రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకాదళం 27వ ప్రధానాధికారిగా
అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతల స్వీకారం
నాడు పోస్టు చేయడమైనది:
31 MAY 2026 4:01PM by PIB Hyderabad
భారత నౌకాదళం 27వ ప్రధానాధికారి (చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్) గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, వీఎస్ఎం బాధ్యతలు స్వీకరించారు. 41 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ చేసిన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, ఎన్ఎం స్థానంలో ఆయన నియమితులయ్యారు.
అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 1987 జూలై ఒకటిన భారత నౌకాదళంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విభాగాల్లో నిపుణుడైన ఆయన, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిర్వహణ, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ సంబంధిత విస్తృతమైన బాధ్యతలను నిర్వహించారు. సముద్రంలో వివిధ యుద్ధ నౌకలకు కమాండర్‌గా అడ్మిరల్ స్వామినాథన్ సేవలందించారు. ఆయన నాయకత్వం వహించిన నౌకల్లో గైడెడ్ మిస్సైల్ నౌకలు, ఐఎన్ఎస్ విద్యుత్, ఐఎన్ఎస్ వినాష్, గైడెడ్ మిస్సైల్ కార్వెట్ ఐఎన్ఎస్ కులిష్, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, యుద్ధవిమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉన్నాయి.
రియర్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి పొందిన తర్వాత, ఆయన కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (శిక్షణ) గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రైనింగ్ (ఎఫ్ఓఎస్టీ) గా నియమితులయ్యారు. తరువాత భారత నౌకాదళానికి స్వోర్డ్ ఆర్మ్ గా పేరొందిన వెస్ట్రన్ ఫ్లీట్ కు కమాండర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత, ఆయన తీర ప్రాంత రక్షణ సలహా బృందం ఫ్లాగ్ ఆఫీసర్ గా, భారత ప్రభుత్వానికి తీరప్రాంత రక్షణ, భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులయ్యారు.
వైస్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి పొందిన తర్వాత, ఆయన వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా; నౌకాదళ ప్రధాన కార్యాలయంలో కంట్రోలర్ పర్సనల్ సర్వీసెస్, చీఫ్ ఆఫ్ పర్సనల్, వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ వంటి అత్యున్నత బాధ్యతలను నిర్వహించారు. చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, అడ్మిరల్ స్వామినాథన్ ప్రతిష్టాత్మకమైన వెస్ట్రన్ నావల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా వ్యవహరించారు.
ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బ్రిటన్ లోని శ్రీవెన్‌హామ్ జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, కరంజాలోని నావల్ వార్‌ఫేర్ కాలేజ్, అమెరికాలోని రోడ్ ఐలాండ్, న్యూపోర్ట్‌లో గల యునైటెడ్ స్టేట్స్ నావల్ వార్ కాలేజ్ లో ఆయన చదువుకున్నారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ, కొచ్చిలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి టెలికమ్యూనికేషన్స్‌లో ఎమ్మెస్సీ, లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నుండి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఏ, ముంబయి విశ్వవిద్యాలయం నుంచి స్ట్రాటజిక్ స్టడీస్‌లో ఎంఫిల్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పట్టాలను పొందారు.
విశిష్ట సేవలకు గుర్తింపుగా పరమ విశిష్ట సేవా పతకం (పీవీఎస్ఎం, అతి విశిష్ట సేవా పతకం (ఏవీఎస్ఎం), విశిష్ట సేవా పతకం(వీఎస్ఎం) పురస్కారాలను ఆయన అందుకున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2267346)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6