సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
12 ఏళ్లుగా ప్రజా జీవన పరివర్తన: 11 కోట్లకు పైగా ప్రజలకు అండగా నిలిచిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
భారతదేశ సంక్షేమ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు: సామాజిక న్యాయాన్ని సాధించేందుకు డిజిటల్ సంస్కరణలు, ప్రత్యక్ష నగదు బదిలీల (డీబీటీ) ద్వారా రూ. 71,000 కోట్ల పంపిణీ
ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికే అగ్ర ప్రాధాన్యత: ట్రాన్స్‌జెండర్ వర్గాలు, వృద్ధులు, పారిశుద్ధ్య కార్మికుల రక్షణ వ్యవస్థలను పునర్నిర్మించే ఉద్దేశంతో చర్యలు తీసుకున్న మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
11 JUN 2026 4:08PM by PIB Hyderabad
సాధారణ సంక్షేమం అందించే స్థాయి నుంచి సంపూర్ణ సాధికారతను చేకూర్చే దిశగా సాధించిన ఒక చారిత్రాత్మక మార్పును తెలియజేస్తూ సామాజిక న్యాయం, సాధికారత శాఖ (డీఓఎస్‌జేఈ) నేడు 12 ఏళ్ల కీలక విజయాల సమగ్ర నివేదికను విడుదల చేసింది. భారీ డిజిటల్ సంస్కరణలు, బలమైన చట్టపరమైన రక్షణ వ్యవస్థలు, నిర్దేశిత ఉపాధి అవకాశాల ద్వారా ఈ మంత్రిత్వ శాఖ 2014 నుంచి దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా విద్యార్థులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, వెనుకబడిన వర్గాల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసింది.
విద్యకు సంబంధించిన సహాయం అందించే విధానాన్ని బహుళ-అంచెల డిజిటల్ వ్యవస్థ పూర్తిగా మార్చివేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాలతో ముడిపడి ఉన్న సంపూర్ణ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలోకి మారడం ద్వారా ఈ మంత్రిత్వ శాఖ నిధుల దుర్వినియోగం, సంస్థాగత ఆలస్యాన్ని పూర్తిగా నిర్మూలించింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సీ) కోసం ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక 'పోస్ట్-మెట్రిక్ ఉపకారవేతనాల పథకం' కింద ఇప్పటి వరకు రూ. 46,581.54 కోట్లతో 6.12 కోట్లకు పైగా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు.
'ప్రీ-మెట్రిక్ ఉపకారవేతనాల పథకం' కింద రూ. 4,893.03 కోట్ల విడుదలతో సమాజంలో వెనుకబడిన 2.99 కోట్ల మంది విద్యార్థుల విద్యకు భరోసా లభించింది. 'పీఎం-యశస్వి' పథకం కింద ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ (సంచార జాతులు) వర్గాలకు చెందిన 1,069 లక్షలకు పైగా విద్యార్థులు మొత్తం రూ. 15,555.53 కోట్ల విలువైన సహయాన్ని పొందారు. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయం రూపంలోనే కాకుండా వసతి గృహాల మౌలిక సదుపాయాలు, ఉత్తమ శ్రేణి పాఠశాలల్లో ప్రవేశాల కోసం వెచ్చించారు.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చారిత్రాత్మకమైన సంస్థాగత చర్యలను తీసుకుంది. సామాజిక న్యాయాన్ని నిర్ధారించేందుకు ఎస్‌సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి కీలక సవరణలు తీసుకొచ్చింది. దీనిప్రకారం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడమే కాకుండా బాధితుల హక్కుల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆర్థిక సహాయానికి సంబంధించిన నిధులను పెంచింది. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 5,012.17 కోట్లు విడుదలయ్యాయి. ఇది 7.26 లక్షల మంది వేధింపుల బాధితులకు ప్రత్యక్షంగా అండగా నిలిచింది. జాతీయ ఆరోగ్య సంరక్షణ పరంగా 'నషా ముక్త్ భారత్ అభియాన్' (ఎన్ఎంబీఏ) ఒక అపూర్వమైన ప్రజా చైతన్య శక్తిగా మారింది. ఆధ్యాత్మిక సంస్థలతో భాగస్వామ్యాలు, డిజిటల్ డ్యాష్‌బోర్డుల ద్వారా 9.56 కోట్ల మంది యువతతో సహా మొత్తం 26.28 కోట్లకు పైగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
సేవా దృక్పథంగా ఉన్న వృద్ధుల సంరక్షణ 'అటల్ వయో అభ్యుదయ యోజన' (ఏవీవీఏవై) కింద ఒక సంస్థాగత హక్కుగా మారింది. 'రాష్ట్రీయ వయోశ్రీ' శిబిరాల ద్వారా 8.53 లక్షల మందికి పైగా వృద్ధులు 46.32 లక్షల ఉచిత సహాయక జీవన పరికరాలను అందుకున్నారు. జాతీయ హెల్ప్‌లైన్ ‘ఎల్డర్‌లైన్’(14567) విజయవంతంగా 29 లక్షలకు పైగా కాల్స్‌ను స్వీకరించి ఆయా సమస్యలను పరిష్కరించింది. మరోవైపు ప్రతిష్ఠాత్మకమైన 'స్మైల్' పథకం ఒక సృజనాత్మక జాతీయ పోర్టల్ ద్వారా ట్రాన్స్‌జెండర్లకు చట్టపరమైన, ఆర్థిక గుర్తింపును అందించింది. దీని ద్వారా ఇప్పటివరకు 33,189 గుర్తింపు పత్రాలు జారీ అయ్యాయి. దీనితో పాటు 'గరిమా గృహ' పేరుతో ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. లింగ-మార్పిడి చికిత్సలను 'ఆయుష్మాన్ భారత్' (పీఎం-జేఏవై) పరిధిలోకి తీసుకొచ్చారు.
ఆర్థిక స్వావలంబనను పెంపొందించే దిశగా షెడ్యూల్డ్ కులాల వెంచర్ క్యాపిటల్ ఫండ్ (వీసీఎఫ్-ఎస్‌సీ), వెనుకబడిన తరగతుల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లు (వీసీఎఫ్-బీసీ) సంయుక్తంగా పోటీతత్వ వ్యవస్థాపన కోసం రూ. 750 కోట్లకు పైగా నిధులను మంజూరు చేశాయి. ఇది వేలాది మందికి ప్రత్యక్ష ఉపాధిని అందించింది. దీనికి తోడు 'నమస్తే' పథకం కింద మనుషులతో సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే పద్ధతిని పూర్తిగా ఆపేసి ఆ స్థానంలో సంపూర్ణ యాంత్రిక పారిశుద్ధ్యాన్ని తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ విశేష కృషి చేసింది. దేశవ్యాప్తంగా 3.42 లక్షల మంది పారిశుద్ధ్య కార్మికుల భద్రత, వృత్తిపరమైన గౌరవానికి భరోసా కల్పించేందుకు రాయితీల రూపంలో రూ. 2,383.06 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
***
(रिलीज़ आईडी: 2271854)
आगंतुक पटल : 34