ఎంఐఎఫ్ఎఫ్‌లో ప్రపంచ సినిమా భవిష్యత్తును అద్దం పట్టిన పది జర్మనీ చిత్రాలు
వివిధ ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్న పది జర్మనీ చిత్రాలను ప్రదర్శించిన ఎంఐఎఫ్ఎఫ్
చలన చిత్రోత్సవానికి సరికొత్త అంతర్జాతీయ గళాలను పరిచయం చేస్తోన్న ‘ఎమర్జింగ్ వాయిసెస్: ఫిల్మ్ స్కూల్ ఎడిషన్స్’
ప్రపంచ ప్రఖ్యాత చలనచిత్ర పాఠశాలల్లో ఒకటైన జర్మనీకి చెందిన 'ఫిల్మ్ అకాడమీ బాడెన్-వుర్టెంబర్గ్ జీఎంబీహెచ్' (ఎఫ్ఏబీడబ్ల్యూ) నిర్మించిన పది విశేష చిత్రాల ప్రదర్శనతో 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 2026 సినిమాటిక్ ఆవిష్కరణల స్ఫూర్తిని చాటింది. ఈ చలనచిత్రోత్సవంలోని ప్రత్యేక విభాగం అయిన ‘ఎమర్జింగ్ వాయిసెస్: ఫిల్మ్ స్కూల్ ఎడిషన్స్’ కింద ఈ చిత్రాలను ప్రదర్శించారు. యానిమేషన్, కాల్పనిక లఘ చిత్రాలు, డాక్యుమెంటరీ వంటి వివిధ విభాగాలకు చెందిన ఈ చలనచిత్రాలు.. నవతరం దర్శకుల సృజనాత్మక శక్తిని, కళాత్మక దృక్పథాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.
బాధ, అనుబంధం వంటి సున్నితమైన భావోద్వేగాల నుంచి జ్ఞాపకాలు, వృద్ధాప్యం, పర్యావరణ మార్పులపై విజువల్ వండర్స్‌గా తెరకెక్కిన యానిమేషన్ చిత్రాల వరకు ప్రతి సినిమా సరికొత్త అనుభూతిని పంచింది. సమకాలీన అంతర్జాతీయ సినిమాలో అత్యంత ఉత్సాహభరితమైన సరికొత్త గళాలను తీర్చిదిద్దడంలో 'ఫిల్మ్‌అకాడెమీ బాడెన్-వుర్టెంబర్గ్' ఎందుకు అగ్రగామిగా ఉందో ఈ చిత్రాలు తెలియజేశాయి.
ఈ ప్రదర్శనలో అన్నింటికంటే ముఖ్యంగా టోబియాస్ ఎకర్లిన్ దర్శకత్వం వహించిన ‘ఎ స్పారోస్ సాంగ్’ అనే యానిమేటెడ్ చారిత్రక చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. యుద్ధ బీభత్సం మధ్య గాయపడిన ఒక పిచ్చుకకు శ్రద్ధగా సేవలందిస్తూ తన జీవితంలో ఓదార్పును, ఆశను వెతుక్కునే ఒక వృద్ధ విధవరాలి కథను ఆవిష్కరిస్తుంది. ఎంతో సున్నితమైన కథనం, భావోద్వేగంతో సాగిన ఈ 'స్టూడెంట్ అకాడమీ అవార్డు' గెలుచుకున్న లఘు చిత్రం వీక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది.
ప్రేక్షకుల ఆదరణ పొందిన మరో విశేష చిత్రం.. అన్నా నీబర్ట్ దర్శకత్వం వహించిన ‘ఫ్లయింగ్ యానిమల్స్’ అనే డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీని, యానిమేషన్‌ను అద్భుతంగా మిళితం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ముగ్గురు పిల్లల ఊహాలోకంలోకి ఈ సినిమా మనల్ని తీసుకెళ్తుంది. కష్టాల్లోనూ వారు చూపే పట్టుదల, సృజనాత్మకత, చిన్ననాటి అమాయకపు ఊహలకు ఉండే అంతులేని శక్తిని ఈ చిత్రం ఎంతో భావోద్వేగభరితంగా ఆవిష్కరించింది.
ఈ ప్రదర్శనలో ప్రముఖంగా నిలిచిన మరో కాల్పనిక లఘు చిత్రం.. జాషువా నూబర్ట్, విక్టర్ ముహగాచి సంయుక్తంగా దర్శకత్వం వహించిన ‘మజిని’. టాంజానియా తీరప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథ.. పరిస్థితుల ప్రభావం వల్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లిన ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో వారు తమలోని భయాన్ని, బాధ్యతను, పురుషత్వాన్ని ఎలా ఎదుర్కొన్నారనేది ఇందులో చూపించారు. శక్తిమంతమైన కథనంతో సహజమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రశంసలతో పాటు గుర్తింపు పొందింది.
ఈ ప్రదర్శనలో విజువల్స్ పరంగా అత్యంత అద్భుతంగా అనిపించిన మరో చిత్రం.. షదబ్ షాయెగన్ దర్శకత్వం వహించిన ‘పియర్ గార్డెన్’ అనే యానిమేటెడ్ డ్రామా. ఆరేళ్ల చిన్నారి 'లిల్లీ' చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన నానమ్మ క్యాన్సర్ కారణంగా రొమ్ము తొలగింపు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. ఆ వయసులో ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడే లిల్లీ.. ఆ తర్వాత ఒక కలలాంటి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అనారోగ్యం, కోల్పోవడం, ఆ బాధ నుంచి కోలుకోవడం వంటి సున్నితమైన అంశాలను ఒక చిన్నారి కోణం నుంచి ఈ చిత్రం ఆవిష్కరించింది. కవితాత్మకమైన దృశ్యాలు, భావోద్వేగ సున్నితత్వంతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ ప్రదర్శనలో అంతే హృదయ స్ఫూర్తిగా అనిపించిన మరో చిత్రం.. పాల్ క్లే దర్శకత్వం వహించిన ‘సిల్వర్ స్ట్రింగ్స్’ అనే యానిమేటెడ్ పిల్లల చిత్రం. ఒక వృద్ధుడి చుట్టూ తిరిగే కథ ఇది. ఒక చిన్న సాలీడుతో అతనికి ఏర్పడిన ఊహించని స్నేహం అతని రోజువారీ జీవితాన్ని ఎలా మార్చేసిందనేది ఇందులో చూపించారు. తనను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించే కూతురి తాపత్రయాన్ని అతను ఎలా స్వీకరించాడనేది కూడా కథలో భాగం. హాస్యం, ఆత్మీయత, భావోద్వేగాలను అద్భుతంగా సమతూకం చేస్తూ ఈ కథను మలిచారు. ఈ హృదయానికి హత్తుకునే సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
మిగిలిన చిత్రాలు కూడా ఈ జర్మనీ చలనచిత్ర సంస్థ నుంచి వస్తున్న నవతరం ప్రతిభ ఏ స్థాయిలో ఉందో తెలియజేశాయి. లీ జిట్జెన్‌బాకర్ దర్శకత్వం వహించిన ‘చైసింగ్ కైట్స్’ అనే కాల్పనిక లఘ డ్రామా.. తల్లిని కోల్పోయిన ఇద్దరు సోదరుల కథ ద్వారా బాధ, తోబుట్టువుల అనుబంధాన్ని చూపించింది. క్రిస్టోఫర్ ష్మియర్, సారా షుల్జ్‌ల ‘లీనియే 12’ అనే యానిమేటెడ్ డ్రామా.. సాహసం, దృశ్యపరంగా సరికొత్త ఆవిష్కరణలతో కూడిన కథలో సంగీతం, యంత్రాలు, స్నేహాన్ని అద్భుతంగా మిళితం చేసింది. వెరా కైహ్ దర్శకత్వం వహించిన ‘స్పార్క్ (చిస్పా)’ అనే పిల్లల డ్రామా.. నిరంతరం పని ఒత్తిడిలో ఉండే తన తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే ఒక చిన్నారి కథను ఎంతో సున్నితంగా ఆవిష్కరించింది. తత్జానా థాయర్ రూపొందించిన ‘రైజ్ ఏజ్’ అనే ఎక్స్‌పెరిమెంటల్ యానిమేటెడ్ మ్యూజికల్.. పర్యావరణ మార్పులు, సమాజంలో ఉన్న ఉదాసీనతను ఎండగట్టడానికి వైవిధ్యమైన విజువల్స్, హాస్యాన్ని ఉపయోగించింది. ఇక రొమినా కూపర్ దర్శకత్వం వహించిన ‘దిస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్, దిస్ ఈజ్ బెట్రాయల్’ అనే కాల్పనిక లఘ కామెడీ చిత్రం.. హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసే ఒక తల్లికి, రైటర్ అవ్వాలనుకునే ఆమె కొడుకుకి మధ్య ఉండే సంబంధం ద్వారా సమాజంలో అంతస్థు, గుర్తింపు, కుటుంబాల మధ్య వచ్చే ఉద్రిక్తతలను ఆసక్తికరంగా చూపించింది.
మొత్తంగా చూస్తే ఈ పది చిత్రాలు ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని సినీ ప్రియులకు అంతర్జాతీయ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఒక చిన్న అంచనాను అందించాయి. ధైర్యవంతమైన, భావోద్వేగభరితమైన, మానవీయ కోణాలతో కూడిన సరికొత్త కథల ప్రదర్శనను ప్రేక్షకులకు పరిచయం చేశాయి.
***
रिलीज़ आईडी:
2275582
| Visitor Counter:
7