మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బేటీ బచావో బేటీ పఢావో... పుట్టుకతోనే గౌరవం, బాల్య సంరక్షణకు పెద్దపీట

ప్రవర్తనలో మార్పు, బాలికా సాధికారత దిశగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన బేటీ బచావో బేటీ పఢావో

प्रविष्टि तिथि: 13 JUN 2026 11:10AM by PIB Hyderabad

పుట్టేటప్పుడు తీసుకునే జాగ్రత్తలే ఆ బిడ్డ జీవితానికి, తల్లి ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సేవలు, పోషకాహార మద్దతు, ఆసుపత్రి ప్రసవ వ్యవస్థల ద్వారా తల్లీ, పిల్లల సంరక్షణను భారత్‌ మరింత బలోపేతం చేసింది.

దేశవ్యాప్తంగా ఆడపిల్లల మనుగడ, రక్షణ, సాధికారతను నిర్ధారించడంలో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం బేటీ బచావో బేటీ పఢావో(బీబీబీపీ) నిరంతరం కీలక పాత్ర పోషిస్తోంది. క్షీణిస్తున్న బాలల లైంగిక నిష్పత్తి, సమాజంలో విస్తృతంగా పాతుకుపోయిన లింగ వివక్ష సమస్యలకు ముగింపు పలకాలనే లక్ష్యంతో 2015 జనవరి 22న ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల ఉమ్మడి చొరవతో ఈ పథకం కొనసాగుతోంది.

గడిచిన పదకొండేళ్ల కాలంలో బేటీ బచావో బేటీ పఢావో ఒక నిర్దేశిత విధానపరమైన చర్య నుంచి ప్రభుత్వం, మీడియా, పౌర సమాజం, వివిధ వర్గాల ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఒక దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగింది. ఈ కార్యక్రమం ఆడపిల్ల పుట్టుకతోనే దక్కాల్సిన గౌరవం, ఆమె రక్షణ, బాల్య దశలో సంరక్షణ, విద్యను పొందే హక్కు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది. తద్వారా బాలిక సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది.

కీలకమైన లింగ సూచికలను మెరుగుపరచడంలో ఈ పథకం గణనీయమైన సహకారాన్ని అందించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హెల్త్‌ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ) గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో జనన సమయంలో లింగ నిష్పత్తి 2014-15లో 918 గా ఉండగా, అది 2024-25 నాటికి 929కి పెరిగింది. లింగ నిర్ధారణ అధారంగా శిశు ఎంపికను నివారించడం, ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడంలో నిరంతరంగా జరుగుతున్న కృషికి ఇది అద్దం పడుతోంది.

విద్యా రంగంలో కూడా బాలికల పాఠశాల విద్యను పెంపొందించడంలో గణనీయమైన పురోగతి నమోదైంది. విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ) గణాంకాల ప్రకారం మాధ్యమిక స్థాయిలో బాలికల నమోదు శాతం 2014-15లో 75.51 శాతం ఉండగా.. అది 2024-25 నాటికి 80.2 శాతానికి పెరిగింది. ఇది పాఠశాలల్లో బాలికలు చదువును మధ్యలో ఆపకుండా కొనసాగిస్తున్నారని స్పష్టం చేస్తోంది.

బేటీ బచావో బేటీ పఢావో పథకం ఆడపిల్లల జీవనచక్ర విధానానికిప్రాధాన్యతనిస్తూనే ఉంది. ఇది సురక్షితమైన, గౌరవప్రదమైన పుట్టుకతో ప్రారంభమై, ప్రారంభ బాల్య సంరక్షణను నిర్ధారిస్తూ, బాలికల విద్య, సాధికారతకు మార్గం సుగమం చేస్తుంది. నిరంతర అవగాహన కార్యక్రమాలు, సమాజ భాగస్వామ్యం, వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమన్వయం ద్వారా సమాజంలో ప్రవర్తనా మార్పును ఈ పథకం మరింత బలోపేతం చేస్తోంది.

దేశంలోని ప్రతి ఆడపిల్లకు రక్షణ, విద్య, సాధికారత లభించేలా చూసేందుకు, తద్వారా మహిళల నేతృత్వంలోని అభివృద్ధి దార్శనికతకు దోహదపడేలా బేటీ బచావో బేటీ పఢావో విధానాలను మరింత బలోపేతం చేయడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోంది.

 


(रिलीज़ आईडी: 2272450) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada