పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించిన కేంద్ర పర్యావరణ మంత్రి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో భారీ హరిత కార్యక్రమాలు ప్రారంభం
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్ అవతరించిందన్న శ్రీ భూపేందర్ యాదవ్... ప్రజా భాగస్వామ్యంతో కూడిన పర్యావరణ పరిరక్షణకు పిలుపు
ఈ ఏడాది ఢిల్లీలో 15 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం... పచ్చదనాన్ని పెంపొందించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్న ముఖ్యమంత్రి
శాస్త్రీయ పర్యావరణహిత పాలన బలోపేతానికి ఎన్‌సీటీ ఢిల్లీ కార్యాచరణ ప్రణాళిక, అసోలా భట్టి అభయారణ్యం నిర్వహణ ప్రణాళిక, ఢిల్లీ బర్డ్ అట్లాస్ విడుదల
నాడు పోస్టు చేయడమైనది:
05 JUN 2026 12:04PM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీ వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తాతో కలిసి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా మైదాన్‌గఢిలోని నమో ఆక్సిజన్ పార్కులో నిర్వహించిన ఈ వేడుకలో పలు పర్యావరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జాతీయ రాజధాని ప్రాంతంలో పచ్చదనాన్ని బలోపేతం చేయడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, ప్రజా భాగస్వామ్యంతో కూడిన పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్, ఢిల్లీ పర్యావరణ, అటవీ, వన్యప్రాణుల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మానవాళి వాతావరణ మార్పులు, జీవవైవిధ్య క్షీణత, ఎడారీకరణకు దారితీసే భూసార క్షీణత వంటి మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్ అవతరించిందని ఆయన పేర్కొన్నారు. సౌరశక్తి సామర్థ్యాన్ని పెంపొందించడంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలవడం, పీఎం సూర్య ఘర్ యోజన అమలు, అంతర్జాతీయ సౌర కూటమి స్థాపన, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ) ఏర్పాటు, రామ్సర్ చిత్తడి నేలల విస్తరణ, ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు పరిధిలో నిర్దేశించుకున్న పలు జాతీయ నిర్ధారిత సహకార (ఎన్డీసీ) లక్ష్యాలను గడువుకంటే ముందే సాధించడం వంటి కీలక విజయాలను భారత్ అధిగమించిందని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు సమష్టి కృషి, క్రియాశీల ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. ఈ కార్యక్రమం మొక్కలు నాటడాన్ని కేవలం ఒక విధిగా కాకుండా కృతజ్ఞత, బాధ్యత, పర్యావరణ స్పృహతో కూడిన ప్రజా ఉద్యమంగా మార్చిందని ఆయన కొనియాడారు. పౌరులు కేవలం మొక్కలు నాటడమే కాకుండా, రాబోయే తరాల కోసం వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీ పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను శ్రీ భూపేందర్ యాదవ్ వివరించారు. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సమన్వయంతో ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై దుమ్ము, వాహనాల ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యంతో కూడిన వాయు కాలుష్య కారకాలను నియంత్రించడానికి కీలక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా నిరంతర ఉద్గార పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటు, వాయు కాలుష్య నియంత్రణ పరికరాల వినియోగం, రోడ్లను యంత్రాల ద్వారా శుభ్రం చేయడం, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారడం వంటి చర్యలను చేపట్టినట్లు వివరించారు.
నమో వ్యాన్లు, ఇతర పర్యావరణ వనరుల అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించే హరిత కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి, జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి, పౌరులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు18 నమో ఆక్సిజన్ పార్కులను అభివృద్ధి చేసి ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల దీర్ఘకాలిక విజయానికి ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని చెప్పారు. సంపూర్ణ పర్యావరణ వ్యవస్థ రక్షణ, పర్యావరణ స్థితిస్థాపకతను నిర్ధారించడానికి అడవులు, చిత్తడి నేలలు, గడ్డి భూములను సమగ్రంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీటీ ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన మూడు ముఖ్యమైన పర్యావరణ ప్రచురణలను విడుదల చేశారు.
1. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం కోసం కార్యాచరణ ప్రణాళిక పత్రం (2026-27 నుంచి 2036-37): ఢిల్లీలో పర్యావరణ పరిపాలన, పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన వ్యూహాలు, లక్ష్యాలను వివరించే పదేళ్ల కార్యాచరణ ప్రణాళిక.
2. అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యాల నిర్వహణ ప్రణాళిక (2024-25 నుంచి 2034-35): ఢిల్లీలోని అత్యంత కీలకమైన జీవవైవిధ్య నిధుల సంరక్షణ కోసం రూపొందించిన సమగ్ర నిర్వహణ ప్రణాళిక. ఇది రాబోయే దశాబ్ద కాలంలో అభయారణ్య రక్షణ, పునరుద్ధరణ, సుస్థిర నిర్వహణకు దిశానిర్దేశం చేస్తుంది.
3. ఢిల్లీ బర్డ్ అట్లాస్: ఢిల్లీ నగరవ్యాప్తంగా ఉన్న పక్షి, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సేవకుల ఉమ్మడి భాగస్వామ్యంతో ఢిల్లీలోని పక్షి జాతులపై సేకరించిన సమాచారంతో రూపొందించిన పుస్తకం.
వేగంగా విస్తరిస్తున్న పట్టణ జనాభా మధ్య.. పట్టణ పర్యావరణ వ్యవస్థల సమర్థవంతమైన నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ, చిత్తడి నేలల రక్షణ, సుస్థిర అభివృద్ధికి ఈ శాస్త్రీయ ప్రణాళికా పత్రాలు ఎంతగానో దోహదపడతాయని శ్రీ భూపేందర్ యాదవ్ తెలిపారు. అలాగే రాజధానిలో పర్యావరణహిత పరిపాలనను బలోపేతం చేయడంలోనూ సహాయపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పచ్చదనాన్ని పెంపొందించడం అత్యంత కీలకమైన చర్యగా అభివర్ణించారు. ప్రస్తుత సంవత్సరంలో ఢిల్లీ వ్యాప్తంగా 15 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆమె ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో పౌరుల పాత్రను ప్రస్తావిస్తూ.. కేవలం మొక్కలు నాటే కార్యక్రమాలకే కాకుండా, నాటిన తర్వాత ఆ మొక్కలను పోషించడానికి, సంరక్షించడానికి, సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖులందరూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా మొక్కలు నాటడంతోపాటు ‘కాలుష్య రహిత ఢిల్లీ’ ప్రచారంలో భాగంగా స్థానిక రకాల గడ్డి, పొదలకు సంబంధించిన ప్రదర్శనను తిలకించారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు.‘ఢిల్లీ బర్డ్ అట్లాస్’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన స్వచ్ఛంద సంస్థలను ఈ వేడుకలో ప్రశంసా పత్రాలతో సత్కరించారు. పర్యావరణానికి సంబంధించిన సమాచార సేకరణ, పర్యవేక్షణలో ప్రజల భాగస్వామ్యం అమూల్యమైనదని కొనియాడారు.

***
(రిలీజ్ ఐడి: 2269337)
సందర్శకుల సూచీ సంఖ్య : : 149