వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు భారతి కార్యక్రమం ద్వారా మొదటి విడత శిక్షణ పూర్తి చేసిన ఏపీఈడీఏ


ఎగుమతి కేంద్రీకృత శిక్షణ పూర్తి చేసుకున్న 100 అంకుర సంస్థలు: 22 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అంకుర సంస్థల ఎంపిక

प्रविष्टि तिथि: 24 JUN 2026 7:44PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయం, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) ఆధ్వర్యంలో భారతి (భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్, రెసిలెన్స్, అడ్వాన్స్‌మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్‌పోర్ట్ ఇన్నోవేషన్) కార్యక్రమం ద్వారా అందిస్తున్న మొదటి విడత శిక్షణ విజయవంతంగా పూర్తయింది. భారతదేశ వ్యవసాయ-ఆహార ఎగుమతి రంగంలో ఆవిష్కరణల ఆధారిత వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఎగుమతులను వేగవంతం చేస్తుంది. సంబంధిత వర్గాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా... 2030 నాటికి ఏపీఈడీఏ షెడ్యూల్లో ఉన్న ఉత్పత్తులకు సంబంధించి 50 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను సాధించాలన్న భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా... ఒక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారతి కార్యక్రమం కృషి చేస్తుంది.

భారతదేశ వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఎగుమతులను విస్తరించడంలో ఆవిష్కరణాత్మక ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాలు, పరిష్కారాలను అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్న అంకుర సంస్థలను గుర్తించేందుకు, వాటిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని, ఆవిష్కరణలను, విలువ జోడింపును, సాంకేతిక స్వీకరణను, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మారడాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

తొలి విడత శిక్షణలో 100 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. 22 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 700కు పైగా దరఖాస్తుల నుంచి వీటిని ఎంపిక చేశారు. ఈ బ్యాచ్‌లో 68 వ్యవసాయ-ఆహార ఉత్పత్తుల అంకురసంస్థలు, 26 ఎగుమతులను ప్రోత్సహించే సాంకేతిక, సేవా సంస్థలున్నాయి. వీటితో పాటుగా శానిటరీ, ఫైటోశానిటరీ (ఎస్‌పీఎస్) చర్యలు, ఉత్పత్తుల గుర్తింపు, నాణ్యత హామీ, అనువర్తన పరిష్కార రంగాల్లో పనిచేస్తున్న ఆరుగురు ఆవిష్కర్తలు ఉన్నారు.

భారతదేశ ఆవిష్కరణల వ్యవస్థ వైవిధ్యాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ బృందంలో 17 నుంచి 75 ఏళ్ల వయస్సున్న పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. విలువ ఆధారిత వ్యవసాయ-ఆహార ఎగుమతి వ్యవస్థ అంతటా ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత పరిష్కారాలను స్వీకరిస్తున్న తీరును వారి భాగస్వామ్యం తెలియజేస్తుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంకురసంస్థలు 120 గంటల పాటు నిర్మాణాత్మక శిక్షణ పొందాయి. దీనిలో ఎగుమతి సన్నద్ధత, మార్కెట్ అవకాశాలను పొందడం, వ్యాపార విస్తరణ, నియంత్రణలను అనుసరించడం, ప్యాకేజింగ్, బ్రాండింగ్, పెట్టుబడుల సమీకరణకు సన్నద్ధమవడం లాంటి అంశాలపై దృష్టి సారించారు. అలాగే వ్యక్తిగత మార్గదర్శకత్వం, పరిశ్రమ నిపుణుల మాస్టర్‌క్లాసులను ఈ కార్యక్రమం అందించింది. వీటితో పాటుగా ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆర్థిక సంస్థలు, ఎగుమతిదారులు, పెట్టుబడిదారులు లాంటి భాగస్వాములతో మాట్లాడే అవకాశాలను ఈ కార్యక్రమం అందించింది. వాణిజ్య భాగస్వామ్యాలను అన్వేషించేలా, మార్కెట్ అవకాశాలను బలోపేతం చేసుకొనేలా, ఎగుమతుల సామర్థ్యాన్ని విస్తరించుకొనేలా అంకుర సంస్థలకు ఈ చర్చలు దోహదపడ్డాయి.

అంతర్జాతీయ మార్కెట్ గురించి అవగాహనను పెంపొందించే చర్యలో భాగంగా...  అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది భారతి అంకుర సంస్థలకు... దుబాయ్‌లో జరిగిన గల్ఫుడ్–2026‌లో పాల్గొనడానికి అవసరమైన సహకారాన్ని ఏపీఈడీఏ అందించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార, పానీయాల వ్యాపార ప్రదర్శనల్లో గల్ఫుడ్ ఒకటి. ఈ ప్రదర్శన ద్వారా అంతర్జాతీయ కొనుగోలుదారులతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వ్యాపార భాగస్వాములతో ఉన్నత స్థాయి బీ2బీ చర్చలు జరపడానికి దోహదపడింది. ఈ కార్యక్రమంలో అంకుర సంస్థలు, అంతర్జాతీయ వ్యాపారులు, దిగుమతిదారుల మధ్య 100కు పైగా బీ2బీ సమావేశాలు జరిగాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తుల నమూనాలను ప్రదర్శించారు. 

ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగం, అంతర్జాతీయంగా పోటీ తత్వంతో ముందుకు సాగే, భవిష్యత్తు అవసరాలకు తగిన ఎగుమతుల వ్యవస్థను నిర్మించడంలో ఏపీఈడీఏకు ఉన్న చిత్తశుద్ధిని భారతి కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఏపీఈడీఏ ఛైర్మన్, ఐఏఎస్ అధికారి శ్రీ అభిషేక్ దేవ్ తెలియజేశారు. భారతీయ వ్యవసాయ–ఆహార ఆవిష్కరణ వ్యవస్థలో పెరుగుతున్న సామర్థ్యాన్ని.. దేశవ్యాప్తంగా అంకుర సంస్థల నుంచి వచ్చిన స్పందన తెలియజేస్తోందని ఆయన చెప్పారు. దేశ వ్యవసాయం, శుద్ధి చేసిన ఆహార ఎగుమతుల వృద్ధికి దోహదపడే సామర్థ్యం ఉన్న, ఎగుమతులకు సిద్ధంగా ఉండే బలమైన సంస్థలను తయారు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించారు.

దేశ ఎగుమతుల వృద్ధి వ్యూహంలో ఆవిష్కరణలను, ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ఏకీకృతం చేసేందుకు ఏపీఈడీఏ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తి కావడం ముఖ్యమైన విజయంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయంగా పోటీనివ్వగల అంకుర సంస్థలకు తోడ్పాటు లభిస్తుందని, అదే సమయంలో ఉత్పత్తులకు విలువ జోడింపు, మార్కెట్ వైవిధ్యీకరణ, స్థిరమైన ఎగుమతుల వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభమైన మూడు నెలల్లోనే, 'భారతి' సహకారం పొందిన అంకుర సంస్థలు ఆవిష్కరణల ఆధారిత వ్యవసాయ ఎగుమతి పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పురోగతిని కనబరిచాయి. రెండు అగ్రి-టెక్ అంకుర సంస్థల మధ్య సహకారం కుదుర్చుకొని జీఐ ట్యాగ్ పొందిన జర్దాలు మామిడి పండ్లు సుమారు 37 మెట్రిక్ టన్నులు దుబాయ్‌కి ఎగుమతి చేశాయి. అలాగే, మరో అంకుర సంస్థ... కర్ణాటకకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవో) నుంచి సేకరించిన చిరుధాన్యాలతో తయారు చేసిన న్యూట్రాస్యూటికల్, బొటానికల్ ఆధారిత రెడీ-టు-కుక్ ఆహార ఉత్పత్తులను న్యూజిలాండ్‌లో ఉన్న ఆక్లాండ్‌కు తొలిసారి నౌకా మార్గం ద్వారా విజయవంతంగా ఎగుమతి చేసింది.

పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, దేశీయ రకాల ధాన్యాలతో కూడిన సేంద్రీయ ఉత్పత్తుల వ్యాపారం చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన అంకుర సంస్థ... యూఏఈలోని ప్రముఖ సూపర్ మార్కెట్ చెయిన్‌తో ఎగుమతులకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. పండ్లకు రక్షణ బ్యాగులు, మామిడి తోటల నిర్వహణ సేవలు, కోత అనంతర పరికరాలను అందించే ఒక అగ్రిటెక్ అంకుర సంస్థ ఏపీఈడీఏ నమోదిత ఎగుమతిదారుతో కలిసి ప్రస్తుత సీజన్‌లో సుమారు 5 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను సింగపూర్‌కు విజయవంతంగా ఎగుమతి చేసింది.

సుమారు 850 కిలోల జీఐ ట్యాగ్ పొందిన అంజీర్ రసాన్ని, నేరేడు రసాన్ని మహారాష్ట్రకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీసీ).. అమెరికా, బ్రిటన్ దేశాలకు ఎగుమతి చేసింది. ఆ తర్వాత, వారికి అదే మార్కెట్ల నుంచి సుమారు 1.25 మెట్రిక్ టన్నుల ఎగుమతి కోసం మళ్లీ ఆర్డర్ వచ్చింది. 12 రాష్ట్రాలకు చెందిన 1,600 మందికి పైగా రైతులతో అనుసంధానమైన కర్ణాటకకు చెందిన ఓ అంకుర సంస్థ...  పప్పుధాన్యాలు, దేశీయ రకాలకు చెందిన ధాన్యాలు, ఇంద్రాయణి లాంటి జీఐ ట్యాగ్ పొందిన స్థానిక వరి రకాలతో సహా 40 మెట్రిక్ టన్నుల సేంద్రీయ ఉత్పత్తులను, 5 మెట్రిక్ టన్నుల విలువ జోడించిన ఉత్పత్తులను యూఏఈ, యూరోపియన్ యూనియన్ మార్కెట్లకు ఎగుమతి చేసింది. రాబోయే ఒకటి రెండు నెలల్లో అమెరికా, యూరోపియన్ యూనియన్, యూఏఈ మార్కెట్లకు చేసే ఎగుమతులు 40 మెట్రిక్ టన్నులకు పైగా దాటుతుందని అంచనా వేస్తున్నారు.

దీనికి తోడు, కేరళకు చెందిన అంకుర సంస్థకు ఒమన్ నుంచి చిరుధాన్యాల ఉత్పత్తులకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. దుబాయ్ మార్కెట్ కోసం మఖానా, జపాన్, కామెరూన్ మార్కెట్ల కోసం రెడీ-టు-ఈట్, రెడీ-టు-కుక్ ఉత్పత్తుల సరఫరాకు సంబంధించి మరికొన్ని అంకుర సంస్థలు చేస్తున్న చర్చలు తుది దశలో ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక అంకుర సంస్థ... క్విక్-కామర్స్, ఈ-కామర్స్ వేదికల ద్వారా దేశీయ మార్కెట్లో తన ఉనికిని చాటుకుంటోంది. దీనితో పాటు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో 100 స్టోర్లతో రిటైల్ రంగంలో తన ఉనికిని చాటుతోంది.

ఎగుమతి ఆధారిత ఆవిష్కరణలను వేగవంతం చేయడంలోనూ, భారతదేశ వ్యవసాయ–ఆహార ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ భారతి కార్యక్రమం పోషిస్తున్న పాత్రను... దీని ద్వారా అంకుర సంస్థలు సాధించిన విజయవంతమైన ఫలితాలు తెలియజేస్తున్నాయి. మొదటి విడత శిక్షణ ద్వారా సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతో, వ్యవసాయ-ఆహార ఎగుమతి రంగం కోసం వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేసే అంకుర సంస్థలకు మరింత మద్దతు అందించేందుకు త్వరలోనే భారతి తదుపరి ఎడిషన్‌ను ఎపీఈడీఏ ప్రారంభించనుంది. ఆవిష్కరణలు, విలువ జోడింపు, స్థిరమైన వృద్ధికి కొత్త అవకాశాలను ఈ కార్యక్రమం సృష్టిస్తూనే ఉంటుందని ఏపీఈడీఏ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో భారతదేశ వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఎగుమతుల దీర్ఘకాలిక విస్తరణకు, వైవిధ్యీకరణకు దోహదపడుతుందని భావిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2277968) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada