రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భద్రతను, నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈస్ట్ కోస్టు రైల్వేలో రూ.270 కోట్ల వ్యయంతో 631 రూట్ కిలోమీటర్ల మేర కవచ్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ రైల్వేల ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 22 JUN 2026 3:03PM by PIB Hyderabad

దేశీయ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైల్వేల భద్రతను పెంపొందించడంలో భాగంగా.. ఈస్ట్ కోస్టు రైల్వేలో రూ.270 కోట్ల వ్యయంతో 631 రూట్ కిలోమీటర్ల మేర కవచ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఆమోదించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా ఈస్టు కోస్టు రైల్వేలోని ఆరు ప్రధాన విభాగాలైన బఘుపాల్-బుధాపాంక్, హరిదాస్‌పూర్-పారదీప్, ఖుర్దా రోడ్ (కేయూఆర్)-బాలంగీర్, నౌపడ-గునుపూర్, లాంజీఘర్ రోడ్-జునాఘడ్, బొబ్బిలి-సాలూర్ సెక్షన్లలో కవచ్‌ను ఏర్పాటు చేస్తారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన స్వయంచాలిత రైలు భద్రతా వ్యవస్థ విస్తరణ

రైల్వే వ్యవస్థలో ఎల్‌టీఈ-ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థ తోడ్పాటుతో కవచ్‌ను విస్తరించేందుకు భారత్ రైల్వేలు చేపడుతున్న బృహత్ కార్యక్రమంలో మంజూరైన పనులు భాగంగా ఉన్నాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన స్వయంచాలిత రైలు భద్రతా వ్యవస్థ (ఏటీపీ) కవచ్. ప్రమాదకర పరిస్థితుల్లో సిగ్నల్ దాటడాన్ని (ఎస్‌పీఏడీ), అధిక వేగాన్ని, రైళ్లు ఢీకొనడాన్ని నివారించి, భద్రతను పెంపొందించేలా దీనిని రూపొందించారు. రైళ్ల రాకపోకలను ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షిస్తుంది. అవసరమైన సందర్భాల్లో స్వయంచాలితంగా బ్రేకులు వేస్తుంది. దీనివల్ల భద్రత మరింత మెరుగవుతుంది.

మెరుగైన భద్రత, వేగం, విశ్వసనీయత

ఈ మార్గాల్లో కవచ్‌ను ఏర్పాటు చేయడం వల్ల రైళ్లకు భద్రతను, ఒకదానితో మరొకటి ఢీకొట్టకుండా నివారించే సామర్థ్యాలను అందించడం ద్వారా రైలు కార్యకలాపాల్లో ఉన్నత స్థాయి రక్షణను సాధించడానికి సాధ్యమవుతుంది. వీటికి అదనంగా దట్టమైన పొగమంచు లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన రైలు ప్రయాణాన్ని కవచ్ సాధ్యం చేస్తుంది. తద్వారా సేవల్లో విశ్వసనీయతను, సమయపాలనను మెరుగుపరుస్తుంది.

ఈస్టు కోస్టు రైల్వేలో భద్రతా మౌలిక వసతుల బలోపేతం

ఈస్టు కోస్టు రైల్వే పరిధిలోకి వచ్చే ఒడిశాతో పాటు పొరుగు ప్రాంతాల్లోని కీలకమైన సెక్షన్లలో ప్రయాణీకులు, సరకు రవాణా రైలు కార్యకలాపాలకు ఈ ప్రాజెక్టు లబ్ధి చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. అధిక రద్దీ, వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన మార్గాల్లోనూ కవచ్‌ను విస్తరించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే కొనసాగిస్తున్న కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2276694) సందర్శకుల సూచీ సంఖ్య : : 63
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada