ఈ సందర్భం ఒక నిదర్శనంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల రాజకీయం మాత్రమే ప్రజాస్వామ్యం కాదనీ, భావప్రకటనా స్వేచ్ఛ, భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే స్వాతంత్ర్యం, స్వేచ్ఛాయుత మీడియా, ప్రజల ఆత్మగౌరవం, రాజ్యాంగ ఆధిపత్యమే నిజమైన ప్రజాస్వామ్యమనీ మంత్రి స్పష్టం చేశారు. గతాన్ని పరిశీలిస్తే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజ్యాంగం గొప్పతనాన్నీ, వాటి కోసం చెల్లించిన మూల్యాన్నీ వాస్తవంగా అంచనా వేయడానికీ, ఆలోచించడానికీ అత్యవసర పరిస్థితి ఒక సందర్భాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్; ఐజీఎన్‌సీఏ అధ్యక్షుడు శ్రీ రామ్ బహదూర్ రాయ్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సమర్ నందా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ కె. కె. మిశ్రా, సీసీఆర్టీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ నారాయణ్ ఇందుర్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి‘ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రదర్శన అత్యవసర పరిస్థితి కలిగించిన దుష్ప్రభావాన్ని ప్రముఖంగా చూపించడంతో పాటు, ప్రజాస్వామ్య సంస్థలనూ, రాజ్యాంగ పరమైన స్వేచ్ఛను పరిరక్షించవలసిన ప్రాముఖ్యతనూ వివరించింది. డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీని కూడా ప్రదర్శించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న వ్యక్తులు, సంఘటనలు, ప్రాంతాల కథలను జిల్లా స్థాయిలో అన్వేషించి, భద్రపరచడానికి చేసిన ప్రయత్నమే డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీ రూపకల్పనకు దారితీసింది.
ఈ ప్రదర్శనను 2026 జూన్ 24న సీసీఆర్‌టీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ నారాయణ్ ఇందుర్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంవిధాన్ హత్యా దివస్ పై రూపొందించిన లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.
భారత ప్రజాస్వామ్యం సుస్థిరతను కొనియాడుతూ ప్రముఖ ఫ్లూట్ విద్వాంసుడు పండిట్ చేతన్ జోషి దర్శకత్వంలో ‘ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంగీత నివాళి - నిశ్శబ్దం నుంచి స్వరం వైపు, చీకటి నుంచి ఉదయం వైపు‘ పేరుతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ప్రదర్శించారు.
అత్యవసర పరిస్థితి సమయంలో జైలు శిక్ష అనుభవించిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత శ్రీ రామ్ బహదూర్ రాయ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆ కాలంలో దేశం ఎదుర్కొన్న సవాళ్లనూ, భారతదేశంలోని ప్రజాస్వామ్య సంస్థల నిబద్ధతనూ, బలాన్నీ ఆయన తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీ సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న జిల్లా స్థాయి కథలు, సంఘటనలు, ప్రముఖ వ్యక్తులు, ప్రాంతాలను గుర్తించి, భద్రపరచడమే లక్ష్యంగా ఒక జాతీయ స్థాయి కార్యక్రమంగా డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీని ఉద్దేశించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అనేక స్థానిక కథనాలను సేకరించి, లిఖితపూర్వకంగా భద్రపరచడం ద్వారా సీసీఆర్‌టీ ఈ కార్యక్రమానికి గణనీయమైన సహకారాన్ని అందించింది.
దేశం కోసం చేసిన సేవలకు గుర్తింపుగా సీనియర్ స్వాతంత్ర్య సమరయోధులు, ఇప్పటికీ జీవించి ఉన్న వీరులు శ్రీ శేషారావు లక్ష్మణ్‌రావు ఖోత్, శ్రీ ఎద్దుల సూర్యనారాయణ రెడ్డిలను వారి కుటుంబ సభ్యులతో సహా ఘనంగా సన్మానించారు. డిజిటల్ రిపోజిటరీని మరింత సంపన్నంగా మార్చడంలో సహాయపడిన ఉపాధ్యాయులనూ, పరిశోధకులనూ, వివిధ సంస్థలనూ కూడా సత్కరించారు. డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీ ఆధారంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన, డాక్యుమెంటరీల ప్రదర్శన, రిపోజిటరీలోని కథనాల స్ఫూర్తితో కళాకారులు గీసిన చిత్రాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సేవా పర్వ్’ కార్యక్రమంలో భాగంగా సృష్టించిన కళాఖండాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. కళల కలయికతో వికసిత భారతం - ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కళాత్మక భాగస్వామ్యం ద్వారా సాంస్కృతిక గర్వాన్నీ , సృజనాత్మకతనూ సామాజిక బాధ్యతనూ పెంపొందించింది.
***
(रिलीज़ आईडी: 2278175)
आगंतुक पटल : 9