సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
స్కాలర్‌షిప్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కీలక సంస్కరణలు, డిజిటల్ కార్యక్రమాలను చేపట్టిన డీఓఎస్‌జేఈ
నివాస ధ్రువీకరణ పత్రం నిబంధన తొలగింపుతో 1.2 కోట్ల మంది విద్యార్థులకు ఊరట
డిజిటల్ స్కాలర్‌షిప్ పాలనా సంస్కరణల్లో భాగంగా ఉమాంగ్ వేదికపై సేతు పోర్టల్ ప్రారంభం
प्रविष्टि तिथि:
19 JUN 2026 12:10PM by PIB Hyderabad
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), వెనకబడిన వర్గాల విద్యార్థులకు ఉపకార ప్రక్రియ అందుబాటులో ఉండేలా, సులభతరంగా మార్చేందుకు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ (డీఓఎస్‌జేఈ) కీలక సంస్కరణలు, డిజిటల్ కార్యక్రమాలను చేపట్టింది.
కీలక సంస్కరణలో భాగంగా ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలనే నిబంధనను తొలగించారు. దీనిద్వారా విద్యార్థులపై నిబంధనల భారం తగ్గటంతో పాటు దరఖాస్తు ప్రక్రియ సరళంగా, స్కాలర్‌షిప్ ప్రయోజనాలను సులభంగా పొందగలిగే అవకాశం ఉంటుంది. సొంత రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న వేలాది మంది అర్హులైన దరఖాస్తుదారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఎస్సీలు, ఓబీసీలకు అందించే ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాల ద్వారా ఏటా దాదాపు 1.2 కోట్ల మంది విద్యార్థులు ఉపకారవేతన ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు నివాస ధ్రువీకరణ పత్రం కీలక నిబంధనగా ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను తొలగించటం ద్వారా నివాస పత్రాల అవసరాన్ని తగ్గటమే కాక, ప్రక్రియ మరింత సులభమవుతుంది. దీనివల్ల విద్యార్థులకు అయ్యే ఖర్చులు తగ్గుతాయి. స్కాలర్‌షిప్ ప్రయోజనాలను మరింత సులభంగా పొందవచ్చు.
డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేస్తూ.. స్కాలర్‌షిప్ సంబంధిత సేవలకు సమగ్ర పరిష్కారంగా ఉమాంగ్ వేదికలో సేతు (స్కాలర్‌షిప్ ఫర్ ఎడ్యుకేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్‌లిఫ్ట్‌మెంట్)ను ప్రారంభించారు. ఇది అర్హులైన దరఖాస్తుదారులకు, సంస్థాగత నోడల్ ఆఫీసర్లు, జిల్లా నోడల్ ఆఫీసర్లు, రాష్ట్ర అధికారులకు దరఖాస్తుల నమోదు, ట్రాకింగ్, ఇతర సేవల ధ్రువీకరణకు ఒకే వేదికను అందించి, పారదర్శకతను, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ కార్యక్రమాలు.. సమ్మిళిత్వాన్ని ప్రోత్సహించటం, సంక్లిష్టమైన నిబంధనలను తగ్గించటం, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించటం వంటి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. విద్యార్థులకు సకాలంలో మద్దతిచ్చేందుకు, సేవలను మరింత చేరువ చేసేందుకు సాంకేతిక ఆధారిత సంస్కరణలను వినియోగించుకునేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2275196)
आगंतुक पटल : 10