ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పూర్వ క్యాగ్‌ (సీఏజీ) శ్రీ వినోద్ రాయ్ సంపాదకత్వంలో రూపొందిన ‘వెన్‌ ఆడిట్ మేటర్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి


“దేశం-పౌరుల మధ్య విశ్వాసం పెంచడం ద్వారా ఆడిట్‌ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది”

“నైతికత-ఆడిట్ ప్రక్రియల సమ్మేళనం పరిపాలనలో రూపాంతరీకరణకు బాటలు వేస్తుంది”

“అత్యున్నత నిజాయితీ-నైతిక ప్రవర్తన ప్రమాణాలకు ఆడిటర్లు కూడా కట్టుబడాలి”

నాడు పోస్టు చేయడమైనది: 03 JUN 2026 6:22PM by PIB Hyderabad

   ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్ ఇవాళ తన అధికార నివాసంలో ‘వెన్ ఆడిట్ మేటర్స్:  కాగ్ ఇంటర్వెన్షన్స్ దట్ మేడ్ ఎ డిఫరెన్స్’ పేరిట మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ వినోద్ రాయ్ సంపాదకత్వంలో రూపొందిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆడిట్‌ ప్రక్రియ ఓ కీలక ఉపకరణం” అని అభివర్ణించారు. చట్టానికి అనుగుణంగా, సమర్థంగా,  నిష్పక్షపాతంగా ప్రజా హితం కోసమే ప్రజాధనం వినియోగమవుతున్నదని ఇది పౌరులకు భరోసా ఇస్తుందన్నారు. ప్రభుత్వాలు వ్యవస్థలను మెరుగుపరచడానికి, లోపాలను సరిదిద్దడానికి కూడా ఆడిట్‌ తోడ్పడుతుందని చెప్పారు. అంతేకాకుండా దేశం, పౌరుల మధ్య విశ్వాసాన్ని కూడా బలపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజా జీవనంలో నైతిక విలువల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- ఆడిట్‌-నైతిక విలువల  సమ్మేళనం రూపాంతరీకరణకు తోడ్పడే ఉపకరణమన్నారు. మెరుగైన ప్రజాసేవా ప్రదానానికి, ప్రభుత్వ వనరుల సమర్థ వినియోగానికి, అధిక పునరుత్థాన సామర్థ్యానికి ప్రజా విశ్వాసం ఇనుమడించేందుకు దోహదం చేస్తుందని ఉప రాష్ట్రపతి అన్నారు. ప్రభుత్వ పరిపాలనకు విలువల అనుసరణ నైతిక పునాదిగా మారాలని ఆయన ఉద్ఘాటించారు. అలాగే, పాలన వ్యవస్థలు ప్రజా ప్రయోజనాల దిశగా కృషి చేసేందుకే రూపొందాయని పేర్కొన్నారు.

భారత ఇతిహాసాలు-గ్రంథాల్లో ప్రతిబింబించే ధర్మం, రాజధర్మం, ప్రభుత్వ కర్తవ్యం వంటి భావనలలో దేశం జవాబుదారీతనం, నైతిక పాలన సంప్రదాయాలు లోతుగా పాదుకున్నాయని చెప్పారు. ఆర్థిక పర్యవేక్షణ, జవాబుదారీతనం సూత్రాలను కౌటిల్యుని అర్థశాస్త్రం నిర్దేశిస్తుందని ఉప రాష్ట్రపతి గుర్తుచేశారు. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగం ద్వారా ఈ ఆదర్శాలు సంస్థాగతం అయ్యాయని చెప్పారు. ఇది చట్టబద్ధ పాలన, ఆర్థిక జవాబుదారీతనం, పార్లమెంటరీ పర్యవేక్షణ కింద ‘కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్‌’ పేరిట స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ప్రాధాన్యాన్ని ఆయన విశదీకరించారు. బడ్జెట్‌ పద్దులకు చట్టసభల ఆమోదంతో ప్రారంభమై, పబ్లిక్ అకౌంట్స్ కమిటీల ద్వారా ఆడిట్-పరిశీలన వరకు ఇది కొనసాగుతుందని ఆయన గుర్తుచేశారు. క్రమబద్ధ ఆర్థిక పర్యవేక్షణకు ఈ ప్రక్రియ ఒక సమగ్ర చట్రాన్ని రూపొందిస్తుందని, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై ప్రజాస్వామ్య నియంత్రణను బలోపేతం చేస్తుందని తెలిపారు.

ఆడిటింగ్ వ్యవస్థలలో నిరంతర ప్రగతి అవసరాన్ని స్పష్టం చేస్తూ- శిక్షణ, సాంకేతిక ఉన్నతీకరణ, పనితీరు మూల్యాంకనం, గణాంక విశ్లేషణ, రంగాల వారీ నైపుణ్య ప్రాధన్యాలను ఉప రాష్ట్రపతి ఉద్ఘాటించారు. అత్యున్నత సమగ్రత, నైతిక ప్రవర్తన ప్రమాణాలకు ఆడిటర్లు కూడా కట్టుబడాలని ఆయన వ్యాఖ్యానించారు.

తన చేతుల మీదుగా ఆవిష్కృతమైన పుస్తకం గురించి చెబుతూ- పూర్వ సీనియర్ ఆడిట్ అధికారుల అనుభవాలను గుదిగుచ్చుతూ, కీలక ఆడిట్‌ ప్రక్రియల వెనుకగల ఉదంతాలను సులభగ్రాహ్యంగా, సోదాహరణంగా, సరళ శైలిలో రూపొందించడంపై శ్రీ వినోద్ రాయ్ సహా ఆయన సహచరులను ఉపరాష్ట్రపతి అభినందించారు. ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌’ పరిధిలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్’ ఆధ్వర్యాన చేపట్టిన ఒక ప్రాజెక్టు కింద దక్షిణాసియాలో పరిపాలన-జవాబుదారీతనాన్ని ఈ ప్రచురణ పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ పుస్తకం విస్తృత పాఠకాదరణ పొందడమే కాకుండా చర్చలకు దోహదం చేస్తుందనే విశ్వాసం వెలిబుచ్చారు. ఈ ప్రచురణ ప్రజల మధ్య చర్చను సుసంపన్నం చేయడంతోపాటు చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంలో సంస్థాగత జవాబుదారీతనం శాశ్వత ప్రాధాన్యాన్ని బలోపేతం చేయగలదని ఉప రాష్ట్రపతి అన్నారు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్ శ్రీ వినోద్ రాయ్, సింగపూర్‌లోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్’ డైరెక్టర్ డాక్టర్ ఇక్బాల్ సింగ్ సెవియా, ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కపిష్ మెహ్రా, పుస్తక రూపకల్పనలో సహకరించిన ‘ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్’ మాజీ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2268664) సందర్శకుల సూచీ సంఖ్య : : 109
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Bengali , Malayalam