హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన అమర్‌నాథ్ యాత్ర-2026 ఏర్పాట్లపై నేడు న్యూఢిల్లీలో భద్రతా సమీక్ష
శ్రీ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రత, సౌకర్యవంతమైన యాత్రా అనుభవాన్ని అందించేందుకు నిబద్ధతతో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం
యాత్రా మార్గంలో వివిధ స్థాయిల్లో అత్యంత సురక్షితమైన భద్రతా వలయ ఏర్పాటుకు పరస్పర సమన్వయంతో పనిచేయనున్న సీఏపీఎఫ్‌లు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా సంస్థలు
డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు, ఇతర ఆధునిక సాంకేతికతల విస్తృత వినియోగం ద్వారా మరింత బలంగా భద్రతా విభాగం
యాత్రా సమయంలో క్యాంపు సైట్ల నుంచి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించనున్న వివిధ సీఏపీఎఫ్‌లు, జమ్మూకాశ్మీర్ పోలీసులు
యాత్రా మార్గంలోనే కాకుండా ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాల్లోనూ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు.. పర్యాటక ప్రాంతాల్లో సురక్షితంగా, భద్రంగా యాత్రికులు ఉండగలిగేలా చర్యలు
యాత్రికుల నమోదు, వసతి, ఆరోగ్య సంరక్షణ సేవలు, విపత్తు నిర్వహణతో సహా అన్ని రకాల ముఖ్యమైన వసతుల కోసం తప్పనిసరిగా ఏర్పాట్లు
యాత్రతో సంబంధమున్న స్థానిక వ్యక్తులు, జంతువుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుల జారీ
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వాతావరణ శాఖ సూచనల ఆధారంగానే యాత్రికుల ప్రయాణ నియంత్రణ
प्रविष्टि तिथि:
12 JUN 2026 5:06PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన అమర్‌నాథ్ యాత్ర-2026 ఏర్పాట్లపై నేడు న్యూఢిల్లీలో భద్రతా సమీక్షను నిర్వహించారు. ఈ ఏడాది జూలై 3వ తేదీ నుంచి ఆగస్టు 28 వరకు శ్రీ అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది.
జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, జమ్మూకాశ్మీర్ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్‌లు) డైరెక్టర్ జనరల్స్, కేంద్ర హోంశాఖ, భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత పాలనా విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శ్రీ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతను, సౌకర్యవంతమైన యాత్రా అనుభూతిని అందించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు.
అన్ని భద్రతా సంస్థల సమన్వయంతో ఈ యాత్రకు సమగ్రమైన, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు, ఇతర సాంకేతిక పరికరాల వంటి ఆధునిక సాంకేతికతల విస్తృత వినియోగం ద్వారా సంప్రదాయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఏపీఎఫ్‌లు, ఇతర భద్రతా సంస్థల భాగస్వామ్యంతో యాత్ర మార్గంలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
యాత్ర సమయంలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వివిధ సీఏపీఎఫ్‌లు, జమ్మూకాశ్మీర్ పోలీసు విభాగ ఉన్నతాధికారులు క్యాంప్ సైట్లలో నిరంతరం అందుబాటులో ఉండాలని శ్రీ అమిత్ షా చెప్పారు. యాత్రికుల నమోదు, వసతి, వైద్య సదుపాయాలు, విపత్తు నిర్వహణతో సహా అత్యవసర సేవల కోసం తగిన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యాత్ర నమోదు, యాత్రికుల సహాయానికి సంబంధించిన సమాచారాన్ని శ్రీ అమర్‌నాథ్ శ్రైన్ బోర్డు వెబ్‌సైట్ https://jksasb.nic.in ద్వారా వివరాలను పొందవచ్చు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా యాత్రికుల బృందాల కదలికలను నియంత్రించాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు. యాత్రా మార్గంలోనే కాకుండా ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాల్లోనూ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లను కల్పించాలని, పర్యాటక ప్రాంతాల్లో సురక్షితంగా, భద్రంగా యాత్రికులు ఉండగలిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
యాత్రతో సంబంధమున్న స్థానిక వ్యక్తులు, జంతువుల నమోదుకు ఏర్పాట్లు చేశామని, క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డులు జారీ చేస్తామని హోంమంత్రికి అధికారులు వివరించారు. యత్రా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే జంతువుల ఆరోగ్య పరీక్షలు, శారీరక సామర్థ్య అంచనాకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
(रिलीज़ आईडी: 2272459)
आगंतुक पटल : 11