రక్షణ మంత్రిత్వ శాఖ
కొచ్చికి వస్తున్న వాణిజ్య నౌక నుంచి పేలని క్షిపణిని సురక్షితంగా తొలగించిన భారత నౌకాదళం
प्रविष्टि तिथि:
11 JUN 2026 7:20PM by PIB Hyderabad
భారత నౌకాదళం ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ముడి చమురు రవాణా చేసే 'ఎమ్టీ ఒలింపిక్ లైఫ్' ట్యాంకర్ నౌక నుంచి పేలని ఒక క్షిపణి వారహెడ్‌ను నౌకాదళ సిబ్బంది సురక్షితంగా తొలగించింది.
యూఏఈలోని ఫుజైరా నుంచి కొచ్చికి వస్తున్న మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ ట్యాంకర్ నౌకలో భారతీయులెవరూ లేరు. మే 26, 2026న ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ నౌక కింది భాగంలో పేలుడు సంభవించినట్లు సమాచారం అందింది.
ఆ నౌక కొచ్చి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే, దానిపై ఒక పేలని పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించింది.
ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ - ఇండియన్ ఓషన్ రీజియన్ (ఐఎఫ్‌సీ- ఐఒఆర్) ద్వారా సమాచారం అందిన వెంటనే, భారత నౌకాదళం సమన్వయంతో కూడిన సహాయక చర్యలను ప్రారంభించింది. దీనిపై సమగ్రమైన అంచనా వేసేందుకు కొచ్చికి చెందిన సదరన్ నావల్ కమాండ్ ఒక ప్రత్యేక పేలుడు పదార్థాల నిర్వీర్య విభాగం (ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్) బృందాన్ని రంగంలోకి దించింది. ఆ నౌకలోకి ఒక క్షిపణి చొచ్చుకుపోయిందని, అది నౌకలోని పలు అంతర్గత భాగాల గుండా ప్రయాణించి, చివరకు ఇంధన ట్యాంక్ లోపల ఉండిపోయిందని నిపుణుల బృందం ధ్రువీకరించింది.
ఇంధన ట్యాంక్ లోపల పేలని క్షిపణి వారహెడ్ ఉండటం వల్ల తలెత్తే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఆ నౌకకూ, అందులోని సిబ్బందికీ, చుట్టుపక్కల ఉన్న రేవు మౌలిక సదుపాయాలకు హాని కలగని విధంగా ఈఓడీ బృందం ఎంతో అప్రమత్తంగా, దశలవారీ విధానాన్ని అవలంబించింది.
నిర్దిష్ట భద్రతా విధానాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత ఈఓడీ బృందం అధునాతన గుర్తింపు పద్ధతులను ఉపయోగించింది. క్షిపణి పేలేలా చేసే యంత్రాంగాన్ని గుర్తించి, దానిని వేరు చేసిన తర్వాత వారహెడ్‌తో పాటు దానికి సంబంధించిన శిథిలాలను సురక్షితంగా బయటకు తీశారు.
వెలికితీసిన ఆ పేలుడు పదార్థాన్ని సురక్షితంగా భద్రపరచడానికీ, సమగ్రంగా పరీక్షించడానికీ ఒక సురక్షిత ప్రాంతానికి తరలించారు.
దీర్ఘకాలం పాటు అత్యంత నిశితమైన ప్రణాళికతో, పకడ్బందీగా చేపట్టిన అత్యంత ప్రమాదకరమై ఈ ఆపరేషన్ సంక్లిష్టమైన సముద్ర విపత్తులను ఎదుర్కోవడంలో భారత నౌకాదళానికి ఉన్న పేలుడు పదార్థాల నిర్వీర్య నైపుణ్యాన్ని, సాంకేతిక ప్రతిభను, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
మర్చంట్ ట్యాంకర్ 'ఎమ్టీ ఒలింపిక్ లైఫ్' యాజమాన్యం ఏ దేశానిదైనా, లేదా అందులోని సిబ్బంది ఏ జాతీయతకు చెందిన వారైనా సముద్రంలో ఎదురైన ఆపదకు భారత నౌకాదళం తక్షణమే స్పందించిన తీరు అంతర్జాతీయ సముద్ర భద్రతకు కట్టుబడిన బాధ్యతాయుతమైన నావికాదళంగా దాని పాత్రను చాటి చెబుతోంది. ఈ ప్రాంతంలో అత్యంత నమ్మకమైన, ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా భారత్ కు ఉన్న ఖ్యాతిని ఇది మరింత ఇనుమడింపచేసింది.
***
(रिलीज़ आईडी: 2271898)
आगंतुक पटल : 7