వ్యక్తిగత ప్రస్థానం నుంచి సామాజిక వాస్తవాల దాకా..: ‘ఎంఐఎఫ్ఎఫ్’లో డాక్యుమెంటరీ సినిమా పరిధిని విస్తృతం చేస్తున్న యువ చిత్రదర్శకులు
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్‌ఎఫ్)లో భాగంగా ఇవాళ “డాక్యుమెంటరీలను యువ చిత్రనిర్మాతలు పునర్నిర్వచిస్తున్నారా?” అనే ఇతివృత్తంపై బృంద గోష్ఠి ఆసక్తికరంగా సాగింది. అంతిమంగా డాక్యుమెంటరీ చిత్రనిర్మాణ భవిష్యత్తు నవతరం చేతుల్లో సురక్షితంగానే ఉందనే వాస్తవం తేటతెల్లమైంది.
ప్రసిద్ధ చిత్ర దర్శకుడు ప్రబల్ ఖౌండ్, రచయిత్రి-దర్శకురాలు ప్రీతి శర్మ, వర్ధమాన దర్శకురాలు సమాప్తి దాస్, సీనియర్ దర్శకుడు-విద్యావేత్త ప్రొఫెసర్ హిమాంశు శేఖర్ ఖతువా తదితరులను ఈ గోష్ఠి ఒకే వేదికపైకి తెచ్చింది. సరికొత్త దృక్కోణం, సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక వాస్తవాలపై పూర్తి నిబద్ధతతో డాక్యుమెంటరీ రంగాన్ని కొత్త తరం కథకులు ఎలా పునర్నిర్వచిస్తున్నదీ ఈ చర్చ ప్రస్ఫుటం చేసింది. ‘ఎన్‌ఎఫ్‌డీసీ’, ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ శ్రీ పంకజ్ సక్సేనా ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు.
దేశంలోని నేటి యువ దర్శకులు చిత్రనిర్మాణ సాధనాలు, వేదికలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రొఫెసర్ హిమాంశు శేఖర్ ఖతువా అన్నారు. “ఒక ఆలోచన రాగానే వారు దాన్నొక ఆసక్తికర కథగా మలచుకుని దానికి జీవం పోయడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తమకంటూ ఒక గుర్తింపును అభిలషించినా, అందుకోసం చలనచిత్ర వేడుకలపైన మాత్రమే ఆధారపడాల్సిన అవసరం వారికి లేదు. ఎందుకంటే- అసంఖ్యాక ప్రేక్షకులకు చేరువ కావడానికి ఇవాళ అనేక డిజిటల్ వేదికలు వీలు కల్పిస్తున్నాయి” అని పేర్కొన్నారు. డాక్యుమెంటరీ కథనాల చిత్రీకరణలో కృత్రిమ మేధ (ఏఐ) సహా అత్యాధునిక సాంకేతికతల ప్రభావం పెరుగుతోందని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనివల్ల చిత్ర నిర్మాణంలో అధికశాతం నాణ్యత, వైవిధ్యం మాత్రమే కనిపిస్తాయన్నారు.
అర్థవంతమైన కథనంపై యువతరం నిబద్ధత మీద ప్రస్తుతం ఒడిషాలోని బిజు పట్నాయక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ అధిపతిగా వ్యవహరిస్తున్న ఈ సీనియర్ దర్శకుడు విశ్వాసం వెలిబుచ్చారు. “యువ దర్శకులు సొంత జీవితంపై నిశిత ఆత్మపరిశీలన సహా చుట్టూ ఉన్న సమాజాన్నీ లోతుగా అధ్యయనం చేస్తారు. సామాజిక సమస్యలపై వారు ఎనలేని నిబద్ధతతో చూపుతారు. కాబట్టి, డాక్యుమెంటరీ చిత్రనిర్మాణ భవిష్యత్తు మరింత ప్రకాశించగలదని, కొన్నేళ్లలోనే అపార పురోగమనం సాధించగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు.
దేశంలోని యువతరంలో డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంపై మరింత అవగాహన కల్పించడం అవశ్యమని ‘ఎంఐఎఫ్‌ఎఫ్’లో తన రెండు చిత్రాల ప్రదర్శన అనంతరం యువ దర్శకురాలు సమాప్తి దాస్ అభిప్రాయపడ్డారు. ఈ మాధ్యమంలోగల అవకాశాల గురించి వర్ధమాన దర్శకులలో అధికశాతానికి తెలియదని ఆమె అన్నారు. “డాక్యుమెంటరీలు వాణిజ్య చిత్రాలకు ప్రత్యామ్నాయం మాత్రమే కాదు... దర్శకుల ప్రతిభను అవి సమున్నత శిఖరాలకు చేర్చగలవు” అని వ్యాఖ్యానించారు. అయితే, డాక్యుమెంటరీల నిర్మాణంలో ఎంతో ప్రయాస పడాల్సి ఉంటుందని, వర్ధమాన దర్శకుల ప్రతిభపై నిర్మాతలు మరింత నమ్మకం ప్రదర్శించాలని ఆమె పిలుపునిచ్చారు.
స్వతంత్ర దర్శకనిర్మాత, రచయిత్రి ప్రీతి శర్మ మాట్లాడుతూ- సవాలు విసిరే పరిస్థితుల నడుమ డాక్యుమెంటరీల రూపకల్పనలో అచంచల అంకితభావం ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. “పరిమిత వనరులు, నిధుల కొరత, మానవ శక్తి లేమి వంటి ప్రతికూలతల మధ్య ఒక డాక్యుమెంటరీ నిర్మాణంలో చాలామంది దర్శకులు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటారు. అయితే, ఆ కృషి ఎంతో విశిష్టమైనదైనా, అటువంటి చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేయడం అత్యంత పెనుసవాలు” అని ఆమె వ్యాఖ్యానించారు. ‘యూట్యూబ్’కు అతీతంగా మరిన్ని అధికారిక ప్రదర్శన-పంపిణీ వేదికల అవసరాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.
జాతీయ అవార్డు గ్రహీత అయిన దర్శకుడు ప్రబల్ ఖౌండ్ మాట్లాడుతూ- ఈశాన్య భారత ఆదివాసీ సామాజిక జీవన విశేషాల చిత్రీకరణలో తన అనుభవాలను పంచుకున్నారు. డాక్యుమెంటరీ చిత్రనిర్మాణానికి ఎంతో ఓర్పు, సాంస్కృతిక అవగాహన, పట్టుదల అత్యావశ్యకాలని పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాల చిత్రీకరణలో ఎదురయ్యే సవాళ్లను వివరిస్తూ- డాక్యుమెంటరీ దర్శకుల పని సులభం, మరింత ప్రభావశీలం కావాలంటే సాంకేతిక పురోగమనాన్ని కూడా అనుసరించాలని ఆయన సూచించారు.
ప్రేక్షకు దృక్పథంలో మార్పులను సంధానకర్త శ్రీ పంకజ్ సక్సేనా ప్రస్తావించారు. ఒకప్పుడు డాక్యుమెంటరీ అనగానే వారి నుంచి విసుగుతో కూడిన నిట్టూర్పు వెలువడేదని గుర్తుచేశారు. అయితే, “నేటి తరం దర్శకులు వ్యక్తిగత అనుభవాలతోపాటు మానవాళి జీవన పోరాటం, సామాజిక పరిణామాల్లోని లోతుపాతులను తమ కథల్లో హృద్యంగా మేళవిస్తున్నారు. వారి అభిరుచి, ప్రామాణికతతే ఈ మాధ్యమాన్ని రూపాంతరీకరిస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.
మిశ్రమ (హైబ్రిడ్) డాక్యుమెంటరీలు, డాక్యు-ఫిక్షన్ (డాక్యుమెంటరీ-కల్పన) సహిత సరికొత్త రూపాలపైనా ఈ చర్చలో దృష్టి సారించారు. సమకాలీన డాక్యుమెంటరీల దర్శకులు సంప్రదాయ వివరణ స్థాయిని అధిగమించి మానవ భావోద్వేగాలు, వ్యక్తిగత ప్రస్థానం, మానవాళి జీవితానుభవ సహిత కథనాలతో ముందుకొస్తున్నారని గోష్ఠిలో పాల్గొన్నవారు ఏకాభిప్రాయానికి వచ్చారు. భావోద్వేగ ప్రామాణికత, సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక నిబద్ధత సమ్మేళనంగా రూపొందుతున్న నేటి డాక్యుమెంటరీలు మునుపెన్నడూ లేని రీతిలో విస్తృత ప్రేక్షకులతో మమేకం అవుతున్నాయని పేర్కొన్నారు.
***
रिलीज़ आईडी:
2274931
| Visitor Counter:
10