బొగ్గు మంత్రిత్వ శాఖ
భారత్ ఇంధన మార్కెట్లకు సాధికారతకల్పన: వికసిత్ భారత్‌ను దృష్టిలో పెట్టుకొని బొగ్గు ఎక్స్‌ఛేంజి ఏర్పాటుకు మార్గం సుగమం
प्रविष्टि तिथि:
09 JUN 2026 8:56AM by PIB Hyderabad
భారత్‌లో బొగ్గు సరఫరా వ్యవస్థను ఆధునికీకరించే దిశగా మరో ముఖ్య నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దేశంలో బొగ్గు ఎక్స్‌ఛేంజులను ఏర్పాటు చేసేందుకు మార్గాన్ని సుగమం చేసింది. ఇటీవల ఆమోదించిన గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం-2025 దేశంలో ఖనిజ ఎక్స్‌ఛేంజి భావనను ప్రవేశపెట్టింది. ఈ చట్టం బొగ్గు, దాని శుద్ధి చేసిన రూపాలు సహా ఖనిజాల వ్యాపారాన్ని పారదర్శకంగా, నైపుణ్యతతో ప్రోత్సహించే అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. పైన పేర్కొన్న మార్గాన్ని అనుసరిస్తూ బొగ్గు శాఖ ‘బొగ్గు ఎక్స్‌ఛేంజి నియమాలు-2026’ను 04.06.2026న రాజపత్రంలో ప్రచురించింది. ఈ నియమాలను బొగ్గు శాఖ వెబ్‌సైట్ లింకు https://coal.gov.in/sites/default/files/2026-06/09-06-2026a-wn.pdf లో అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమాన్ని సుగమం చేయడానికి, బొగ్గు ఎక్స్‌ఛేంజుల నమోదు, నియంత్రణలకు సంబంధించిన బాధ్యతాయుత ప్రాధికార సంస్థగా బొగ్గు నియంత్రణ సంస్థ (కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్..సీసీఓ)ను ఇప్పటికే అంటే 2025 డిసెంబరు నెలలోనే బొగ్గు శాఖ నియమించింది. సీసీఓ ఆధ్వర్యంలో బొగ్గు ఎక్స్‌చేంజులను ఏర్పాటు చేసే, సంబంధిత కార్యకలాపాలను నిర్వహించే, మార్కెట్ నియమాలతో పాటు ఉప నిబంధనలను కూడా రూపొందించే, బొగ్గు వ్యాపారాన్ని సుగమం చేసే అధికారాలను అర్హత కల సంస్థలకు కట్టబెడతారు. నమోదులు 25 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతాయి.
కోల్ ఎక్స్‌ఛేంజులను ప్రవేశపెట్టడం బొగ్గు మార్కెటింగ్‌లో ఒక పెనుమార్పును తీసుకురానుంది. ఇది సాంప్రదాయిక ‘‘ఒకటి నుంచి అనేక’’ విక్రయ నమూనాలకు భిన్నంగా, పోటీతత్వంతో కూడిన ‘‘అనేకం నుంచి అనేక’’ వ్యాపార వేదిక వైపు తీసుకుపోతుంది. దీంతో పారదర్శకత్వం కలిగిన, మార్కెట్-ఆధారిత ధర నిర్ధారణ సాధ్యపడుతుంది. సామర్థ్యం మెరుగుపడుతుంది. వాణిజ్య ప్రధాన గనులు, క్యాప్టివ్ గనులు సహా బొగ్గు ఉత్పాదక సంస్థలు కొనుగోలుదారుల విస్తృత సమూహం చెంతకు చేరుకోవడం సులభతరం అవుతుంది. ఈ వేదికను ఉపయోగించుకొని మార్కెట్టులో భాగస్వామ్యాన్ని పెంపొందింప చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పాదక కంపెనీలు కూడా దక్కించుకోవచ్చు.
వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని పెంచుతూ, పారదర్శకత్వాన్ని ప్రోత్సహిస్తూ, ఆధునిక, స్వయంసమృద్ధ ఇంధన విస్తారిత అనుబంధ వ్యవస్థను నిర్మించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు కోల్ ఎక్స్‌ఛేంజి కార్యక్రమం అద్దం పడుతోంది. మరింత పోటీతత్వంతో కూడిన, సత్తా కలిగిన బొగ్గు మార్కెట్టును ఈ సంస్కరణ తీర్చిదిద్దుతుందని భావిస్తున్నారు. అలాగే ఇది ఇంధన భద్రతను పటిష్ఠపరిచి, పారిశ్రామిక అభివృద్ధికి దన్నుగా నిలుస్తూ, దీర్ఘకాల ప్రాతిపదికన ఆర్థిక అభివృద్ధితో పాటు భవిష్యత్తు అవసరాలను లెక్కలోకి తీసుకొని సన్నద్ధంగా ఉన్న ఇంధన రంగం మద్దతుతో వికసిత్ భారత్ ఆశయ సాధనకు కీలక తోడ్పాటును కూడా అందిస్తుందని ఆశిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2270611)
आगंतुक पटल : 34