పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

38 విమానాశ్రయాలలో 10 కోట్ల వినియోగ మార్కును దాటిన డిజి యాత్ర యాప్ భారత డిజిటల్ విమానయాన విప్లవంలో కొత్త మలుపు

నాడు పోస్టు చేయడమైనది: 30 MAY 2026 5:55PM by PIB Hyderabad

భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ)లో ఒక ప్రధాన మైలురాయిని నమోదు చేస్తూ, డిజి యాత్ర యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వేదికల్లో  2.4 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లతో, 10 కోట్లకు పైగా సులభతరమైన ప్రయాణాలకు దోహదపడింది. నేడు ప్రపంచ విమానయాన రంగంలో అత్యంత విజయవంతమైన డిజిటల్ ఆవిష్కరణలలో ఒకటిగా ఈ ప్లాట్‌ఫారమ్ నిలుస్తోంది.

పత్రాల మాన్యువల్ వెరిఫికేషన్ స్థానంలో డిజి యాత్ర యాప్ రావడం వల్ల, విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద ఒక్కో ప్రయాణికుడి సగటు ప్రాసెసింగ్ సమయం 15 సెకన్ల నుంచి  కేవలం 5 సెకన్లకు తగ్గింది. ఈ వేగవంతమైన ప్రయాణ ప్రక్రియ వల్ల టెర్మినల్ మౌలిక సదుపాయాల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది. టెర్మినల్ వద్ద రద్దీ తగ్గింది.  మాన్యువల్ ప్రాసెసింగ్ భారం కూడా కనిష్ట స్థాయికి చేరింది.

ఇంకా, భౌతిక (ఫిజికల్) బోర్డింగ్ పాస్‌ల అవసరాన్ని తొలగించడం ద్వారా, ఈ చొరవ భాగస్వామ్య విమానాశ్రయాలలో ప్రతిరోజూ వేలాది కాగితాలను ఆదా చేస్తూ పర్యావరణ సుస్థిరత్వానికి తోడ్పడుతోంది.

ఈ పురోగతిపైపై పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, "10 కోట్ల వినియోగ మైలురాయిని అధిగమించినందుకు డిజి యాత్ర యాప్ బృందానికి నా అభినందనలు. సులభతరమైన, కాగిత రహిత, స్పర్శ (కాంటాక్ట్) రహిత  ప్రయాణంపై ప్రయాణికులలో పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనం. డిజి యాత్ర యాప్ వినియోగం ఈ స్థాయికి చేరడం ఒక కీలకమైన సమయంలో జరిగింది. 2014లో రోజువారీ సగటు దేశీయ ప్రయాణికుల సంఖ్య 2 లక్షల లోపు ఉండగా, గత మూడేళ్లలో అనేక సందర్భాల్లో అది 5 లక్షల మార్కును దాటింది.  విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా మార్చాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా భారత విమానాశ్రయాలలో వార్షిక ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని, అలాగే 2040 నాటికి అది రెట్టింపు అయ్యి దాదాపు 100 కోట్లకు చేరుతుందని అంచనా.  ఈ విశేష వృద్ధిని సమర్థవంతంగా నిర్వహించడానికి, మేము డిజి యాత్ర, సెల్ఫ్ బాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆటోమేషన్ సిస్టమ్స్ పెంపుదల, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎయిర్‌సేవా పోర్టల్,  విమానాశ్రయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఏఐ ఆధారిత డిజిటల్ ట్విన్స్ వంటి బహుళ డిజిటల్ పరిష్కారాలను అవలంబిస్తు న్నాం” అని పేర్కొన్నారు.

భవిష్యత్తుపై తన ఆలోచనను పంచుకుంటూ శ్రీ రామ్ మోహన్ నాయుడు "అనేక దేశాలు బయోమెట్రిక్ ప్రయాణికుల ప్రాసెసింగ్‌ను పెద్ద ఎత్తున అమలు చేయడంపై ఇంకా అంచనాలు వేసుకుంటున్న తరుణంలో, భారత్ చాలా తక్కువ కాలంలోనే డిజి యాత్రను విజయవంతంగా ఆచరణలోకి తీసుకురావడమే కాకుండా దాని పరిధిని విస్తరించింది. ప్రస్తుతం  డిజి యాత్ర 38 విమానాశ్రయాలలో అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది నాటికి మరో 27 విమానాశ్రయాలలో ఇది ప్రారంభం కానుంది. ఈ ఏడాది కార్యకలాపాలు ప్రారంభించబోతున్న ప్రధాన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టులైన నవీ ముంబై, జేవార్,  భోగాపురం  పూర్తిగా డిజి యాత్ర సదుపాయంతోనే అందుబాటులోకి వస్తాయని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను” అన్నారు. 

విమాన ప్రయాణ సౌలభ్యం పట్ల తన ఉద్దేశాన్ని వివరిస్తూ, " ఈ ప్లాట్‌ఫారమ్‌ను మేం మరింత సమ్మిళితంగా మారుస్తున్నాం. ప్రస్తుతం డిజి యాత్ర 11 భాషలలో ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి మరో 11 ప్రాంతీయ భాషలను జోడించాలని యోచిస్తున్నాం. ఇది విమానయాన రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే,  సామాన్య మానవునికి విమాన ప్రయాణాన్ని అందుబాటులో ఉంచాలనే ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్తుంది" అని ఆయన అన్నారు. 

డిజి యాత్ర ప్లాట్‌ఫారమ్ ప్రాథమిక నిర్మాణం  'ప్రైవసీ-బై-డిజైన్' విధానం ద్వారా భద్రతకు, ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు కచ్చితమైన ప్రాధాన్యతనిస్తుంది. ప్రయాణికుల డేటా నిక్షిప్తమై వినియోగదారుడి స్వంత పరికరంలోనే సురక్షితంగా ఉంటుంది. దానిని తక్షణ ధృవీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయాణం ప్రారంభమయ్యే విమానాశ్రయంతో  పరిమిత వ్యవధి మాత్రమే వినియోగిస్తారు. 

భారత విమానాశ్రయాలకు ప్రయాణాన్ని అంతర్జాతీయ విమానయాన రంగానికి ప్రామాణికంగా మారుస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్విముఖ దార్శనికత 'డిజిటల్ ఇండియా',  'అందరికీ విమానయానం'  స్ఫూర్తితో, ప్రయాణికులకు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరంగా,  ఇబ్బందులు లేనిదిగా మార్చడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. 

***


(రిలీజ్ ఐడి: 2267173) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Tamil , Malayalam , English , Urdu