రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్‌ల జాతీయ రహదారి ప్రాజెక్టుల నాణ్యత, నిర్వహణపై కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ సమీక్ష

प्रविष्टि तिथि: 25 JUN 2026 11:28AM by PIB Hyderabad

తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్‌లలో జాతీయ రహదారి (ఎన్‌హెచ్) ప్రాజెక్టుల పురోగతి, నాణ్యత, నిర్వహణ అంశాలను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో నిన్న వేర్వేరు సమావేశాల్లో సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణకు చెందిన 4,931 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టులు, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 2,035 కి.మీ. పొడవైన ఎన్‌హెచ్ ప్రాజెక్టులు, లద్దాఖ్‌కు చెందిన 804 కి.మీ. పొడవైన ఎన్‌హెచ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సమీక్ష కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్ర కూడా పాల్గొన్నారు.
ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పొందుపరిచిన కథనాలు, రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఆర్‌టీహెచ్), భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఐడీసీఎల్) అధికారులు, ప్రాజెక్టు గుత్తేదారులు అందించిన సమాచారం సహా వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా సమీక్షలను చేపట్టారు.

 


నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, నిర్వహణ కార్యకలాపాలు, భద్రమైన, సమర్థమైన, దీర్ఘకాలం మన్నిక కలిగి ఉండే హైవే సంబంధిత మౌలిక సదుపాయాలను అందించడానికి తీసుకుంటున్న చర్యలు ఏ దశలో ఉన్నాయో ఈ సమావేశాల్లో శ్రీ గడ్కరీ  సమీక్షించారు. నాణ్యత, జవాబుదారీతనం... ఈ అంశాల్లో అత్యున్నత ప్రమాణాలను నిలబెడుతూ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.
పర్యవేక్షక యంత్రాంగాలను బలోపేతం చేయాలని, పనులను అనుకున్న కాలం లోపల పూర్తి చేయాలని, హైవే కారిడార్ల స్థిరత్వం,  సౌకర్యవంతమైన యాత్ర, దీర్ఘకాలిక పనితీరు... వీటిని మెరుగుపరచడానికి ఆధునిక నిర్మాణ సాంకేతికతలతో పాటు అత్యుత్తమ పద్ధతుల్ని అనుసరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ధికి వేగాన్ని జతపరచడం, పర్యటనలను ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలను పెంపొందించడం కోసం సువ్యవస్థిత రహదారి మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

 


వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాజెక్టులలో తగిన సన్నాహక చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా శ్రీ నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. మురుగు పారుదల వ్యవస్థను సమర్ధంగా నిర్వహించడం, తీరాల వెంబడి కట్టలను స్థిరీకరించడం, సంరక్షణ సంబంధిత పనులు, వాతావరణం పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సత్వర ప్రతిస్పందన ప్రణాళికలను చేపట్టడం సహా నివారక, ఉపశమన చర్యలను తీసుకోవాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. ఈ చర్యలు నిరంతరాయ అనుసంధానం, రహదారి భద్రతతో పాటు జాతీయ హైవే నెట్‌వర్క్ దృఢత్వాన్ని నిర్ధారించడానికి చాలా అవసరమని ఆయన అన్నారు.
ఆధునిక ఇంజినీరింగ్ సాంకేతికతలను వినియోగించుకొని ప్రాజెక్టులను సకాలంలో అమలుపరచడంతో పాటు నాణ్యత విషయంలో హామీని అందిస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచ శ్రేణి హైవే సంబంధిత మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

***


(रिलीज़ आईडी: 2277735) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil