MIFF banner

నెల 15 నుంచి 21 వరకు 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

గుడ్ లక్ టు యు ఆల్ (యానిమేషన్), అగాపిటో (లఘు చిత్రం), టైమ్ అండ్ వాటర్ (డాక్యుమెంటరీ) చిత్రాల ప్రదర్శనతో ప్రారంభం* పోటీ, పోటీయేతర విభాగాల్లో 46 దేశాల నుంచి 346 చిత్రాల ప్రదర్శన
* ఏఐ సినిమా హ్యాకథాన్, కొత్త ప్రాంతీయ విభాగాలు, విస్తరించిన పరిశ్రమ భాగస్వామ్యం ముఖ్యాంశాలుగా ఎమ్ఐఎఫ్ఎఫ్-2026
* ఎమ్ఐఎఫ్ఎఫ్‌లో 155 ఎంట్రీలను ప్రదర్శించనున్న వేవ్స్ డాక్ బజార్... బీ2బీ పరిశ్రమ నుంచి బలమైన భాగస్వామ్యం
* 19వ ఎమ్ఐఎఫ్ఎఫ్‌లో మరాఠీ చిత్రాల ప్రత్యేక విభాగాన్ని ప్రదర్శించడం కోసం ఫిల్మ్ సిటీతో ఎన్ఎఫ్‌డీసీ ఒప్పందం

డాక్యుమెంటరీ, కల్పనాత్మక లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాల ప్రదర్శనల వారం రోజుల వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్ర రూపకర్తలు, కథకులు, పరిశ్రమ నాయకులు, సినీ ప్రియులకు స్వాగతం పలకడానికి ముంబయి సిద్ధమవుతున్న తరుణంలో... 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్) కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నాన్ ఫీచర్ ఫిల్మ్‌ కేటగిరీ చిత్రాల కోసం ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే, సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసే ఈ చలనచిత్రోత్సవం... ఈ నెల 15 నుంచి 21 వరకు జరగనుంది. ఇది సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణ, ప్రపంచ సినిమా శ్రేష్ఠతల ఉజ్వల సంగమానికి హామీ ఇస్తుంది.

 

చలనచిత్రోత్సవ ప్రారంభోత్సవం గురించి ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ మగ్దుమ్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా 1,459 చిత్రాల ఎంట్రీలతో ఎమ్ఐఎఫ్ఎఫ్-2026కు అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు. పోటీ విభాగంలో 13 దేశాలకు చెందిన చిత్రరూపకర్తల నుంచి 52 అంతర్జాతీయ, 92 జాతీయ ఎంట్రీలు సహా మొత్తం 144 చిత్రాలు పోటీపడనున్నాయని ఆయన పేర్కొన్నారు. పోటీయేతర విభాగంలో మొత్తం 202 చిత్రాలను ప్రదర్శించనుండగా... వీటిలో 46 భాగస్వామ్య దేశాల నుంచి 106 అంతర్జాతీయ, 96 జాతీయ చిత్రాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఇవన్నీ కలిసి 83 గంటలకు పైగా ప్రదర్శనలను అందిస్తాయి. దీనిలో మొజాయిక్, బెస్ట్ ఆఫ్ ఫెస్ట్, బుసాన్ నెక్స్ట్ వేవ్, ఆస్కార్ విన్నర్స్, రైమండ్ క్రుమ్మె రెట్రోస్పెక్టివ్, ఎన్ఎఫ్‌డీసీ షోకేస్, ఎకోస్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, మరాఠీ ఫిల్మ్స్ వంటి 24 ప్రత్యేక విభాగాలు ఉంటాయి. ఇవి ప్రశంసలు పొందిన చిత్రాలను, వర్ధమాన చిత్ర రూపకర్తల అభిప్రాయాలు-అనుభవాలను, ప్రాంతీయ మూలాలతో కూడిన కథనాలను ఒకే వేదికపైకి తీసుకువస్తాయి. ప్రముఖ చిత్ర నిర్మాత డేవిడ్ అటెన్‌బరోను గౌరవిస్తూ, ఆయన ‘శతజయంతి నివాళి’గా ఆయన రూపొందించిన రెండు చిత్రాలనూ ప్రదర్శించనున్నారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర ఫిల్మ్, స్టేజ్ - కల్చరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి స్వాతి మాసే పాటిల్ మాట్లాడుతూ... "ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రరూపకర్తలు, నిర్మాతలు, ప్రసారదారులు, విద్యార్థులు, విమర్శకులు, ప్రేక్షకులను ఒకచోట చేర్చే ఎమ్ఐఎఫ్ఎఫ్... నాన్-ఫీచర్ చిత్రాల కోసం ఆసియాలోనే అత్యంత గౌరవనీయ వేదికల్లో ఒకటిగా అభివృద్ధి చెందింది" అని అన్నారు. మరాఠీ చిత్రాల విభాగాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ... ఈ కార్యక్రమం మరాఠీ కథనం, సంస్కృతి, వారసత్వం, సినిమా రంగంలోని శ్రేష్ఠతను ప్రదర్శించేందుకు అంతర్జాతీయ వేదికను అందిస్తుందని ఆమె అన్నారు. భారత ప్రధాన చిత్రీకరణ కేంద్రంగానే కాకుండా... అర్థవంతమైన, ప్రభావవంతమైన కథనాలకు ప్రపంచస్థాయి కేంద్రంగానూ ఆవిర్భవించడానికి మహారాష్ట్ర సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

 

డాక్యుమెంటరీలు, కల్పనాత్మక లఘు చిత్రాలు, యానిమేషన్‌లకు ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం... ఈ మూడు ఫార్మాట్లలోనూ ఒక్కో చిత్ర ప్రదర్శనతో ప్రారంభమవుతుంది. కార్డెల్ బార్కర్ (కెనడా) దర్శకత్వం వహించిన యానిమేటెడ్ చిత్రం 'గుడ్ లక్ టు యు ఆల్'... ఆర్విన్ బెలార్మినో, కైలా డనెల్ రోమెరో (ఫిలిప్పీన్స్) దర్శకత్వం వహించిన కల్పనాత్మక లఘు చిత్రం 'అగాపిటో'... సారా డోసా (యునైటెడ్ స్టేట్స్ - ఐస్‌లాండ్) దర్శకత్వం వహించిన 'టైమ్ అండ్ వాటర్' డాక్యుమెంటరీలు ప్రదర్శన ప్రారంభ చిత్రాలుగా ఉంటాయి.

 

జూన్ 18న జరగనున్న మిడ్-ఫెస్ట్ శ్రేణిలో, ఆండ్రియా స్జెలేసోవా (చెక్ రిపబ్లిక్ - స్లోవేకియా) దర్శకత్వం వహించిన యానిమేటెడ్ చిత్రం 'ఈనీ, మీనీ, మినీ, మో!'... ఆల్టే ఉలాన్ యాంగ్ (యునైటెడ్ స్టేట్స్) దర్శకత్వం వహించిన కల్పనాత్మక లఘు చిత్రం 'హైనా'... మోరిస్ ఫ్రీబర్గ్‌హాస్ (స్విట్జర్లాండ్) దర్శకత్వం వహించిన 'ఐ లవ్ యూ, ఐ లీవ్ యూ' డాక్యుమెంటరీ ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటీ విభిన్నమైన కథన శైలులను, అంతర్జాతీయ దృక్పథాలను అందిస్తుంది.

ఈ ఉత్సవంలో భాగంగా అంతర్జాతీయ, జాతీయ పోటీ విభాగాల్లో 18 పురస్కారాలను ప్రదానం చేస్తారు. వీటికి ట్రోఫీలు, సర్టిఫికెట్లతో పాటు మొత్తం రూ. 45 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారు. దిగ్గజ చిత్రనిర్మాత 125వ జయంతి సందర్భంగా, ప్రతిష్ఠాత్మక వి. శాంతారామ్ జీవిత సాఫల్య పురస్కారాన్నీ ప్రదానం చేయడం ప్రారంభోత్సవంలో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

 

19వ ఎమ్ఐఎఫ్ఎఫ్‌లో... ప్రఖ్యాత సినీ రంగ నిపుణులతో చిత్ర రూపకల్పన, కథనం, నటన, స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ వంటి అంశాలపై 10 మాస్టర్ క్లాసులు నిర్వహించనున్నారు. 19వ ఎమ్ఐఎఫ్ఎఫ్‌లో సినిమా ప్రదర్శనల సందర్భంగా ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఐదు ఓపెన్ ఫోరమ్ చర్చా కార్యక్రమాలనూ నిర్వహిస్తుంది.

 

ఎన్ఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌తో పాటు, దాదర్‌లోని రవీంద్ర నాట్య మందిర్, విల్లే పార్లేలోని ఎస్‌వీకేఎమ్ ఉషాప్రవీణ్ గాంధీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్-సైన్స్-కామర్స్, బాంద్రా వెస్ట్‌లోని సెయింట్ పాల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎడ్యుకేషన్ కళాశాలల్లోనూ ఈ ప్రదర్శనలు జరుగుతాయి.

 

ఈ ఏడాది ఎడిషన్‌లో ప్రాంతీయ సినిమా గొప్పదనాన్ని ప్రదర్శించడం, భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పడం లక్ష్యంగా... 'మరాఠీ సినిమాలు', 'నార్త్ఈస్ట్ ఎకోస్' అనే రెండు కొత్త విభాగాలనూ ప్రవేశపెట్టారు.

 

వేవ్స్ డాక్ బజార్ విభాగం... డాక్యుమెంటరీ ప్రతిభకు, మార్కెట్ అనుసంధానానికి ఒక కీలక వేదికగా తన పాత్రను ప్రతిబింబిస్తూ, సినీ రంగానికి అనుగుణంగా ఉండే అధిక-నాణ్యత గల, ఆచరణాత్మక ఎంపికలను అందిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం 155 ఎంట్రీలు సహా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ (డబ్ల్యూఐపీ) ల్యాబ్‌లోని 5 ప్రాజెక్టులు, ఫిల్మ్ బజార్ సిఫార్సుల కింద 12 చిత్రాలు ప్రదర్శించనున్నారు. పరిశ్రమ సంబంధిత వ్యక్తులు చూసి, మూల్యాంకనం చేయడం కోసం వీక్షణా గదిలో మొత్తం 155 చిత్రాలను ప్రదర్శిస్తారు. నెట్‌ఫ్లిక్స్, జీ, సోనీ, స్టేజ్ ఓటీటీ, వేవ్స్ ఓటీటీ వంటి ప్రముఖ వేదికలు, ప్రసారదారుల సమావేశాల ఖరారుతో ఈ విభాగం బలమైన బీ2బీ నెట్‌వర్కింగ్ అవకాశాలనూ కల్పిస్తుంది. ఇది డాక్యుమెంటరీల ఆవిష్కరణ, సహకారం, పంపిణీ కోసం ఒక ముఖ్యమైన మార్కెట్‌ప్లేస్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.

తొలిసారిగా, "ముంబయి త్రూ ఎ థౌజండ్ ఐస్" పేరుతో ఒక ఏఐ సినిమా హ్యాకథాన్‌నూ ఎమ్ఐఎఫ్ఎఫ్‌లో నిర్వహించనున్నారు. ఇది ఏఐ ఆధారిత కథన శైలిని అన్వేషించే 48 గంటల గ్లోబల్ ఫిల్మ్‌మేకింగ్ ఛాలెంజ్. ఈ ఫెస్టివల్‌లో ప్రముఖ చిత్రనిర్మాతలు, పరిశ్రమ నిపుణులతో 10 మాస్టర్‌క్లాస్‌లు, పలు ప్యానెల్ చర్చలూ ఉంటాయి.

 

ఎమ్ఐఎఫ్ఎఫ్-2026లో పాల్గొనడం కోసం విద్యార్థులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

 

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో https://www.pib.gov.in/MIFF/2026 వద్ద ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక మీడియా మైక్రోసైట్... ఎమ్ఐఎఫ్ఎఫ్ సంబంధిత అధికారిక కథనాలు, ఛాయాచిత్రాలు, మల్టీమీడియా కంటెంట్‌తో కూడిన ఒక సమగ్ర డిజిటల్ నిల్వ కేంద్రంగా పనిచేస్తుంది.

 

పత్రికా సమావేశంలో చేసిన ప్రెజెంటేషన్‌ను ఇక్కడ చూడవచ్చు.

 


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2272454   |   Visitor Counter: 5