రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల నిర్వహణ బలోపేతం కోసం అధునాతన సాంకేతికతలను వినియోగించనున్న ఎన్‌హెచ్ఏఐ
డ్రెయిన్‌లను శుభ్రపరిచే యంత్రాలు, ఆటోమేటెడ్ గుంతల మరమ్మతు వ్యవస్థలు, అధునాతన రోడ్ స్వీపింగ్ సాంకేతికతలను వినియోగించనున్న ఎన్‌హెచ్ఏఐ
प्रविष्टि तिथि:
09 JUN 2026 5:45PM by PIB Hyderabad
యాంత్రిక, ఆటోమేటెడ్ వ్యవస్థల దిశగా ఒక ముఖ్యమైన మార్పుతో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల వ్యాప్తంగా నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఎన్‌హెచ్ఏఐ సాంకేతికత ఆధారిత కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ చర్యల్లో భాగంగా పట్టణ, జనసాంద్రత అధికంగా గల ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థల యాంత్రిక నిర్వహణకు... ఆటోమేటిక్ విధానంలో గుంతలను పూడ్చడం, కుదింపు - ప్యాచింగ్ యంత్రాలు, రహదారులను శుభ్రపరిచే యంత్రాలు సహా అధునాతన యాంత్రిక రహదారి నిర్వహణ పరికరాల వినియోగానికి ఎన్‌హెచ్ఏఐ సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం... నివారణాత్మక నిర్వహణ పద్ధతులను, ఒప్పంద బాధ్యతలను మరింత కఠినంగా అమలు చేయడం ద్వారా జాతీయ రహదారుల నిర్వహణలో సామర్థ్యాన్నీ, నాణ్యతనూ మెరుగుపరచడమే ఈ కార్యక్రమాల లక్ష్యం. ఈ చర్యలు నాణ్యతను మెరుగుపరుస్తాయి. సుస్థిరతను బలోపేతం చేస్తాయి. జాతీయ రహదారి వినియోగదారుల ప్రయాణ అనుభవాన్నీ మెరుగుపరుస్తాయి.
మెరుగైన వర్షపునీటి నిర్వహణ కోసం యాంత్రికంగా డ్రెయిన్‌లను శుభ్రపరచడం
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని... డ్రైనేజీ నిర్వహణ సామర్థ్యం, నాణ్యత, ప్రభావాన్ని మెరుగుపరచడం కోసం జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు గల పట్టణ, జనావాస ప్రాంతాల్లో మురుగునీటి కాలువలను యాంత్రిక పద్ధతిలో శుభ్రపరచుటను ఎన్‌హెచ్ఏఐ తప్పనిసరి చేసింది. ఈ యాంత్రికంగా శుభ్రపరిచే విధానంలో హై-ఫ్లో సూపర్ సక్షన్, జెట్టింగ్ యూనిట్లు, హైడ్రాలిక్ గ్రాబ్ మెషీన్లు, డీవాటరింగ్ పంప్ సెట్‌లు సహా అధునాతన పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తారు. మురుగుకాలువల నుంచి నీటిని తొలగించడానికి, పేరుకుపోయిన పూడికను, బురదను, భారీ శిధిలాలను తొలగించడానికి ఈ వ్యవస్థను సమగ్రంగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో పట్టణ జాతీయ రహదారి విభాగాల నిర్వహణ ఒప్పందాల్లో యాంత్రికంగా శుభ్రపరుచుటను తప్పనిసరి నిబంధనగా చేర్చనున్నారు.
మురుగునీటి కాలువలను శుభ్రపరచడం, బాగు చేయడం కోసం నిర్దేశించిన నిర్వహణ కార్యక్రమాలు, తనిఖీ షెడ్యూల్‌లను కచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్లు, కాంట్రాక్టుదారులను ఎన్‌హెచ్ఏఐ ఆదేశించింది. జాతీయ రహదారుల నాణ్యతలో జాప్యం, కోతలు లేకుండా... లోపాలను సకాలంలో, సత్వరంగా, సమర్థంగా పరిష్కరించేలా చూసేందుకు, డ్రైనేజీ సంబంధిత లోపాల సవరణ కోసం నిర్దేశించిన కాలపరిమితుల అమలును ఎన్‌హెచ్ఏఐ నిశితంగా పర్యవేక్షిస్తుంది.
వేగవంతమైన, మరింత సమర్థమైన రహదారి నిర్వహణ కోసం అధునాతన సాంకేతికతలు
మరో ప్రధాన కార్యక్రమంలో భాగంగా... పనితీరు ఆధారిత నిర్వహణ ఒప్పందాల కింద వినియోగించాల్సిన పరికరాల జాబితాలో ఆటోమేటిక్‌గా గుంతలను పూడ్చే, కుదించే, ప్యాచ్ వేసే యంత్రాలతో పాటుగా యాంత్రికంగా రహదారులను శుభ్రపరిచే యంత్రాలనూ చేర్చడానికి ఎన్‌హెచ్ఏఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధాన ప్రణాళిక... కొనసాగుతున్న నిర్వహణ ఒప్పందాల్లో ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగానికి సంబంధించిన ఖర్చుల అంచనాలు, ఆమోదం కోసం ఒక విధానాన్ని అందిస్తుంది. జాతీయ రహదారి నెట్‌వర్క్ అంతటా వాటి వినియోగాన్ని వేగవంతం చేయడం దీని లక్ష్యం.
ఆటోమేటిక్‌గా గుంతల పూడ్చివేత, కుదింపు, ప్యాచ్ వేసే పనులు చేసే యంత్రాలను వినియోగించడం వల్ల రహదారుల మరమ్మతులు వేగవంతం అవుతాయి. నిర్వహణ ప్రతిస్పందన సమయం తగ్గుతుంది. జాతీయ రహదారి వినియోగదారులకు కలిగే అసౌకర్యం తగ్గుతుంది. గుంతలు, రహదారి లోపాలను సకాలంలో సరిదిద్దడం వల్ల ప్రయాణ నాణ్యత మెరుగుపడుతుంది. జాతీయ రహదారుల నిర్మాణ సమగ్రతను కాపాడటానికీ ఇది సహాయపడుతుంది.
యాంత్రికంగా రహదారులను శుభ్రపరిచే యంత్రాలు దుమ్ము, పూడిక, వదులుగా ఉండే ధూళి రేణువులను సమర్థంగా తొలగించడం ద్వారా కారిడార్లు, పేవ్డ్ షోల్డర్లను సక్రమంగా శుభ్రపరచడానికి వీలు కల్పిస్తాయి. ఈ యంత్రాలు పరిశుభ్రమైన జాతీయ రహదారి కారిడార్లకు దోహదపడతాయి, దృశ్యమానతనూ మెరుగుపరుస్తాయి. రహదారి భద్రతను పెంచుతాయి. దుమ్ము సంబంధిత కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ యంత్రాలను హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లోని వారణాసి-ఔరంగాబాద్ జాతీయ రహదారి, హండియా-రాజతలాబ్ జాతీయ రహదారి, వివిధ ఇతర ప్రాజెక్టుల్లో ఏర్పాటు చేశారు.
యాంత్రికంగా డ్రెయిన్‌లను శుభ్రపరచడం, ఆటోమేటిక్ గుంతల పూడ్చివేత, అధునాతన రోడ్ స్వీపింగ్ సాంకేతికతలను వినియోగించడం... కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, నివారణాత్మక నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడానికి, దేశవ్యాప్తంగా జాతీయ రహదారి వినియోగదారుల మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడానికీ సహాయపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2270966)
आगंतुक पटल : 8