నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కౌశల్ మహోత్సవ్ - వరంగల్ 2026ను ప్రకటించిన నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలంగాణ యువతకు 5,000లకు పైగా ఉపాధి అవకాశాలు
प्रविष्टि तिथि:
25 JUN 2026 7:32PM by PIB Hyderabad
తెలంగాణలోని వరంగల్‌లో గల కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- సైన్స్ (కేఐటీఎస్) వేదికగా ఈ నెల 27న కౌశల్ మహోత్సవ్ - వరంగల్ 2026ను నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్‌డీఈ) ఈ రోజు ప్రకటించింది.
కేఐటీఎస్ వేదికగా నిర్వహించిన పత్రికా సమావేశంలో నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ వి.ఎస్. అరవింద్ ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ఉపాధి-శిక్షణ విభాగ ప్రాంతీయ ఉపాధి అధికారి శ్రీ తౌటం రాము, కేఐటీఎస్ రిజిస్ట్రార్ శ్రీ కోమల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కౌశల్ మహోత్సవ్... వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చడం సహా, తెలంగాణ వ్యాప్తంగా యువతకు 5,000లకు పైగా ఉపాధి అవకాశాలను అందించనుంది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమలతో అనుసంధానించడం, అక్కడికక్కడే ఇంటర్వ్యూల నిర్వహణను సులభతరం చేయడం, ఉపాధితో పాటు అప్రెంటీస్‌షిప్ అవకాశాల ద్వారా వారి సుస్థిర జీవనోపాధికి మార్గాలను సుగమం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.
పాఠశాల విద్య పూర్తి చేసినవారు, ఐటీఐ-డిప్లొమా చదివిన వారు, పట్టభద్రులు, మెరుగైన కెరీర్ అవకాశాల కోసం చూస్తున్న నైపుణ్యం గల యువత సహా విభిన్న విద్యార్హతలు, నైపుణ్య స్థాయులు గల అభ్యర్థులకు ఈ కార్యక్రమం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. తయారీ, రిటైల్, లాజిస్టిక్స్, ఆటోమోటివ్, టెక్స్‌టైల్, ఐటీ-ఐటీఈఎస్, హెల్త్‌కేర్, పర్యాటకం-ఆతిథ్యం, టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్-ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) వంటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు కంపెనీల యాజమాన్యాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఇది మారుతున్న ఉపాధి కల్పన తీరునూ, నైపుణ్యం గల ప్రతిభకు పెరుగుతున్న డిమాండ్‌నూ ప్రతిబింబిస్తుంది.
భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ వి.ఎస్. అరవింద్ మాట్లాడుతూ, "నైపుణ్యం కలిగిన యువతకు అర్థవంతమైన అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల మా నిబద్ధతను కౌశల్ మహోత్సవ్ ప్రతిబింబిస్తుంది. యాజమాన్యాలను, ఆశావహులైన అభ్యర్థులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా, నైపుణ్య శిక్షణ నుంచి ఉపాధి వరకు బలమైన మార్గాలను మేం సృష్టిస్తున్నాం. తెలంగాణ యువత ఆకాంక్షలకూ మద్దతునిస్తున్నాం" అని అన్నారు.
పరిశ్రమలు, శిక్షణ సంస్థలు, ఉద్యోగార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని స్పష్టమైన ఉపాధి ఫలితాలుగా మార్చడానికి కౌశల్ మహోత్సవ్ ఒక ముఖ్యమైన వేదికగా ఆవిర్భవించిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మహోత్సవంలో వరంగల్ సహా పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహులు పాల్గొంటారని అంచనా. దీని ద్వారా స్థానిక ప్రతిభావంతులు నియామక సంస్థలతో నేరుగా సంప్రదించి... తమ నైపుణ్యాలు, ఆకాంక్షలకు అనుగుణమైన అవకాశాలను అన్వేషించగల చక్కని వేదిక అందుబాటులోకి వస్తుంది.
ఉద్యోగావకాశాలతో పాటుగా ఈ కౌశల్ మహోత్సవ్ – వరంగల్ 2026... అప్రెంటీస్‌షిప్ కార్యక్రమాలు, ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి మార్గాలు, భవిష్యత్తుకు అనువైన ఉద్యోగాలు, మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి గల అవకాశాలపై అభ్యర్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది.
ప్రాంప్ట్ పర్సనల్ ప్రైవేట్ లిమిటెడ్, పారాడిజమ్ ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, సీతారామ్ స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్ నెట్‌వర్క్, కాప్‌స్టన్ సర్వీసెస్ లిమిటెడ్, క్రీమ్ స్టోన్, జయభేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గెలాక్టిక్ సొల్యూషన్, ఎస్ఎమ్‌జి ఎలక్ట్రిక్ స్కూటర్స్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలక్ట్రోల్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని, విభిన్న రంగాల్లో అవకాశాలను అందిస్తాయని భావిస్తున్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఒక నియామక భాగస్వామిగా పాల్గొని, తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.
సంవత్సరాలుగా, నైపుణ్యం గల యువతను ఈ కౌశల్ మహోత్సవ్ కంపెనీల యాజమాన్యాలతో అనుసంధానిస్తోంది. శిక్షణ, అప్రెంటీస్‌షిప్, ఉపాధి రంగాల మధ్య వారధిని బలోపేతం చేసే ఒక ప్రధాన వేదికగా ఇది ఆవిర్భవించింది. ఇది ఉద్యోగ మేళాకు మించి... నైపుణ్యం, సాధికారత, స్వయం-సమృద్ధి గల భారత్ దార్శనికతకు అనుగుణంగా అభ్యర్థుల నైపుణ్యాన్ని, కొత్త వ్యాపార ఆలోచనలను, అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తించి, వాటిని ప్రోత్సహించే ఒక గొప్ప కార్యక్రమంగా నిలుస్తోంది.
***
(रिलीज़ आईडी: 2278170)
आगंतुक पटल : 8