వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘డబ్ల్యూటీఓ వాణిజ్య, పర్యావరణ వారోత్సవాలు - 2026’లో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, పునరుత్పాదక ఇంధన ప్రమాణాలను ప్రదర్శించిన భారత్


డబ్ల్యూటీఓ ప్రదర్శనలో సుస్థిర అభివృద్ధి, స్వచ్ఛ ఇంధన మార్పు ప్రయత్నాలను ప్రముఖంగా వివరించిన భారత్

కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ కింద జాతీయ కార్బన్ మార్కెట్ ప్రణాళికను ఆవిష్కరించిన భారత్

प्रविष्टि तिथि: 05 JUN 2026 6:39PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జెనీవాలో జరిగిన డబ్ల్యూటీఓ  వాణిజ్య, పర్యావరణ వారోత్సవాలు( ట్రేడ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వీక్) 2026 సందర్భంగా ‘భారతదేశ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, పునరుత్పాదక ఇంధనంలో ప్రామాణీకరణ ప్రదర్శన’  ఇతివృత్తంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని భారత్ నిర్వహించింది.

భారతదేశం సాధిస్తున్న సుస్థిర అభివృద్ధి, స్వచ్ఛ ఇంధన మార్పు,  పారిస్ ఒప్పందం కింద జాతీయ స్థాయిలో తీసుకున్న కట్టుబాట్ల సాధన దిశగా  భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఈ కార్యక్రమంలో ప్రముఖంగా వివరించారు. తక్కువ కార్బన్ ఉద్గారాల ఆర్థిక వ్యవస్థ (లో-కార్బన్ ఎకానమీ) వైపు భారతదేశం సాగిస్తున్న ప్రయాణానికి మద్దతుగా చేపట్టిన కీలక విధానపరమైన, నియంత్రణ పరమైన చొరవలను కూడా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ), బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ),  విద్యుత్ మంత్రిత్వ శాఖ,  నూతన,  పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఎఫ్) ల   నిపుణులు, ఉన్నతాధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు.

భారతదేశ వాతావరణ చర్యలు,  పర్యావరణ స్థిరత్వ చొరవలపై ప్రజెంటేషన్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రజెంటేషన్ ద్వారా జాతీయంగా నిర్ణయించిన లక్ష్యాల (ఎన్డీసీ) కింద భారత్ సాధించిన విజయాలను, కార్బన్ మార్కెట్ యంత్రాంగాలను, ప్రధాన పర్యావరణ, వాతావరణ మార్పుల చొరవలను ప్రముఖంగా వివరించారు. ఇది వాతావరణ చర్యలు, సుస్థిర అభివృద్ధి పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకాలుగా ఉన్న సమానత్వం, ఉమ్మడి అయినప్పటికీ విభిన్న బాధ్యతలు,  సంబంధిత సామర్థ్యాలు (సీబీడీఆర్-ఆర్సీ), బహుళపక్ష సహకార సూత్రాలను కూడా ప్రముఖంగా పేర్కొంది. 

భారతదేశం తన వాతావరణ కట్టుబాట్లను నిర్ణీత సమయం కంటే ముందే నిరంతరం సాధిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. మార్చి 2026 నాటికి, శిలాజ ఇంధనేతర ఆధారిత  స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం వాటా 53.21 శాతానికి చేరుకుంది, అయితే 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యం 50 శాతం మాత్రమే. తద్వారా ఈ లక్ష్యాన్ని దాదాపు ఐదేళ్ల ముందే దేశం సాధించింది.2005 - 2022 మధ్యకాలంలో భారత జీడీపీ ఉద్గారాల తీవ్రత  37.38 శాతం తగ్గింది. ఇది 2030 నాటికి 33-35 శాతం తగ్గించాలనే ఎన్‌డిసి లక్ష్యాన్ని నిర్ణీత కాలపరిమితి కంటే చాలా ముందే అధిగమించింది.

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న కార్బన్ మార్కెట్ నిర్మాణాత్మక విధానాన్ని, కొత్తగా పుట్టుకొస్తున్న పునరుత్పాదక ఇంధన రంగాలలో ప్రమాణాలు, ధృవీకరణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను కూడా ఈ సెషన్ లో ప్రముఖంగా వివరించారు. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ (సీసీటీఎస్) కింద అభివృద్ధి చేసిన ఇండియన్ కార్బన్ మార్కెట్ జాతీయ  ప్రణాళిక కింద ఫ్జాతీయ ఎలక్ట్రానిక్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ వేదికను స్థాపించడమే కాకుండా, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపునకు దోహదపడే కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మార్కెట్ ఆధారిత సాధనాలను ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద సాధించిన ప్రగతిని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఇందులో హైడ్రోజన్‌ను గ్రీన్ హైడ్రోజన్ గా వర్గీకరించడానికి నోటిఫై చేసిన ఉద్గారాల పరిమితులు,  సాంకేతిక ప్రమాణాలు ఉన్నాయి.  బలమైన గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థ అభివృద్ధికి మద్దతునిస్తూనే, ఉత్పత్తిదారులు, పెట్టుబడిదారులు, వినియోగదారులలో పారదర్శకత, విశ్వసనీయత, నిశ్చితత్వాన్ని పెంపొందించడానికి ఈ ప్రమాణాలను ఉద్దేశించారు. 

డబ్ల్యూటీఓ  వాణిజ్య, పర్యావరణ వారోత్సవాల సందర్భంగా  2 జూన్ 2026న, భారత్, జపాన్ ప్రతినిధి బృందాలు పారదర్శకత, ఏకపక్ష వాణిజ్య నిరోధక చర్యలపై చర్చలు జరిపాయి. వాణిజ్యం, వాతావరణానికి సంబంధించిన చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి అనవసరమైన అడ్డంకులను ఎలా సృష్టించవచ్చనే అంశంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. అలాగే పరిమిత సామర్థ్యాలు కలిగిన ప్రభుత్వాలు, భాగస్వాములు ఇటువంటి చర్యలకు కట్టుబడి ఉండటంలో ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సవాళ్లను కూడా ఈ చర్చల్లో పరిశీలించారు.

వాణిజ్యం, పర్యావరణ స్థిరత్వం, ఉద్గారాల ప్రమాణాలు, కార్బన్ మార్కెట్లపై తన అనుభవాలను, విధానపరమైన విధానాలను పంచుకోవడానికి డబ్ల్యూటీఓ  వాణిజ్య, పర్యావరణ వారోత్సవాలు భారతదేశానికి ఒక ముఖ్యమైన వేదికను అందించాయి. సరైన విధానపరమైన ప్రణాళికలు, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఆర్థిక వృద్ధి, ఇంధన లభ్యత, పర్యావరణ స్థిరత్వాన్ని ఏకకాలంలో ముందుకు తీసుకెళ్లవచ్చని భారతదేశ అనుభవం నిరూపిస్తోంది.

డబ్ల్యూటీఓ  వాణిజ్య, పర్యావరణ వారోత్సవాల్లో భారత్ పాల్గొనడం ప్రపంచ వాణిజ్యం, పర్యావరణ సమస్యలపై నిర్మాణాత్మక భాగస్వామ్యానికి దేశం కట్టుబడి ఉందనడానికి నిదర్శనం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సుస్థిర, సమ్మిళిత మార్గాలపై జరుగుతున్న చర్చలకు తన వంతు సహకారాన్ని అందిస్తూనే, దేశీయ చొరవలను,  నియంత్రణ పరమైన పరిణామాలను అంతర్జాతీయ సమాజానికి ప్రదర్శించడానికి భారత్ కు ఇది ఒక మంచి అవకాశాన్ని కల్పించింది.


(रिलीज़ आईडी: 2269936) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Malayalam