రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రతిష్ఠాత్మక వంతెనలు - నవ భారత్ మౌలిక సదుపాయాల పరివర్తనకు మూలస్తంభాలు
प्रविष्टि तिथि:
16 JUN 2026 6:53PM by PIB Hyderabad
గత పన్నెండేళ్లుగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో... కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ చైతన్యవంతమైన మార్గదర్శకత్వంలో... రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ అనేక ప్రతిష్ఠాత్మక వంతెనలు అందించింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతాలు కేవలం భౌతిక కట్టడాలు మాత్రమే కాదు — అవి మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధి, జాతీయ సమైక్యత, ఆర్థిక పురోగతి, సమ్మిళిత వృద్ధి పట్ల ప్రభుత్వానికి గల అచంచల నిబద్ధతకు శక్తిమంతమైన చిహ్నాలు. గతంలో చేరుకోలేని ప్రాంతాలను అనుసంధానించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రవాణా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా... ఈ వంతెనలు ప్రాంతీయ అభివృద్ధిని బలోపేతం చేయడంలో, రాకపోకలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి.
వంతెనలు: ఆధునిక భారత అద్భుతాలు
భారత్ అనేక నదులకు నిలయం. అవి ప్రజల జీవనం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ మహానదులపై భారత్ కొన్ని అత్యద్భుతమైన వంతెనలను నిర్మించింది. మనలో చాలామంది పెద్దగా గమనించకపోయినప్పటికీ... వంతెనలు మన దైనందిన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. రోజుల తరబడి ప్రయాణించే పరిస్థితిని మార్చి, ప్రయాణ దూరాలను గణనీయంగా తగ్గిస్తాయి. మారుమూల ప్రాంతాలకు ప్రవేశాన్ని కల్పిస్తాయి. ప్రకృతి ప్రకోపాలను తట్టుకుంటాయి.
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న లెక్కలేనన్ని వంతెనల నెట్‌వర్క్‌లోని అనేక కీలకమైన వంతెనలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి స్థాయికి, దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రతి వంతెన తనదైన ప్రత్యేక రూపకల్పనను, కష్టతరమైన ప్రయాణాన్ని సులభతరం చేయాలనే మానవ సంకల్పాన్ని కలిగి ఉంటుంది. ఆర్చ్ వంతెనల నుంచి ఎక్స్‌ట్రాడోస్డ్, కేబుల్-స్టేడ్ వంతెనల దాకా... అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాలు, ఇంజనీరింగ్ ప్రతిభను ప్రదర్శించే బృహత్ నిర్మాణాలను నిర్మించినందుకు దేశం గర్విస్తోంది.
గౌహతిలోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెన
గంభీరమైన బ్రహ్మపుత్ర నదిపై ఉన్న 1.49 కిలోమీటర్ల పొడవైన 'కొత్త' సరాయిఘాట్ వంతెన.. చరిత్రాత్మక పాత సరాయిఘాట్ వంతెనకు సమాంతరంగా ఉంటూ, అస్సాం రాష్ట్రానికి ఒక కీలక అనుసంధాన మార్గంగా నిలుస్తుంది. దీని నిర్మాణం ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించి, రోజూ ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు సులువైన రాకపోకలను కల్పించింది. ఈ వంతెన ఉత్తర, దక్షిణ గౌహతి మధ్య ప్రయాణాన్ని మెరుగుపరచడంతో పాటు, ఎన్‌హెచ్-27పై తూర్పు-పశ్చిమ కారిడార్‌లోనూ రాకపోకలను సులభతరం చేస్తుంది.
కోటాలోని చంబల్ నదిపై వంతెన
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి రాజస్థాన్‌లోని కోటాలో చంబల్ నదిపై నిర్మించిన 6-వరుసల సింగిల్ ప్లేన్ కేబుల్-స్టేడ్ వంతెన. ఇది 1.4 కిలోమీటర్ల పొడవుతో, రాజస్థాన్‌లోని తొలి వేలాడే వంతనెగా నిలిచింది. దీనిని 2017, ఆగష్టు నెలలో జాతికి అంకితం చేశారు.
ఈ వంతెన 30 మీటర్ల వెడల్పుతో, ఇరువైపులా 1.5 మీటర్ల వెడల్పు గల పాదచారుల మార్గాలను కలిగి ఉంది. స్టే కేబుల్స్, త్రివిధ రక్షణ కలిగిన, విడివిడిగా షీత్ చేసిన తీగలతో దీనిని రూపొందించారు. బయటి కేబుల్ డక్ట్‌లు... వర్షం, గాలి వల్ల కలిగే ప్రకంపనలను నివారించడం ద్వారా ఈ నిర్మాణం బలాన్ని, మన్నికను పెంచగలవు.
ఈ వంతెన ప్రధాన విశేషాల్లో దాని పర్యావరణ, వన్యప్రాణులకు అనుకూలమైన రూపకల్పన ఒకటి. అంతరించిపోతున్న ఘరియాల్, రెడ్ క్రౌన్డ్ రూఫ్ తాబేలు, గంగా నది డాల్ఫిన్‌లకు నిలయమైన జాతీయ చంబల్ ఘరియాల్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని రక్షించడానికి, ఆరు వరుసల ఈ వంతెనలో దాదాపు 300 మీటర్ల భాగాన్ని నది గర్భంలో ఎటువంటి పిల్లర్ నిర్మాణం లేకుండా తీగలతో వేలాడేలా నిర్మించారు.
భరూచ్‌లో నర్మదా నదిపై వంతెన
గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో ఎన్‌హెచ్-8పై 1.34 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నర్మదా నది మీద నిర్మించారు. దేశంలోనే అత్యంత పొడవైన స్పాన్‌లలో ఒకటైన ఈ ఎక్స్‌ట్రాడోస్డ్ వంతెనను 34 నెలల వ్యవధిలో పూర్తి చేసి, మార్చి-2017లో రాకపోకల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ వంతెన 20.8 మీటర్ల వెడల్పుతో ఉండగా, నిర్మాణానికి ఇరువైపులా 3 మీటర్ల ఫుట్‌పాత్ ఉంది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో ఎన్‌హెచ్-8పై అహ్మదాబాద్-ముంబయి మార్గంలో భాగంగా ఉన్న ఈ వంతెన... ఆ ప్రాంత వేగం, భద్రత, ఆర్థిక వృద్ధికి ఊపునిచ్చింది.
బీహార్‌లో గంగా నదిపై నిర్మించిన వంతెన
బీహార్ రాష్ట్రంలో ఎన్‌హెచ్-31 పై గల ఔంటా-సిమారియా సెక్షన్‌లో, గంభీరమైన గంగా నదిపై 1.8 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల వంతెన ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, 34 మీటర్ల వెడల్పు గల డెక్‌తో ఒకే సెగ్మెంటల్ నిర్మాణంతో రూపొందించిన దేశంలోని అత్యంత వెడల్పైన ఎక్స్‌ట్రాడోస్డ్ వంతెనల్లో ఒకటి ఇక్కడ నదిపై ఉంది. 57 మీటర్ల నుంచి 115 మీటర్ల వరకు స్పాన్ పొడవులు, 70 మీటర్ల క్యాంటిలివర్ ఆర్మ్‌లతో... ఈ నిర్మాణం ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన రెండు వరుసల రైలు-రోడ్డు వంతెన అయిన పాత రాజేంద్ర సేతుకు సమాంతరంగా ఈ వంతెనను నిర్మించారు. పాత వంతెన కాలం చెల్లడం, విస్తృతమైన మరమ్మతుల కారణంగా భారీ వాహనాలకు అనుకూలంగా లేకపోవడంతో సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంగా నదిపై నిర్మించిన ఈ కొత్త ఆరు వరుసల ఎక్స్‌ట్రా-డోస్డ్ వంతెన ఉత్తర, దక్షిణ బీహార్‌ల మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తుంది. దీనిని 2025, ఆగస్టులో గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించారు.
ధోలా–సాదియా వంతెన
భూపేన్ హజారికా సేతు అని కూడా పిలిచే ఈ 9.15 కిలోమీటర్ల పొడవైన ధోలా–సాదియా వంతెన... అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్య ఒక కీలక అనుసంధాన కేంద్రంగా ఉంది. ఇది ఉత్తర అస్సాం, తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్య తొలి శాశ్వత రహదారి అనుసంధానాన్ని అందిస్తుంది. బీమ్ బ్రిడ్జ్‌గా నిర్మించిన ఈ వంతెన... బ్రహ్మపుత్ర నది ప్రధాన ఉపనదుల్లో ఒకటైన లోహిత్ నదిపై విస్తరించి, టిన్సుకియా జిల్లాలోని ధోలాను ఉత్తరాన ఉన్న సాదియాతో కలుపుతుంది. భారత సైన్యానికి చెందిన అర్జున్, టీ-72 నమూనాలు సహా 60-టన్నుల సైనిక ట్యాంకుల భారాన్ని తట్టుకునేలా ఈ వంతెనను నిర్మించారు. ఈ సామర్థ్యం ఈ నిర్మాణానికి గణనీయమైన వ్యూహాత్మక విలువను జోడిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2273751)
आगंतुक पटल : 32