సాంకేతికత ఎంత మారినా... చలన చిత్రోత్సవాల అసలు ఆత్మ ఎప్పటికీ సజీవమే... ఎంఐఎఫ్ఎఫ్ బహిరంగ చర్చలో నిపుణుల స్పష్టీకరణ
‘నకిలీ చిత్రోత్సవాలను’ అరికట్టాలి : కేంద్ర ప్రభుత్వ చర్యల కోసం నిపుణుల పిలుపు
ఓటీటీ వేదికలు, డిజిటల్ సాంకేతికతలు, మారుతున్న ప్రేక్షకుల వీక్షణ అలవాట్లు సినిమా రంగాన్ని పూర్తిగా మార్చేస్తున్నప్పటికీ.. కొత్త విషయాలను కనుగొనడానికి, నేర్చుకోవడానికి, సినిమాలను సామూహికంగా అనుభూతి చెందడానికి చలన చిత్రోత్సవాలు ఇప్పటికీ తమ ప్రాధాన్యతను నిలబెట్టుకుంటూనే ఉన్నాయని ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఐఎఫ్‌ఎఫ్) 2026 అయిదవ, ముగింపు బహిరంగ చర్చా వేదికగా వక్తలు స్పష్టం చేశారు.
ఈ చిత్రోత్సవంలో ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐడీపీఏ) నిర్వహించిన ‘‘మారుతున్న సాంకేతికతలు, మారుతున్న ప్రేక్షకులు:చలన చిత్రోత్సవాలు పరిణామ క్రమంలో ఉన్నాయా?’’ అనే చర్చా కార్యక్రమంలో ఫిల్మ్ ఫెస్టివల్ రంగంలోని ప్రముఖులు పాల్గొన్నారు. ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని ఎలా మారుస్తుందో పరిశీలించడంతో పాటు, చలన చిత్రోత్సవాల ప్రాముఖ్యత ఇప్పటికీ ఎలా కొనసాగుతోందో వారు చర్చించారు.
ఈ చర్చా గోష్ఠిలో బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ విద్యాశంకర్ ఎన్, ఇండియా హ్యాబిటాట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) కేజీ సురేష్, చలనచిత్ర విమర్శకుడు, ఫెస్టివల్ కన్సల్టెంట్ ప్రేమేంద్ర ముజుందార్,పూణే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వెనుక కీలక వ్యక్తిగా ఉన్న అదితి అక్కల్కోట్కర్ పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమానికి చలనచిత్ర దర్శకుడు, ఐడీపీఏ అధ్యక్షుడు సంస్కార్ దేశాయ్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
చర్చను ప్రారంభిస్తూ.. విద్యాశంకర్ ఎన్ 2000ల ప్రారంభంలో వచ్చిన డిజిటల్ విప్లవం తర్వాత చలనచిత్రోత్సవాలు ఎలా పరిణామం చెందాయో వివరించారు. సాంకేతికత అనేది సినిమాను వీక్షించే సౌలభ్యాన్ని విపరీతంగా పెంచినప్పటికీ, చలనచిత్రోత్సవాల ప్రాథమిక ఉద్దేశం మాత్రం మారలేదని ఆయన వాదించారు. ‘‘చలన చిత్రోత్సవాలు కేవలం సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే కాదు, సినిమాను ఒక అద్భుతమైన అనుభూతిగా పొందడం కోసం ఉద్దేశించినవి’’ అని ఆయన పేర్కొన్నారు. మ్యూజియంలతో పోలికను ఉదాహరణగా చూపుతూ.. ఆన్‌లైన్‌లో ఎంతో కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఇప్పటికీ ఇటువంటి లీనమయ్యే సాంస్కృతిక అనుభవాల కోసమే ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ‘‘సినిమా మూల విలువలు ఎప్పటికీ చెక్కుచెదరవు, వాటిని నిరంతరం కాపాడుతున్న అతికొద్ది వేదికల్లో చలన చిత్రోత్సవాలు కూడా ఒకటి’’ అని విద్యాశంకర్ అన్నారు.
యువ ప్రేక్షకులు సరికొత్త సాంకేతికతలను, సినిమా పోకడలను తెలుసుకోవడానికి చలన చిత్రోత్సవాలకు వస్తుండగా పాత తరం ప్రేక్షకులు మాత్రం తమ జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి వస్తుంటారని విద్యాశంకర్ పేర్కొన్నారు. ఇది రెండు వేర్వేరు తరాల మధ్య ఒక వినూత్నమైన సాంస్కృతిక అనుబంధాన్ని సృష్టిస్తుందని ఆయన వివరించారు.
ప్రొఫెసర్ డాక్టర్ కేజీ సురేష్ తన ప్రసంగంలో.. ఫిల్మ్ ఫెస్టివల్స్ మనుగడ సాగిస్తాయా లేదా అనే కోణం నుంచిడా, అవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయనే అంశంపై దృష్టి సారించారు. ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాల సంఖ్య పెరుగుతోందని అంగీకరిస్తూనే, సినిమాలపై పూర్తి అవగాహన గల ప్రేక్షకులను తయారు చేయడానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అని ఆయన ప్రశ్నించారు.
‘‘చలన చిత్రోత్సవాలు సినిమా పండుగలే కావచ్చు, కానీ అవి నేర్చుకునే అనుభవాలుగా కూడా మారాలి’’ అని సురేష్ అన్నారు. నాణ్యమైన కంటెంట్ కేంద్రంగా ఉన్నప్పుడే సాంకేతికత అనేది సినిమాను మరింత మెరుగుపరచగలదని ఆయన స్పష్టం చేశారు. విద్యకు, ప్రవర్తనా మార్పునకు సినిమా అత్యంత శక్తిమంతమైన సాధనమని పేర్కొంటూ.. విద్యాసంస్థల్లో సినిమాను ఆస్వాదించడాన్ని ఏకం చేయాలని, చిన్న వయసులోనే యువతకు సినిమా పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
అదితి అక్కల్కోట్కర్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ.. పూణే అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పనిచేయడం వల్ల వినోదానికి మించి అసలైన సినిమా ప్రపంచంపై తనకు అవగాహన పెరిగిందని వివరించారు. ‘‘సాధారణంగా ప్రేక్షకులు ఎప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాల వైపు చలన చిత్రోత్సవాలు తలుపులు తెరుస్తాయి’’ అని ఆమె అన్నారు. పీఐఎఫ్‌ఎఫ్ నిర్వహణలో విద్యార్థుల పాత్రను ప్రస్తావిస్తూ.. థియేటర్లలో కేవలం సినిమాలు ప్రదర్శించడమే కాకుండా దానికి ఆవల జరిగే పరిణామాలు చాలా కీలకమని అక్కల్కోట్కర్ అన్నారు. సినిమా ప్రేమికుల మధ్య నెట్‌వర్కింగ్ పెరగడం, దర్శకులకు, ప్రేక్షకులకు మధ్య జరిగే చర్చలు, ప్రాంతీయ, అంతర్జాతీయ సినిమాల గురించి తెలుసుకునే అవకాశం లభించడం వంటివి ఎంతో ముఖ్యమైనవని చెప్పారు.
సినిమా రంగంపై విమర్శనాత్మక దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ.. డిజిటల్ యుగంలో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ‘ఫిల్మ్ ఫెస్టివల్స్’ గురించి ప్రేమేంద్ర ముజుందార్ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికత వల్ల ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం సులభతరమైనప్పటికీ, దీనిని ఆసరాగా చేసుకుని అనేక నకిలీ ఉత్సవాలు వెలిశాయని ఆయన హెచ్చరించారు. ఇవి నిజమైన సాంస్కృతిక వేదికలుగా కాకుండా, కేవలం వాణిజ్య పరమైన (డబ్బు సంపాదించే) వ్యాపారాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.
‘‘ఈ నకిలీ ఉత్సవాలు తరచుగా డబ్బులు ఇస్తే అవార్డులు ఇస్తాం అనే పద్ధతుల ద్వారా సినిమా దర్శకులను దోపిడీ చేస్తున్నాయి. ఎలాంటి చట్టపరమైన లేదా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించకుండా ఇవి నడుస్తున్నాయి’’ అని ముజుందార్ అన్నారు. చలనచిత్ర దర్శకులను రక్షించడానికి, అసలైన చలన చిత్రోత్సవ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడటానికి ప్రభుత్వం మరింత కఠినమైన పర్యవేక్షణను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
సినిమా సంస్కృతిని పెంపొందించడంలో చలనచిత్ర సంఘాలు పోషిస్తున్న నిరంతర పాత్రను కూడా ఈ చర్చలో ప్రముఖంగా ప్రస్తావించారు. విద్యాపరమైన కార్యక్రమాలు, కాలేజీ క్యాంపస్‌లలో ఫిల్మ్ సొసైటీల ఏర్పాటు, ఫిల్మ్ స్టడీస్ కోర్సులను విస్తృతం చేయడం ద్వారా సినిమాలపై సరైన అవగాహన గల ప్రేక్షకులను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముజుందార్, సురేష్ ఇద్దరూ పేర్కొన్నారు
సినిమా ఫార్మాట్‌లు, ఓటీటీ వేదికలు, ప్రేక్షకుల వీక్షణ అలవాట్లు నిరంతరం మారుతూ ఉన్నప్పటికీ.. సాంస్కృతిక మార్పిడికి, సరికొత్త సినిమాలను కనుగొనడానికి, వెండితెర దృశ్యాలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడానికి ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రత్యామ్నాయం లేని వేదికలుగా మిగిలిపోతాయనే ఏకాభిప్రాయంతో ఈ సమావేశం ముగిసింది.
ఎంఐఎఫ్‌ఎఫ్ 2026 వేడుకల సందర్భంగా ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐడీపీఏ) నిర్వహించిన అయిదు భాగాల ప్రత్యేక చర్చా పరంపర ఈ బహిరంగ చర్చా వేదికతో ముగిసింది. వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో సినిమా, డాక్యుమెంటరీ సంస్కృతి భవిష్యత్తును విశ్లేషించడానికి చలనచిత్ర దర్శకులు, పరిశోధకులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులందరినీ ఈ వేదిక ఒకచోటకు చేర్చింది.
***
रिलीज़ आईडी:
2275861
| Visitor Counter:
6