ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు
प्रविष्टि तिथि:
14 JUN 2026 8:37PM by PIB Hyderabad
జూన్ 14, 2026న నీస్‌లోని విల్లా కెరిలోస్ వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను విశిష్టమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన తొలి సమావేశమిది.
ద్వైపాక్షిక సంబంధాల్లోని పలు అంశాలపై ఇరుదేశాల నేతలు విస్తృత చర్చలు జరిపారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారం అద్భుతంగా వృద్ధి చెందటం, మరింత బలోపేతం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రక్షణ వేదికలు, అత్యాధునిక సాంకేతికతలను సంయుక్తంగా రూపకల్పన చేయటం, అభివృద్ధి చేయటం, ఉత్పత్తి చేయటం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ఈ సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ సహకార వారసత్వాన్ని ఇరుదేశాల నేతలు గుర్తు చేసుకున్నారు. మానవసహిత అంతరిక్ష యాత్రలు, అంతరిక్షంలోని పరిస్థితుల అవగాహనా రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవటంపై చర్చించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్య విస్తరణ మార్గాలపైనా చర్చలు జరిపారు. పౌర అణు ఇంధన రంగంలో చిన్న, అధునాతన మాడ్యులర్ రియాక్టర్లతో సహా వివిధ అంశాలపై సహకారానికి భారతదేశ శాంతి చట్టం నూతన అవకాశాలను కల్పిస్తుందన్నారు.
హారిజన్-2047 రోడ్‌మ్యాప్ ద్వారా జరిగిన పురోగతిని సమీక్షిస్తూ.. ఆర్థిక వృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రతిభావంతుల స్థానచలనం, ప్రజల మధ్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, వైవిధ్యభరితంగా మార్చటంపై ఇరువురు నేతల ఆలోచనలను పంచుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థిరమైన వృద్ధిని గుర్తించిన నేతలు.. అయిదేళ్లలో దీన్ని రెట్టింపు చేసేందుకు ఉన్నత స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయటానికి అంగీకారం తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్న భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎంఈ, విమానయాన, రైల్వే రంగాల్లో సహకారాన్ని పెంపొందించే మార్గాలపైనా చర్చించారు. ఏరోనాటిక్స్‌లో నైపుణ్యాభివృద్ధికి కాన్పూర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ఒప్పందాన్ని స్వాగతించారు. ఆర్థిక భద్రతపై చర్చా వేదిక ప్రారంభాన్ని స్వాగతిస్తూ.. కీలక ఖనిజాల రంగంలో సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేయటానికి ఇరుదేశాల నేతలు ఆమోదం తెలిపారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో ఆవిష్కరణ, సాంకేతికతల కీలక పాత్రను గుర్తిస్తూ.. భాగస్వామ్యానికి దీర్ఘకాలిక దిశానిర్దేశం చేసేందుకు "ఆవిష్కరణల రోడ్‌మ్యాప్-2030"ని ఇరుదేశాలు ఆమోదించాయి. కృత్రిమ మేధపై సహకార విస్తరణకు సంబంధించి చర్చలు జరిపారు. ఇందుకోసం సంయుక్తంగా భారత్-ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని అంగీకరించారు. నీస్‌లో భారత్ ఇన్నోవేట్స్‌ను ఇరుదేశాల నేతలు సంయుక్తంగా ప్రారంభించటం, పారిస్‌లో జరగనున్న వివాటెక్‌లో ప్రధానమంత్రి పాల్గొననుండటం.. డీప్-టెక్, సెమీకండక్టర్లు, అగ్రి-టెక్, మెడ్-టెక్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. ఫ్రాన్స్‌లో యూపీఐ నిరంతర విస్తరణను, ఇరుదేశాల ఆవిష్కరణల వ్యవస్థలలోని సంస్థల మధ్య 19 ఒప్పందాలు కుదరటాన్ని ఇరువురు నేతలు అభినందించారు.
ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను ఇరుదేశాల నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ విమానాశ్రయాల్లో భారత పౌరులకు వీసా రహిత రవాణా సౌకర్యాన్ని వేగంగా అమల్లోకి తెచ్చినందుకుగానూ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇరుదేశాల మధ్య ప్రతిభావంతులు, విద్యార్థుల రాకపోకలను పెంపొందించే మార్గాలు, విద్యార్హతల పరస్పర గుర్తింపును విస్తరించటంపైనా చర్చించారు. నూతన విద్యా విధానం ద్వారా భారతదేశంలో క్యాంపస్‌లను ప్రారంభించాలని ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి ఆహ్వానించారు. లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌తో సహా మ్యూజియంలు, సాంస్కృతిక సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాల నేతలు అంగీకరించారు.
పశ్చిమాసియా, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత గల పలు అంశాలపై ఇరుదేశాల నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. ఎవియన్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ సదస్సుకు ముందుగానే కీలకమైన చర్చల్లో భారత్‌ను భాగస్వామిని చేసినందుకు అధ్యక్షుడు మాక్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇరుదేశాల ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించటంలోనూ, ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, సంక్షేమాన్ని పెంపొందించటంలోనూ భారత్-ఫ్రాన్స్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాముఖ్యతను ఇరుదేశాల నాయకులు స్పష్టం చేశారు.
భారత్‌లోని జైపూర్‌లో 10 రోజుల పాటు జరిగిన ఆర్ట్ రెసిడెన్సీ సమయంలో ఫ్రాన్స్ కళాకారులు థిబాల్ట్ లా లాన్స్, థియోఫిలే డి బాస్చర్ రూపొందించిన కళాఖండాలను దేశాధ్యక్షుడు మాక్రాన్, ప్రధానమంత్రి వీక్షించారు. ఈ కళాకారులు భారతీయ వారసత్వం, రమణీయత నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన కళాఖండాలు.. భారత్-ఫ్రాన్స్ దేశాల సాంస్కృతిక కలయికను ప్రతిబింబించాయి.
చర్చల అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి గౌరవార్థంగా అధ్యక్షుడు మాక్రాన్ విందు ఏర్పాటు చేశారు.
***
(रिलीज़ आईडी: 2273007)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam