పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిశ్రమ ఇంధన వాహనాలతో భారత్‌ ముడిచమురు దిగుమతి పరాధీనత తగ్గుదల: శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి


“దేశంలోని రైతులకు అదనపు ఆదాయార్జన సహా స్వల్ప కర్బన రవాణాను ప్రోత్సహించడానికి ఇదొక ఆచరణాత్మక మార్గం”

“భారత ఇథనాల్ మిశ్రణ కార్యక్రమంతో పరిణామాత్మక ఫలితాలు... ఇంధన ప్రదాతగా మారిన అన్నదాతకు ₹1.58 లక్షల కోట్ల ఆదాయం”

“ఇ20 నుంచి ఇ85 ఇంధనంతో నడిచే బైక్‌ల ఆవిష్కరణతో కాలుష్య రహిత ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు.. భారత్‌ స్వావలంబన”

प्रविष्टि तिथि: 03 JUN 2026 9:20PM by PIB Hyderabad

  ముడి చమురుపై భారత్‌ దిగుమతి పరాధీనతను తగ్గించడంలో మిశ్రమ ఇంధనంతో (ఫ్లెక్స్ ఫ్యూయల్) నడిచే వాహనాలు ఆచరణాత్మక పరిష్కారాన్నిస్తాయని కేంద్ర పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఇవాళ ‘హీరో మోటోకార్ప్’ సంస్థ రూపొందించిన తొలి ‘ఫ్లెక్స్ ఫ్యూయల్’ మోటార్‌సైకిళ్లు ‘స్ప్లెండర్ ప్లస్‌, హెచ్‌ఎఫ్ డీలక్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనతోపాటు రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఇ20 నుంచి ఇ85 వరకూ ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచే కొత్త మోటార్‌సైకిళ్ల ప్రారంభోత్సవంతో భారత ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని శ్రీ పూరి అభివర్ణించారు. స్వావలంబనకు ప్రతీక అయిన ఈ కొత్త తరం మోటార్‌సైకిళ్ల ప్రారంభం భారీ మార్కెట్‌ గల ఫ్లెక్స్ ఫ్యూయల్ రవాణా రంగంలోకి భారత్‌ ప్రవేశాన్ని సూచిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

భారత్ బైక్ - భారత్ ఇంధనం!

ప్రపంచ అతిపెద్ద ద్విచక్ర వాహన వ్యవస్థల జాబితాలో 30 కోట్లకు పైగా వాహన సముదాయంతో భారత్‌ కూడా ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన మిశ్రమ ఇంధన సాంకేతికత రవాణా రంగ అసాధారణ రూపాంతరీకరణకు తోడ్పడుతుంది.

ఇంధన మిశ్రణ సాంకేతికత రీత్యా ప్రపంచంలో మన రవాణా రంగం వాటా 2014 నాటికి కేవలం 1.5 శాతం మాత్రమే. అయితే, ఈ సాంకేతికతలో వేగంగా పురోగమిస్తున్న భారత్‌ ప్రస్థానంలో నేటి చారిత్రక ద్విచక్ర వాహన ప్రారంభోత్సవం దిశగా ఓ కీలక ఘట్టం. మనమిప్పుడు భవిష్యత్‌ దృక్పథంతో ముందడుగు వేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఈ ఇంధన మిశ్రణం 20 శాతానికి చేరుకున్నదని మంత్రి పేర్కొన్నారు. మన ఇంధన దిగుమతుల బిల్లును తగ్గించడంలో ఇదెంతో సాయపడుతుందని చెప్పారు. అలాగే మన అన్నదాతలు ఇంధన ప్రదాతలుగా మారడంతోపాటు వారికి అదనపు ఆదాయ వనరు కూడా సమకూరుతుందని తెలిపారు.

జాతీయ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్‌ వాహనాలు (ఈవీ), జీవ ఇంధనాలు, హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాల సమ్మేళనంతో భారత భవిష్యత్ రవాణా వ్యవస్థ సుసంపన్నం కాగలదని మంత్రి అన్నారు. మన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88.5 శాతం మేర ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నామని ఆయన గుర్తుచేశారు. దీనివల్ల భౌగోళిక రాజకీయ అవరోధాలతో ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత ఆందోళనలో పడుతున్నాయని పేర్కొన్నారు.

దేశంలో 2014-15 ఇథనాల్‌ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై) నుంచి ప్రభుత్వం చేపట్టిన  ఇథనాల్ మిశ్రణ కార్యక్రమం ద్వారా భారత్‌కు ₹1.84 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయింది. అలాగే, 302 లక్షల టన్నుల ముడి చమురు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడం సహా 909 లక్షల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపును సాధించింది. మరోవైపు మన అన్నదాతలు ఇంధన ప్రదాతలుగా మారడంతో ₹1.58 లక్షల కోట్ల మేర వారికి అదనపు ఆదాయం సమకూరడం ఈ కార్యక్రమ కీలక ఫలితమనే చెప్పాలి.

దేశవ్యాప్తంగా వార్షిక పెట్రోల్ వాహన అమ్మకాలలో కనీసం 1 శాతం మేర ‘ఈఎస్‌వై’ 2026-27 కాలంలో వినియోగం నమోదైనా 4 కోట్ల లీటర్ల ఇథనాల్‌కు డిమాండ్ ఏర్పడుతుందని శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి అన్నారు. తద్వారా డిస్టిలరీలకు సుమారు ₹266 కోట్ల దాకా చెల్లింపులు సహా దేశానికి ₹195 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అవుతుందని మంత్రి వివరించారు. పర్యవసానంగా దాదాపు 0.28 లక్షల టన్నుల ముడిచమురు దిగుమతులు, సుమారు 0.86 లక్షల టన్నుల నికర కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయన్నారు. ముఖ్యంగా చమురు దిగుమతుల కోసం తరలిపోయే సొమ్ములో దాదాపు ₹160 కోట్లు నేరుగా మన రైతన్నకు చేరుతాయని పేర్కొన్నారు. భారత విస్తృత ద్విచక్ర వాహన వ్యవస్థలో మిశ్రమ ఇంధన సాంకేతకత విస్తరించే కొద్దీ దాని ప్రభావం విప్లవాత్మక ఫలితాలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇ85 మిశ్రమ ఇంధనంతో లభించే ప్రయోజనాల్లో ప్రధానంగా వాహన తయారీ ఖర్చు, మౌలిక సదుపాయాల మూలధన వ్యయం తగ్గుదల మొదటిది. అలాగే, ఈ ఇంధనంతో నడిచే వాహనాల విస్తరణ వేగం (ఈవీ నెట్‌వర్క్ కన్నా 10-15 రెట్లు) అధికంగా ఉంటుంది. విద్యుత్‌ వాహనాలు బ్యాటరీ విడిభాగాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అంతేగాక తయారీ దశలోనే కర్బన ఉద్గారాల విడుదల గణనీయంగా ఉంటుంది. తద్విరుద్ధంగా మిశ్రమ ఇంధన వాహనాలు స్వదేశీ జీవ ఇంధనాలపై ఆధారపడతాయి కాబట్టి, బ్యాటరీ సంబంధిత ఉద్గారాల నివారణ సాధ్యమవుతుంది. దీనివల్ల అవి పూర్తి  స్వావలంబన సహా కర్బన ఉద్గారాల తగ్గుదలకు దోహదం చేస్తాయి. మరోవైపు ఇథనాల్ తయారీ ముడిసరకు కోసం డిమాండ్‌ పెరుగుదల వల్ల మన రైతులకు తక్షణ ఆదాయ మద్దతు లభిస్తుంది.

మిశ్రమ ఇంధన (ఫ్లెక్స్ ఫ్యూయల్) రవాణా రంగం వినియోగదారులకూ ఆర్థిక ప్రయోజనం కల్పించాలని శ్రీ పూరి స్పష్టం చేశారు. ఇ20తో పోలిస్తే ఇ85 ఇంధనం ధరను తగుమేర తక్కువగా నిర్ణయించడం ద్వారా ఆదా అయ్యే డబ్బుతో వినియోగదారులు సుమారు మూడేళ్లలోనే తమ వాహన కొనుగోలు వ్యయం తిరిగి పొందగలరని అధ్యయనాలు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. చౌకధరతో వినియోగాన్ని వేగిరపరచే దిశగా ప్రభుత్వం సహాయక విధాన చట్రాల రూపకల్పనపై నిశితంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.

మిశ్రమ ఇంధన వినియోగంపై సర్వసాధారణంగా వినిపిస్తున్న అపోహలను తొలగిస్తూ-  సియామ్, ఏఆర్ఏఐ, ఐఓసీఎల్ వంటి సంస్థలు సహా వాహన తయారీదారులు కూడా విస్తృత పరీక్షల తర్వాతే దేశంలో ఇ20 వాడకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి స్పష్టం చేశారు. బ్రసీలియాలో తాను 2006-2008 మధ్య విధి నిర్వహణలో ఉండగా ఇథనాల్‌ వంటి మిశ్రమ ఇంధన వాడకాన్ని బ్రెజిల్ విజయవంతంగా అమలు చేసిందన్నారు. ఆనాటి తన ప్రత్యక్ష అనుభవం సహా ప్రపంచవ్యాప్త ఉదాహరణలతో మిశ్రమ ఇంధన రవాణా సామర్థ్యం నిరూపితమైందని చెప్పారు. కాబట్టి, ఇది విశ్వసనీయ, విస్తరణీయ విధానం కాగలదని మంత్రి స్పష్టం చేశారు.

నేటి జాతీయ ప్రగతి ప్రస్థానంలో మార్గదర్శకంగా నిలుస్తూ ముందడుగు వేయడంపై ‘హీరో మోటోకార్ప్‌’ సంస్థను శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి అభినందించారు. ఈ కంపెనీ ఆవిష్కరించిన కొత్త మోటార్‌సైకిళ్లకు ‘ఇంటర్నల్ కంబస్టిబుల్ ఇంజిన్‌’ (అంతర్గత దహన యంత్రం) సహా ఆధునికీకరించిన ఇంధన వ్యవస్థలను అమర్చారు. అందువల్ల ఇవి ఇ20 నుంచి ఇ85 రకాల వరకూ పెట్రోల్, ఇథనాల్ మిశ్రమం ఏ శాతంలో ఉన్నా విజయవంతంగా నడుస్తాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ద్వారా ఇంధన ధరల మద్దతు, లక్షిత ప్రోత్సాహకాలతో కూడిన సహాయక విధానాలు అందుబాటు ధరతో వినియోగాన్ని వేగిరపరుస్తాయన్నారు. తద్వార ఫ్లెక్స్ ఫ్యూయల్ రవాణా అంశంలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలపగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

***


(रिलीज़ आईडी: 2268840) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Kannada , Malayalam