ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి... సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 23 JUN 2026 3:39PM by PIB Hyderabad

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ నిర్మాణానికి డాక్టర్ ముఖర్జీ అందించిన అపార సేవలను ప్రధాని స్మరించుకున్నారు.
డాక్టర్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడు, పండితుడు, భారత్ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన రాజనీతిజ్ఞ‌ుడు అని ప్రధానమంత్రి ప్రశంసించారు. డాక్టర్ ముఖర్జీ చాటిన తిరుగులేని దృఢవిశ్వాసం, ప్రజాజీవితం పట్ల కనబరిచిన ధైర్య సాహసాలు, దేశ హితం పట్ల ఆయన చాటిన నిబద్ధత తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తుంటాయని శ్రీ మోదీ అన్నారు. దేశ ప్రజలు డాక్టర్ ముఖర్జీ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని ప్రధాని అన్నారు.
డాక్టర్ ముఖర్జీకి గౌరవపూర్వక నివాళులను ప్రధానమంత్రి అర్పిస్తూ దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడానికే డాక్టర్ ముఖర్జీ యావజ్జీవితాన్నీ అంకితం చేశారన్నారు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు మాతృభూమికి సేవ చేయడానికి దేశంలో ప్రతి ఒక్క తరానికీ స్ఫూర్తిని అందిస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ‘‘న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశన్తి’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.
పనులు, సంపద, లేదా వంశ పరంపర.. ఇవేవీ శాశ్వతత్వాన్ని సాధించిపెట్టలేవు. త్యాగం, ఉత్తమ ఆదర్శాల పట్ల పూర్తి అంకితభావాన్ని కలిగి ఉండడం ద్వారానే అమృతత్వాన్ని సాధించగలం. దేశం కోసం, సమాజం కోసం, సత్యం కోసం స్వప్రయోజనాలను కాదనుకొనే మహానుభావులు కాలం గీచిన గీతను కూడా దాటి జన హృదయంలో కొలువై ఉంటారని ఈ సుభాషితం మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశ భక్తుడు, పండితుడు, భారత్ ప్రగతికి జీవితాన్ని అంకితం చేసిన రాజనీతిజ్ఞ‌ుడు. ఆయన చాటిన తిరుగులేని దృఢవిశ్వాసం, ప్రజాజీవితం పట్ల కనబరిచిన ధైర్య సాహసాలు, దేశ హితం విషయంలో చాటిన నిబద్ధత తరాల తరబడి స్ఫూర్తిదాయకాలు. దేశ ప్రజలు డాక్టర్ ముఖర్జీ త్యాగాన్ని ఎప్పటికీ స్మరించుకుంటారు. ఆయన మనసులో నిలుపుకొని, తుది శ్వాస వరకూ విడనాడని విలువల అడుగుజాడలను అనుసరిస్తూ దృఢమైన, అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించాలన్న నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం.
‘‘నిస్వార్థ భావంతో దేశసేవలో, సమాజ సేవలో జీవన పర్యంతం అంకితభావాన్ని చాటుకున్న దేశ మహా మనీషి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారికి ఆయన బలిదాన దినోత్సవం సందర్భంగా ఆదరపూర్వక శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను. ఆయన లోతైన ఆలోచనలూ, ఆదర్శాలూ మాతృభూమికి సేవ చేయాలన్న స్ఫూర్తిని దేశంలో ప్రతి తరానికీ అందిస్తూనే ఉంటాయి.
‘‘న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశన్తి’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2277062) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Odia , Tamil , Kannada