ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టీకాలు, యాంటీబయాటిక్స్, క్యాన్సర్ మందులకు క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ విధానాన్ని విస్తరించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
టీకాలు, యాంటీబయాటిక్స్, ఎన్‌డీపీఎస్, క్యాన్సర్ మందులకూ క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రామాణీకరణ విధానం వర్తింపు
प्रविष्टि तिथि:
25 JUN 2026 1:20PM by PIB Hyderabad
భారత ఔషధ సరఫరా వ్యవస్థ నాణ్యత, భద్రత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా షెడ్యూల్ హెచ్2 పరిధిని విస్తరిస్తూ, అదనపు రకాల మందులను క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ విధానంలోకి తీసుకువస్తూ డ్రగ్స్ రూల్స్-1945 సవరణలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
సవరించిన నిబంధనల ప్రకారం... అన్ని రకాల టీకాలు, యాంటీబయోటిక్స్, నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ ఎన్‌డీపీఎస్ చట్టం-1985 పరిధిలోకి వచ్చే క్యాన్సర్ నివారణ మందులను డ్రగ్స్ రూల్స్-1945లోని షెడ్యూల్ హెచ్2 పరిధిలోకి చేర్చారు.
ఈ సవరణతో మందులను తయారుచేసే సంస్థలు ఉత్పత్తుల ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌పై బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను ముద్రించటం తప్పనిసరి. అక్కడ తగినంత స్థలం లేనిపక్షంలో ద్వితీయ ప్యాకేజింగ్ లేబుల్‌పై దీన్ని ముద్రించాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌లోని సమాచారాన్ని సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల ద్వారా తనిఖీ చేయవచ్చు. దీనివల్ల ఔషధ సరఫరా వ్యవస్థ అంతటా ఆయా మందుల అసలు గుర్తింపును సులభంగా తనిఖీ చేయవచ్చు.
ఈ క్యూఆర్ కోడ్‌లో సదరు ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఇందులో ప్రాథమికంగా ఉత్పత్తి ఐడెంటిఫికేషన్ కోడ్, ఔషధానికి సంబంధించిన జనరిక్, బ్రాండ్ పేర్లు, తయారీదారు పేరు, చిరునామా, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు, తయారీ లైసెన్స్ నంబర్, అవసరమైన చోట మందులో వాడిన ఇతర సహాయక పదార్థాల వివరాలు ఉంటాయి.
గతంలో ఈ క్యూఆర్ కోడ్ నిబంధన దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే మొదటి 300 రకాల మందులకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తెచ్చిన కొత్త మార్పుల వల్ల అన్ని రకాల వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, క్యాన్సర్ మందులు, మత్తు మందులకు కూడా ఇది వర్తిస్తుంది. దీనివల్ల మందుల పర్యవేక్షణ సులువవుతుంది. మార్కెట్లోకి నకిలీ, నాణ్యత లేని మందులు రాకుండా అడ్డుకోవచ్చు.
మందుల గుర్తింపును మరింత పటిష్టం చేసే ఈ నూతన విధానం... సరఫరా వ్యవస్థలోని వివిధ దశల్లో మందుల అసలైన నాణ్యతను తనిఖీ చేసేందుకు, వాటిని సులభంగా ట్రాక్ చేయటానికి సహాయపడుతుంది. దీని ద్వారా ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుంది. మార్కెట్లో నకిలీ మందుల చలామణీని అరికట్టేందుకు వీలవుతుంది. నకిలీ, నాణ్యత లేని యాంటీబయాటిక్ ఔషధాలను సులభంగా గుర్తించి, పర్యవేక్షించటం ద్వారా యాంటీ-మైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై దేశం చేస్తున్న పోరాటానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది.
ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఔషధ పరిశ్రమకు, ఇతర భాగస్వాములకు తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరాన్ని మంత్రిత్వ శాఖ గుర్తించింది. నిబంధనల అమలుకు దశల వారీగా గడువును నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్లు, మత్తు పదార్థాలు, మానసిక స్థితిపై ప్రభావం చూపే మందులు, క్యాన్సర్ నివారణ మందులకు సంబంధించిన నిబంధనలు జూలై 1, 2027 నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, యాంటీబయాటిక్స్‌కు సంబంధించిన నిబంధనలు జూలై 1, 2028 నుంచి అమల్లోకి వస్తాయి.
దేశాన్ని మత్తుపదార్థాల రహితంగా మార్చేందుకు ఉద్దేశించిన నషా ముక్త్ భారత్ పోరాటంలో భాగంగా.. ఎన్‌డీపీఎస్ మందుల సరఫరా వ్యవస్థను ట్రాక్ చేసేందుకు, అవి అసలైనవో లేదో తెలుసుకునేందుకు ఈ విధానం సహాయపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2277972)
आगंतुक पटल : 9