శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కృత్రిమ మేధ, డిజటల్ మౌలిక వసతులు,
అధునాతన తయారీ రంగాలను కీలక ప్రాధాన్యాలుగా పరిగణిస్తూ..భవిష్యత్ సాంకేతికతల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించిన భారత్, దక్షిణాఫ్రికా
प्रविष्टि तिथि:
03 JUN 2026 2:20PM by PIB Hyderabad
భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకోవడానికి భారత్, దక్షిణాఫ్రికా దేశాలు ఈ రోజు అంగీకరించాయి. ఈ ద్వైపాక్షిక సంబంధాలను తర్వాతి దశకు చేర్చడంలో కృత్రిమ మేధ, డిజిట్ మౌలిక వసతులు, అధునాతన తయారీ రంగాలు వంటివి కీలక ప్రాధాన్యాలుగా ఉన్నాయి.
ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలసి భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉప మంత్రి డాక్టర్ నోమాల్యున్గెలో గినాతో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సంబంధాన్ని సంప్రదాయ పరిశోధన సహకారానికి అతీతంగా, పెద్ద ఎత్తున ఆర్థిక, సామాజిక ప్రభావాన్ని అందించగల సాంకేతిక ఆధారిత భాగస్వామ్యాల దిశగా తీసుకెళ్లాని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలు, ఆవిష్కరణల వ్యవస్థలు, అంకుర సంస్థల భాగస్వామ్యాలు, పరిశ్రమలతో అనుసంధానమైన పరిశోధనల ద్వారా భారత్-దక్షిణాఫ్రికా సంబంధాల తదుపరి దశ రూపుదిద్దుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆకాంక్షించారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచం కోసం చవకగా లభించే, విస్తరించదగిన, సమ్మిళితమైన సాంకేతిక పరిష్కారాలను రూపొందించడానికి రెండు దేశాల బలాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
ఉమ్మడి చరిత్ర, ప్రజాస్వామ్య విలువలు, సమగ్రాభివృద్ధికి ఉమ్మడి నిబద్ధత ద్వారా ఏర్పడిన ప్రత్యేక భాగస్వామ్యాన్ని భారత్, సౌతాఫ్రికా కొనసాగిస్తున్నాయని మంత్రి అన్నారు. బ్రిక్స్, ఐబీసీఏ, జీ20, ఐఓఆర్ఏ లాంటి వేదికల ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలపై అంతర్జాతీయ చర్చలను తీర్చిదిద్దడంలో గ్లోబల్‌సౌత్‌కు చెందిన ప్రభావవంతమైన గొంతుకలుగా ఉన్న రెండు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని తెలియజేశారు. అదే సమయంలో బహుళ వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాయని వెల్లడించారు.
న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో ఈ సమావేశం జరిగింది. భారతీయ ప్రతినిధి బృందంలో డీఎస్టీ కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే, ఈ విభాగానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందానికి డిప్యూటీ మంత్రి డాక్టర్ నోమాల్యున్గెలో గినా నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల విభాగం, దక్షిణాఫ్రికా హై కమిషన్ ఉన్నతాధికారులు ఉన్నారు.
కృత్రిమ మేధ, క్వాంటం సాంకేతిక పరిజ్ఞానాలు, సైబర్ ఫిజికల్ వ్యవస్థలు, డిజిటల్ మౌలికవసతులు, అంకుర సంస్థల ఆధారిత ఆవిష్కరణల్లో అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల తోడ్పాటుతో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ పురోగతి ఆఫ్రికాతో సహకారాత్మక పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణ భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలను అందిస్తుందని చెప్పారు.
జీవితాలను మెరుగుపరిచే, ఉద్యోగాలను కల్పించే, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే పరిష్కారాలను అందించేదిగా సైన్సును వినియోగించుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రెండు దేశాల్లోని పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణ సంస్థలు, అంకుర సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండాలన్నారు. శాస్త్రీయ నైపుణ్యంపైన మాత్రమే కాకుండా.. టెక్నాలజీ వినియోగం, వాణిజ్యీకరణ, సామాజిక ఫలితాలపై కూడా భవిష్యత్తు సహకారం దృష్టి సారించాలని తెలియజేశారు.
భారత్-దక్షిణాఫ్రికా సంయుక్త కమిటీ యంత్రాంగం పరిధిలో గుర్తించిన ప్రాధాన్య రంగాలైన అధునాతన మెటీరియళ్లు, తయారీ, జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలలో సహకారాన్ని మరింతగా పెంచాలనే కీలక నిర్ణయాన్ని ఈ చర్చల్లో తీసుకున్నారు. ఈ ప్రాధాన్య రంగాలను పటిష్టమైన సహకారాత్మక కార్యక్రమాలుగా, ఫలితాలుగా మార్చేందుకు శాస్త్రవేత్తలూ, సంస్థలూ, సాంకేతిక నిపుణుల మధ్య సంప్రదింపులను వేగవంతం చేసేందుకు ఉభయపక్షాలు అంగీకరించాయి.
బయోటెక్నాలజీ, జీనోమిక్స్, వ్యాక్సిన్ అభివృద్ధి, ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాలు, మహమ్మారి సంసిద్ధత రంగాల్లో ఉన్న విస్తారమైన అవకాశాల గురించి కూడా చర్చించారు. పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, శాస్త్రీయ భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని ఇటీవల ఎదురవుతున్న ప్రపంచ అనుభవాలు బలపరిచాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బయోటెక్నాలజీ, సరసమైన ఆరోగ్య సేవల ఆవిష్కరణ, వ్యాక్సిన్ తయారీలో భారతదేశానికి ఉన్న బలాలు దక్షిణాఫ్రికాతో సహకారానికి గణనీయమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు.
పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్ సాంకేతికతలు, అధునాతన తయారీ, డిజిటల్ పరిజ్ఞానాలు, హెల్త్ సైన్సెస్, టీకా పరిశోధన, నైపుణ్యాభివృద్ధిలో భారత్‌తో సహకారాన్ని విస్తరించుకొనేందుకు దక్షిణాఫ్రికా ఆసక్తిని వ్యక్తం చేసింది. విశ్వసనీయమైన భాగస్వామిగా భారతదేశానికి దక్షిణాఫ్రికా విలువ ఇస్తుందని డాక్టర్ గినా చెప్పారు. ప్రాధాన్య రంగాల్లో సంస్థాగత సంబంధాలను, పరిశోధన సహకారాన్ని, ఆవిష్కరణల భాగస్వామ్యంపై కూడా దక్షిణాఫ్రికా ఆసక్తితో ఉందని తెలియజేశారు. ద్వైపాక్షిక శాస్త్రీయ సహకారానికి ఉన్న బలమైన పునాదిని గుర్తు చేస్తూ, రెండు దేశాలు ఇప్పటికే విభిన్న శాస్త్రీయ విభాగాల్లో ఉమ్మడిగా నిధులు సమకూర్చే 150 ప్రాజెక్టులతో సహా సహకార పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన విస్తృతమైన వ్యవస్థను ఏర్పాటు చేశాయని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞాన రంగాలు, ఆవిష్కరణ ఆధారిత సహకారంలో విస్తరణకు సిద్ధంగా భాగస్వామ్యం ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్-దక్షిణాఫ్రికా శాస్త్రీయ సహకారంలో ముఖ్యమైన వాటిలో ఒకటైన ఖగోళ శాస్త్రంలో సహకారాన్ని కూడా నాయకులిద్దరూ సమీక్షించారు. స్క్వేర్ కిలోమీటర్ అర్రే (ఎస్‌కేఏ) ప్రాజెక్టు ప్రాధాన్యం గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. దీనిని ఈ శతాబ్దంలో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శాస్త్రీయ ప్రయత్నాల్లో ఒకటిగా వర్ణించారు. అదేవిధంగా, అంతర్జాతీయ సహకారం శాస్త్రీయ ఆవిష్కరణలనూ, అధునాతన కంప్యూటింగ్ సామర్థ్యాలనూ, సాకేంతిక ఆవిష్కరణలనూ, మానవ వనరుల అభివృద్ధినీ ఎలా ముందుకు నడిపిస్తుందో చెప్పే శక్తిమంతమైన ఉదాహరణ అని తెలియజేశారు.
బహుపాక్షిక శాస్త్రీయ భాగస్వామ్యానికి పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ.. 2026 ఆగస్టులో చెన్నైలో జరిగే బ్రిక్స్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ మంత్రిత్వ స్థాయి సమావేశంలో పాల్గొనాల్సిందిగా దక్షిణాఫ్రికాను డాక్టర్ జితేంద్ర సింగ్ ఆహ్వానించారు. అధిక ప్రదర్శన చేసే కంప్యూటింగ్, కృత్రిమ మేధ, పునరుత్పాదక విద్యుత్తు, బయోటెక్నాలజీ, నీటి వనరులు, కచ్చితమైన ఫలితాలను సాధించే వ్యవసాయం, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో ఉమ్మడి పరిశోధనలకు కొత్త అవకాశాలను బ్రిక్స్ సహకారం సృష్టిస్తోందని ఆయన అన్నారు.
సైన్స్ ఫోరమ్ సౌతాఫ్రికా 2026లో పాల్గొనాల్సిందిగా భారత్‌ను దక్షిణాఫ్రికా ఆహ్వానించింది. అంతర్జాతీయ స్థాయి శాస్త్రీయ చర్చలు, విజ్ఞాన వినిమయం, ఆవిష్కరణల భాగస్వామ్యాలకు సంబంధించి ఆఫ్రికాలోని ప్రముఖ వేదికల్లో ఇది ఒకటి. ఎప్పటికప్పుడు సంస్థాగత చర్చలు, ఉన్నత స్థాయి సమావేశాల ద్వారా శాస్త్రీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాన్ని ఉభయపక్షాలు స్వాగతించాయి.
1995లో ద్వైపాక్షిక శాస్త్ర సాంకేతిక ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా ఒక శక్తిమంతమై శాస్త్ర సాంకేతిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఏళ్లు గడిచేకొద్దీ ఈ భాగస్వామ్యం ఖగోళశాస్త్రం, బయోటెక్నాలజీ, ఆరోగ్య శాస్త్రాలు, దేశీయ విజ్ఞాన వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధనం, అధునాతన పదార్థాలు, భూశాస్త్రాల వరకు విస్తరించింది. ఈ రెండు దేశాలూ డజన్ల కొద్దీ ప్రాజెక్టులకు సంయుక్త మద్దతును అందించాయి. అలాగే వ్యవస్థీకృతమైన సంస్థాగత యంత్రాంగాల ద్వారా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి.
పరిశోధనా నైపుణ్యం, సాంకేతిక అభివృద్ధి, అంకుర సంస్థల సహకారం, ప్రజల మధ్య శాస్త్రీయ వినియమం ద్వారా నడిచే మరింత బలమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆవిష్కరణ భాగస్వామ్యాన్ని నిర్మించాలనే ఉమ్మడి సంకల్పంతో, రెండు దేశాలకూ అర్థవంతమైన ప్రయోజనాలను కల్పించడం, గ్లోబల్ సౌత్ విస్తృత అభివృద్ధి ఆకాంక్షలకు దోహదపడటమే లక్ష్యంగా ఈ సమావేశం ముగిసింది.
****
(रिलीज़ आईडी: 2268885)
आगंतुक पटल : 17