ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

భారత్‌ను నిజంగా ఏకం చేసింది మునులు, రుషులే: ‘అగస్త్యర్-ది యూనిఫైర్’ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్


దేశ సాంస్కృతిక ఐక్యతకు అగస్తియర్ ఒక ప్రతీక: ఉపరాష్ట్రపతి

దేశ ఐక్యత అనేది ఆధునిక భావన కాదు... అదొక ప్రాచీన నాగరికతా వాస్తవం: ఉపరాష్ట్రపతి

తమిళం ద్వారా ఎంతోమంది అభివృద్ధి చెందారు... కానీ తమిళం కోసం కృషి చేసిన వారిని నేడు పక్కన పెడుతున్నారు: ఉపరాష్ట్రపతి

భారత్‌ను ఏ శక్తీ విడదీయలేదు: ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 15 JUN 2026 6:46PM by PIB Hyderabad

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ నేడు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘అగస్త్యర్‌-ది యూనిఫైయర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా దేశ నాగరికత, ఐక్యత గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. జాతీయ సమగ్రత గురించి చర్చించేటప్పుడు సాధారణంగా రాజులు, రాజకీయ వ్యవస్థల గురించే ఎక్కువగా గుర్తుచేసుకుంటారు. కానీ, దేశ ఐక్యతకు నిజమైన నిర్మాతలు ఇక్కడి సాధువులు, రుషులేనని తెలిపారు. వారిలో అగస్త్య మహర్షి (అగస్త్యర్) భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఏకత్వానికి గొప్ప ప్రతీకగా నిలుస్తారని కొనియాడారు.

 

ఉత్తర, దక్షిణ భారత సాంప్రదాయాలు రెండింటిలోనూ సమానంగా పూజలందుకునే అగస్త్య మహర్షి.. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న అఖండ భారతావని ఐక్యతకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. తమిళనాడులోని ‘పోతిగై కొండలు’, ‘కావేరి నది’ ఇప్పటికీ అగస్త్య మహర్షి జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే ఉంటాయన్నారు. తమిళ వ్యాకరణం, తమిళ ‘సంగం’ సంప్రదాయాల అభివృద్ధికి అగస్త్యుడు చేసిన విశేష కృషిని ప్రస్తావిస్తూ.. ఆయన ఉత్తర, దక్షిణ భారత సంస్కృతులను కలిపే ఒక గొప్ప వారధి అని అభివర్ణించారు.

 

భారతదేశ భాషలు ఒకదానికొకటి పోటీదారులు కావని, శతాబ్దాల తరబడి పరస్పర గౌరవం, సాంస్కృతిక మార్పిడి ద్వారా ఒకదానినొకటి సంపన్నం చేసుకున్న సోదరి భాషలని అగస్త్యుడి వారసత్వం నిరూపిస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు.

 

తమిళం వల్ల చాలా మంది ప్రయోజనం పొందినప్పటికీ, తమిళ భాషాభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన వారికి నేడు తగిన గుర్తింపు లభించడం లేదంటూ సీపీ రాధాకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తమిళ తాతగా పేరుగాంచిన వీ స్వామినాథ అయ్యర్ చేసిన సేవలు, త్యాగాలను ప్రస్తావించారు. తమిళ భాషకు స్వామినాథ అయ్యర్ చేసిన సేవ గురించి ప్రజలకు తగినంతగా తెలియజేయలేదని విచారం వ్యక్తం చేశారు.అంతరించిపోయే స్థితిలో ఉన్న అమూల్యమైన తమిళ సాహిత్య సంపదను కాపాడి, వెలుగులోకి తెచ్చిన మహనీయుడు స్వామినాథ అయ్యర్ అని ఉపరాష్ట్రపతి కొనియాడారు.

 

భారతదేశ ఐక్యత అనేది ఈ మధ్య కాలంలో ఏర్పడిన ఆధునిక భావన కాదని, ఇది వేల సంవత్సరాలుగా ఇక్కడి రుషులు, జ్ఞానుల ద్వారా పోషించిన ప్రాచీన నాగరికత, వాస్తవికత అని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. అగస్త్య మహర్షి జీవితం, ఆయన అందించిన వారసత్వమే ఈ నిత్యసత్యానికి సజీవ సాక్ష్యాలని ఆయన పేర్కొన్నారు.

 

ప్రతి భాషకు దానికంటూ ఒక ప్రత్యేకమైన బలం, గొప్పతనం ఉంటాయని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి.. కొందరు వ్యక్తులు భాషా పరమైన విభజనలను ప్రోత్సహిస్తూ, సమాజంలో అనవసరమైన చర్చలను, విచ్ఛిన్నకర ధోరణులను పెంచి పోషిస్తున్నారని హెచ్చరించారు.

 

దేశాన్ని విడదీయడం ఏ శక్తీ వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. మన దేశ సంస్కృతి, నాగరికత వారసత్వంపై యువతలో సానుకూల అవగాహనను పెంపొందించేలా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

 

తమిళనాడులో అగస్త్య మహర్షి పేరు మీదుగా అగస్తీశ్వరార్ ఆలయాలుగా పిలవబడే వందకు పైగా దేవాలయాలు ఉన్నాయని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. కాశీ (వారణాసి)తో పాటు తమిళనాడులోనూ ఒకే పేరుతో ఆలయాలు ఉండటం దేశ సాంస్కృతిక ఐక్యతకు నిలువెత్తు నిదర్శనమని ఆయన కొనియాడారు.

 

బ్రిటిష్ వారి పరిపాలన లేకపోతే భారతదేశం ఒక్కటిగా ఉండేది కాదనే వాదనను ఉపరాష్ట్రపతి పూర్తిగా తిరస్కరించారు. బ్రిటీష్ పాలనతో సంబంధం లేకుండానే, దేశ సంస్కృతి, నాగరికత ఎల్లప్పుడూ అన్ని ప్రాంతాల ప్రజలను, తరతరాలుగా ఒకరితో ఒకరిని ముడివేసి ఉంచాయని ఆయన పేర్కొన్నారు.

 

ఈ పుస్తక రచయితలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌లోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ అనే నాలుగు దిక్కుల్లో అగస్త్య మహర్షికి సంబంధించిన సంప్రదాయాలు, కథలు, ఆధారాలు ఎంత విస్తృతంగా ఉన్నాయనే విషయాన్ని వారు ఎంతో పరిశోధన చేసి, అత్యంత నిశితంగా ఈ పుస్తకంలో పొందుపరిచారని పేర్కొన్నారు. అగస్త్యుడి గొప్పతనాన్ని, దేశ సాంస్కృతిక ఐక్యత సందేశాన్ని ప్రపంచవ్యాప్త పాఠకులకు చేరవేయడంలో ఈ పుస్తకం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

 

ఈ అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించినందుకు ‘కలైమగల్’ పత్రికను ఉపరాష్ట్రపతి అభినందించారు. గత 95 సంవత్సరాలకు పైగా కలైమగల్ పత్రిక తమిళ సాహిత్యాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం కాపాడుతూ, ప్రోత్సహిస్తూ విశేష సేవలు అందిస్తోందని కొనియాడారు. ఎంతోమంది తమిళ పండితులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, జాతీయ నాయకులు తమ రచనల ద్వారా ఈ పత్రిక  నాణ్యతను, విశ్వసనీయతను ఎంతగానో పెంచారని ఆయన గుర్తుచేసుకున్నారు.

 

ఉపరాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్, కలైమగల్ పత్రిక సంపాదకులు శ్రీ కీలంబూర్ శంకర సుబ్రమణియన్, సీనియర్ రచయిత, జర్నలిస్ట్ శ్రీ మాలన్, పుస్తక రచయితలు శ్రీ ఓ.శ్యామ భట్, డాక్టర్ ఎంఎన్‌ సుధ, పుస్తకాన్ని తమిళంలోకి అనువదించిన ప్రొఫెసర్ కళ్యాణితో పాటు పలువురు ప్రముఖులు, అతిథులు పాల్గొన్నారు.

***


(रिलीज़ आईडी: 2273328) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam