రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సిందూర్‌పై పుస్తకం.. ఆవిష్కరించిన రక్షణ మంత్రి.. సైనికుల అనుభవాల సారం ఈ గ్రంథం
వ్యూహాన్ని సాఫల్యంగా మార్చే ఆధునిక యుద్ధతంత్రంలో
మనిషి పోషించిన పాత్రను వివరించే పుస్తకమిది
నాడు పోస్టు చేయడమైనది:
29 MAY 2026 2:19PM by PIB Hyderabad
ఆపరేషన్ సిందూర్‌ను వివరించే గ్రంథాన్ని కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు ఆవిష్కరించారు. ఆపరేషన్ సిందూర్‌లో పాలుపంచుకున్న అధికారులు, నావికులు, వైమానికదళ సిబ్బందితో పాటు ఇతర సైనికులు చెప్పిన 100 కథనాలను దీనిలో చేర్చారు. ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించిన వారికి ఒక ప్రశంసే ఈ పుస్తకం.. ఇది జవానుల అంకితభావానికి, వారి ధీరత్వానికి నిదర్శనం అని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఓ సందేశంలో పేర్కొన్నారు. ‘‘పౌరులు ఈ పుస్తకం చదివి స్ఫూర్తిని పొందాలి. దేశ భద్రతను పరిరక్షించడానికి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి జాతి చెల్లించే భారీ వెలకు దీటైన మెరికలుగా పౌరులు తయారవాలి’’ అని ఆయన అన్నారు.
‘‘ఆపరేషన్ సిందూర్ ఇదివరకు ఎప్పుడూ కని విని ఎరుగని విజయం, దీనిలో నాలుగు రోజుల్లోపే కాల్పుల విరమణను కోరక తప్పని స్థితిని పాకిస్థానుకు భారత్ కల్పించింది’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఇంతవరకు చేసిన యుద్ధాల కన్నా ఇది పూర్తి భిన్నమైందని, ఈ స్మృతి గ్రంథం సాంప్రదాయిక కథనాలకు మించి, వీర సైనికుల అనుభవాల్ని పాఠకుల కళ్లకు కడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆధునిక యుద్ధతంత్రానికి సంబంధించి మనిషి దృష్టికోణాన్ని కూడా ఈ పుస్తకం పూస గుచ్చినట్టు వివరిస్తుందని, నాయకత్వం, ధైర్య సాహసాలు, ఒత్తిడి నడుమ కర్తవ్య పాలన, నిబద్ధత.. ఇవన్నీ కలగలిసి వ్యూహానికి విజయ రూపాన్ని సంతరించి పెట్టాయని ఆయన అన్నారు.
సైన్య అధికారులు గతంలో ఎలా పనిచేసేవారన్న అంశాలను ఈ సంపుటిలో ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. యుద్ధాల కథనాలు చాలావరకూ ప్రధాన కేంద్రం, యుద్ధ కార్యకలాపాల్ని నిర్దేశించేందుకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యాలయం కథనాలనే అందిస్తాయి. కమాండర్ల నిర్ణయాలే నమోదవుతాయి, వాటిపైనే విశ్లేషణలు, చర్చలు చోటుచేసుకుంటాయి. యుద్ధం పోకడ మాత్రం తెరకు వెనుకే ఉండిపోతుంది.. ఎలాగంటే పోరు బరిలో నియంత్రణ రేఖ వద్ద నిలబడి విరోధి బంకర్లపైన కనురెప్పలు వాల్చక ఆయుధాన్ని గురిపెట్టే జవాను, సరిహద్దు లోపలికి దూసుకొచ్చే డ్రోన్ల జాడను పసిగట్టి వాటిని కూల్చేసే వాయు రక్షణ రేఖ ఆపరేటరు, ఆయుధాలను వెదజల్లే యుద్ధవిమాన పైలట్, యుద్ధనౌకల సమూహం కీలక స్థావరం నుంచి ముందుకు సాగిపోయే వేళ అత్యంత అప్రమత్తంగా ఉండే నావికుడు.. వీరందరి సాహస కృత్యాలు చరిత్ర పుటలకెక్కే సందర్భాలు ఇంచుమించు ఎంతో అరుదు.
అలాంటి ఘటనల్ని రోమాంచితంగా వివరించే ప్రయత్నాన్ని చేశారు ఈ పుస్తకంలో. దీనిలో ప్రధానకేంద్రం, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌తో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉదంతాల్ని గుదిగుచ్చారు. అలాగే గగనతలాన పోరాడిన ఏవియేటర్లు, ఉపరితలం నుంచి నింగిలోకి క్షిపణుల్ని ప్రయోగించిన సిబ్బంది, నౌకా సంరక్షకులు, ప్రత్యేక దళాల ఆపరేటర్లు, సిగ్నలర్లు, చలన తంత్ర నిపుణులు, వైద్యాధికారులు, తదితర యోధులు కలిసికట్టుగా కదిలి ఆపరేషన్‌ను విజయ తీరానికి చేర్చారని చాటిచెప్పారు.
ఈ పుస్తకాన్ని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ, సైన్య ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్ ల సమక్షంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.
సీడీఎస్ మార్గదర్శకత్వంలో ఈ సంపుటిని సంకలన పరిచారు. సాయుధ దళాల సిబ్బంది కథనాల్ని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అడిషనల్ డైరెక్టరేట్ జనరల్, మీడియా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెల్‌లతో పాటు మీడియా పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్‌లు అందించగా గ్రంథ ప్రచురణకు ఇండియా యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ తోడ్పడింది.
***
(రిలీజ్ ఐడి: 2266837)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12