రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎరువుల సరఫరా వ్యవస్థ బలోపేతం

హార్మూజ్‌ను దాటిన నాలుగు ఎరువుల నౌకలు

భారత వ్యవసాయ రంగానికి ఊతం

హార్ముజ్ జలసంధి ద్వారా వ్యూహాత్మక నౌకా వాణిజ్య రవాణాతో... ఖరీఫ్-2026 కోసం అందుబాటులోకి కీలకమైన యూరియా, డీఏపీ, సల్ఫర్

హార్మూజ్ జలసంధిని దాటిన కీలక నౌకల రాకతో ఎరువుల సరఫరా మార్గాలు బలోపేతం

నాడు పోస్టు చేయడమైనది: 22 JUN 2026 7:00PM by PIB Hyderabad

భారత ఎరువుల భద్రతలో కీలక ముందడుగు పడింది. యూరియా, డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ), సల్ఫర్ వంటి కీలకమైన ఎరువులతో వస్తున్న నాలుగు సరుకు రవాణా నౌకలు గత వారం హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వాణిజ్య సవాళ్లను అధిగమిస్తూ, ఈ నౌకలు ప్రస్తుతం దేశంలోని కృష్ణపట్నం, కాకినాడ, పారాదీప్, ముంద్రా ఓడరేవులకు చేరుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. దేశంలోని ప్రస్తుత ఎరువుల నిల్వలతో పాటు ఈ నౌకల ద్వారా దిగుమతి అవుతున్న ఎరువులతో ప్రస్తుత వ్యవసాయ అవసరాలను తీర్చడానికి మార్గం సుగమమవుతుంది.

అవసరాలకు అనుగుణంగా నిల్వలు

2026 జూన్ 22 నాటికి భారత్‌లో మొత్తం ఎరువుల నిల్వలు 196.08 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 168.67 లక్షల టన్నుల కంటే గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఈ బలమైన నిల్వలో భాగంగా ఈ ఎరువులు అందుబాటులో ఉన్నాయి:

·         యూరియా: 81.44 లక్షల టన్నులు (గత ఏడాది 69.21 లక్షల టన్నుల కంటే పెరుగుదల)

·         డీఏపీ: 20.92 లక్షల టన్నులు (గత ఏడాది 16.0 లక్షల టన్నుల కంటే పెరుగుదల)

·         ఎన్‌పీకేలు: 55.91 లక్షల టన్నులు (గత ఏడాది 46.13 లక్షల టన్నుల కంటే పెరుగుదల)

·         ఎంఓపీ: 12.68 లక్షల టన్నులు (గత ఏడాది 10.68 లక్షల టన్నుల కంటే పెరుగుదల)

·         ఎస్‌ఎస్‌పీ: 25.13 లక్షల టన్నులు (గత ఏడాది 26.65 లక్షల టన్నులు)

వ్యవసాయ రంగంలో అధిక వృద్ధిని ప్రతిబింబిస్తూ, సంక్షోభానంతరం (మార్చి 1, 2026 నుంచి జూన్ 21, 2026 వరకు) మొత్తం ఎరువుల అమ్మకాలు 153.4 లక్షల టన్నులకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 140.2 లక్షల టన్నుల అమ్మకాలతో పోలిస్తే ఇది 13.2 లక్షల టన్నుల వృద్ధిని సూచిస్తుంది. ఇందులో 79.1 లక్షల టన్నుల యూరియా, 34.8 లక్షల టన్నుల ఎన్‌పీకే, 19.8 లక్షల టన్నుల డీఏపీ (టీఎస్‌పీతో సహా) ఉన్నాయి.

దేశీయ తయారీ మద్దతు

అనూహ్యమైన ప్రపంచ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి భారత రైతులకు రక్షణ కల్పించేందుకు... ప్రభుత్వ అవసరాలకు అనుగుణమైన దిగుమతులతో పాటు, స్వదేశీ ఉత్పాదక సామర్థ్యాలనూ గరిష్ఠ స్థాయికి పెంచింది. సంక్షోభానంతర దేశీయ ఉత్పత్తి గణనీయంగా పెరిగి, గరిష్టంగా 133.12 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్ఎమ్‌టీ) చేరింది. ఈ బలమైన దేశీయ ఉత్పత్తికి దీటుగా, ఈ కాలంలో భారతీయ ఓడరేవులకు వచ్చే మొత్తం దిగుమతులు 43.69 లక్షల మెట్రిక్ టన్నులకు చేరాయి. తద్వారా స్థానిక ఉత్పత్తికి, అంతర్జాతీయ సరఫరాకు మధ్య సముచితమైన సమతుల్యత ఏర్పడింది.

విజయవంతమైన గ్లోబల్ టెండర్ ప్రక్రియ

భారత్ తన తాజా గ్లోబల్ టెండర్ ప్రక్రియ ద్వారా 17.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోసం విజయవంతంగా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచడానికి 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులను భారత్ ప్రపంచ మార్కెట్ నుంచి సురక్షితంగా దక్కించుకుంది.

విదేశాల్లోని 28 భారతీయ రాయబార కార్యాలయాలతో చురుకైన దౌత్య సమన్వయం ద్వారా ఈ బృహత్తర సేకరణ వ్యూహం సులభతరమైంది. ఇది బహుళ అంతర్జాతీయ కారిడార్ల ద్వారా విభిన్న దిగుమతి మార్గాలను అందుబాటులోకి తెచ్చింది:

• యూరియా రాక: ఒమన్, మలేషియా, వియత్నాం, జార్జియా, నైజీరియా, రష్యా, ఫిన్లాండ్, ఈజిప్ట్, అల్జీరియా, టర్కీ, నెదర్లాండ్స్ నుంచి యూరియా దిగుబడి విజయవంతంగా ఖరారైంది.

·      డీఏపీ/ఎన్‌పీకే రాక: ఎర్ర సముద్ర నౌకాయాన మార్గం ద్వారా రష్యా, మొరాకో, ఈజిప్ట్, యూఎస్‌ఏ, జోర్డాన్, దక్షిణ కొరియా, ట్యునీషియా, సౌదీ అరేబియా మీదుగా సురక్షిత దిగుమతి ఖరారైంది.

భారత ఎరువుల భద్రత పటిష్ఠంగా, సుస్థిరంగా, మంచి నిర్వహణతో ఉండేలా చూసేందుకు గానూ కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, పంపిణీ సంస్థలు, సహకార సంఘాలతో కలిసి పనిచేస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2276893) సందర్శకుల సూచీ సంఖ్య : : 55
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Tamil , Malayalam