సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీపీజీఆర్ఏఎమ్ఎస్ కోసం ఏఐ-ఆధారిత వాయిస్ 'చాట్‌బాట్' -'సమాధాన్ దీదీ'ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


దేశంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగ 'ప్రజాస్వామ్యీకరణ'గా దీనిని అభివర్ణించిన కేంద్ర మంత్రి

ప్రభుత్వం అనురిస్తున్న ‘సమగ్ర జాతీయ విధానాన్ని’ ప్రదర్శించే సంస్కరణ

రాష్ట్రాలు, ఇతర భాగస్వాములు ఏఐ-ఆధారిత, వాయిస్-సహాయక సాధనాలను స్వీకరించి... వారి గ్రీవెన్స్ పోర్టల్‌లతో ఏకీకృతం చేయాలని పిలుపు

పౌరులు తమ మాతృభాషలో మాట్లాడటం ద్వారానే తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు
సంబంధిత మంత్రిత్వ శాఖను, విభాగాన్ని స్వయంచాలకంగా గుర్తించే అధునాతన వ్యవస్థ

నాడు పోస్టు చేయడమైనది: 30 MAY 2026 4:37PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్రంసాంకేతికం, భూ విజ్ఞాన శాస్త్ర శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)... ప్రధానమంత్రి కార్యాలయం, అణు ఇంధన, అంతరిక్ష శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్... సీపీజీఆర్ఏఎమ్ఎస్ కోసం 'పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ' అభివృద్ధి చేసిన ఏఐ-ఆధారిత వాయిస్ 'చాట్‌బాట్' అయిన 'సమాధాన్ దీదీ'ని ఈ రోజు న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో ప్రారంభించారు. ఇది 'భాషిణి' యాప్ సహకారంతో పనిచేస్తుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీపీజీఆర్ఏఎమ్ఎస్‌ను ఏఐ-ఆధారిత వాయిస్ చాట్‌బాట్‌గా అభివృద్ధి చేయడాన్ని దేశంలో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగ ప్రజాస్వామ్యీకరణ"గా డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు. పౌరులకు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవడం మరింత "సులభతరం" చేసే దిశగా ప్రభుత్వ అచంచల నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చేపట్టిన పాలనా సంస్కరణలన్నింటికీ 'పౌర-కేంద్రిత విధానం' మూలస్తంభంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ప్రజా పరిపాలనలో సాంకేతికత పోషిస్తున్న పరివర్తనాత్మక పాత్రను స్పష్టం చేస్తూ... ఫిర్యాదుల పరిష్కారాన్ని కృత్రిమ మేధ (ఏఐ) మరింత సులభతరం, వేగవంతం, సమర్థంగా పనిచేసేలా చేస్తూ దానిని అందరికీ అందుబాటులోకి తెస్తోందన్నారు. ఏఐ ఆధారిత సాధనాలు పౌరుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను, వేగాన్నీ మెరుగుపరుస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

ఈ చర్యలు ప్రభుత్వం అనుసరిస్తున్న 'సమగ్ర జాతీయ విధానానికి' నిదర్శనమని ఉద్ఘాటిస్తూ... మారుమూల ప్రాంతాల లబ్ధిదారుల వరకూ చేరుకునేందుకు గానూ 'సమాధాన్ దీదీ' వంటి ఏఐ-ఆధారిత, వాయిస్-సహాయక సాధనాలను స్వీకరించడంతో పాటు రాష్ట్రాలు తమ సొంత రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల పోర్టల్‌లతో వాటిని అనుసంధానించాలని కేంద్ర మంత్రి రాష్ట్రాలను, సంబంధిత వర్గాలను కోరారు.

గత 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంలో వచ్చిన సమూల మార్పును ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ ఇలా పేర్కొన్నారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం చాలా పరిమితంగా ఉండేదనీ, ప్రతియేటా సుమారు 2 లక్షల ఫిర్యాదులు మాత్రమే నమోదయ్యేవన్నారు. సీపీజీఆర్ఏఎమ్ఎస్ సంస్కరణలు చేపట్టిన తర్వాత ఈ వ్యవస్థ ద్వారా అందే ఫిర్యాదుల సంఖ్య ఇప్పుడు అనేక రెట్లు పెరిగి, ప్రతియేటా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార రేటు ఇప్పుడు 95 శాతానికి మించడం... ప్రభుత్వ స్పందన, పౌర-కేంద్రీకృత విధానంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

మారుమూల ప్రాంతాల పౌరులకూ చేరే పరిపాలన పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ చాట్‌బాట్ ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత భాషా వైవిధ్యం ఒక అడ్డంకిగా కాకుండా... వినియోగాన్ని సులభతరం చేసే సాధనంగా ఉండాలన్నారు. ప్రతి పౌరుడి గళం వారి సొంత మాటల్లో, వారి సొంత భాషలో వినిపించే స్వయం-సమృద్ధ, సాంకేతిక సార్వభౌమత్వం సాధించిన భారత స్ఫూర్తిని ఇది మూర్తీభవించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

సీపీజీఆర్ఏఎమ్ఎస్ వేదికపై భాషాపరమైన అనుకూలతలను విస్తరించేందుకు కృషి జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఇప్పటికే పేర్కొన్న 22 భాషలకు అదనంగా... భోజ్‌పురి, గారో, ఖాసి, మిజో, బోధి వంటి ప్రాంతీయ, స్థానిక భాషలనూ దశలవారీగా ఇందులో చేర్చుతున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా విభిన్న భాషాపరమైన నేపథ్యాలు కలిగిన పౌరులందరికీ మరింత విస్తృతమైన సమ్మిళితత్వాన్ని కల్పిస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.

సాంకేతికత ఆధారిత పాలన పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, స్పందనను ఎలా మెరుగుపరుస్తుందో... పౌరులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని ఎలా బలపరుస్తుందో నిరూపిస్తూ... ఈ సీపీజీఆర్ఏఎమ్ఎస్ పౌర-కేంద్రీకృత పాలన విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా ఆవిర్భవించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత సరళంగా, మరింత అందుబాటులో ఉండేలా, మరిన్ని భాషల సమాహారంగా మార్చడంలో ఈ చాట్‌బాట్ కీలక ముందడుగు. సమస్య ప్రత్యేకంగా ఏ మంత్రిత్వ శాఖ, విభాగం, వర్గం లేదా ఉప-వర్గానికి చెందినదో తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే పౌరులు కేవలం తమ సొంత భాషలో తమ సమస్యను స్పష్టమైన మాటల్లో వివరిస్తూ మాట్లాడటం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చాట్‌బాట్ వారి సమస్యను అర్థం చేసుకుని, దానికి సంబంధించి స్పష్టత కోసం కొన్ని ప్రశ్నలు అడిగి... సరైన మంత్రిత్వ శాఖ, విభాగం, వర్గం, ఉప-వర్గాన్ని స్వయంచాలకంగా గుర్తించి, సరైన అధికార సంస్థ వద్ద ఫిర్యాదును దాఖలు చేస్తుంది.

ఈ వ్యవస్థ సీపీజీఆర్ఏఎమ్ఎస్ డేటాపై శిక్షణ పొందిన ఫిర్యాదుల వర్గీకరణ నమూనాలతో భాషిణి భాషా సామర్థ్యాలను అనుసంధానించడం ద్వారా అన్ని భారతీయ భాషల్లో నిరాటంకమైన అనుభవాన్ని అందిస్తుంది. డేటా గోప్యతను నిర్ధారిస్తూనే, దీనిని సురక్షిత ప్రభుత్వ మౌలిక సదుపాయాల పరిధిలో అభివృద్ధి చేశారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా చాట్‌బాట్‌ను ప్రత్యక్షంగా ప్రదర్శించి, వివిధ భారతీయ భాషల్లో పరీక్షించారు. ఈ కార్యక్రమానికి డీఏఆర్‌పీజీ కార్యదర్శి నివేదిత శుక్లా వర్మ, అదనపు కార్యదర్శి పునీత్ యాదవ్, సీనియర్ అధికారులు, 'భాషిణి' ప్రతినిధులు హాజరయ్యారు.

 

***


(రిలీజ్ ఐడి: 2267172) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam