ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 31 MAY 2026 11:15AM by PIB Hyderabad

   లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆమెకు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ- ప్రజా సంక్షేమంపై లోకమాత అహిల్యాబాయి హోల్కర్‌ నిబద్ధత, పాలనలో ఆమె వివేకం, కరుణాదృష్టి కారణంగా యావద్దేశం ఆ తల్లిని భక్తిశ్రద్ధలతో, సగౌరవంగా సంస్మరించుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు.

దేశభక్తి, సుపరిపాలనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె, సాంస్కృతిక ప్రతిష్టకూ ఆదర్శప్రాయ నమూనాగా నిలిచారని ప్రధానమంత్రి అన్నారు. ఆమె సదా ధైర్యసాహసాలతో, బలమైన కర్తవ్య స్ఫూర్తితో తన ప్రజలకు నాయకత్వం వహించారని తెలిపారు.

ప్రజలందరికీ సమ న్యాయం, సంక్షేమం దిశగా అసమాన కృషి చేశారని, దేశవ్యాప్తంగా పవిత్ర ఆలయాలు, పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణానికి ఎంతో శ్రమించారని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె అవిరళ కృషితో భారత సాంస్కృతిక చైతన్యం మరింత బలోపేతమైందని ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక వికాసం, సంస్కృతీ వైభవ పునరుద్ధరణతోపాటు దేశ పురోగమనం దిశగానూ  లోకమాత అంకితభావం తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా ఆమెకు నా వినమ్ర నివాళి! ఆమె వివేకం, కరుణాదృష్టితోపాటు ప్రజా సంక్షేమంపై తిరుగులేని నిబద్ధత కారణంగా దేశం యావత్తూ గౌరవమర్యాదలతో ఇవాళ అహిల్యాబాయి హోల్కర్‌ను సంస్మరించుకుంటోంది. దేశభక్తికి, సుపరిపాలనకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఆమె, భారత సాంస్కృతిక ప్రతిష్టకూ ఒక అద్భుత ప్రతీక. ఆమె సదా ధైర్యసాహసాలతో, అంకితభావంతో ప్రజలకు నాయకత్వం వహించారు. దేశవ్యాప్తంగా పవిత్ర ఆలయాలు, పుణ్యక్షేత్రాలెన్నిటినో పునర్నిర్మించారు. అందరికీ సమ న్యాయం, సంక్షేమం దిశగాసాటిలేని రీతిలో కృషి చేశారు. భారత సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించి, మరింత బలోపేతం చేశారు. సమాజం, సంస్కృతిపై అనురక్తితోపాటు దేశ ప్రగతిపై ఆమె అంకితభావం తరతరాలకూ సదా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2267343) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Malayalam