సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తున్న భారత్.. 2026లో అధ్యక్షత వహిస్తున్న భారత్
‘ఎంఎస్ఎంఈలకు సాంకేతికత లభ్యతను మెరుగుపరచడం’ అంశంపై బ్రిక్స్ పార్ట్‌నిర్ ట్రాక్ కింద రెండో ఎస్ఎంఈ కార్యాచరణ బృందం సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ
‘ఎంఎస్ఎంఈల కోసం ఆవిష్కరణల సద్వినియోగం, సాంకేతికత వాణిజ్యీకరణ’పై దృష్టి సారిస్తూ బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
29 MAY 2026 1:15PM by PIB Hyderabad
సరికొత్త పారిశ్రామిక విప్లవం (పార్ట్‌నిర్)పై బ్రిక్స్ భాగస్వామ్య పరిధిలోని ఎస్ఎంఈ కార్యాచరణ బృందానికి కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ నేతృత్వం వహిస్తోంది. 2026లో బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షతన మంత్రిత్వ శాఖ మూడు ఎస్ఎంఈ కార్యాచరణ బృంద సమావేశాలను, మొదటి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ ఫోరంను నిర్వహించనుంది. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయాన్ని అందించడం, సాంకేతికతను అందుబాటులోకి తేవడం, సుస్థిరత ప్రాతిపదికగా వృద్ధిని సాధించడం అన్న మూడు ప్రాధాన్య అంశాలపై ఈ సమావేశాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి.
2026 ఏప్రిల్ 24న నిర్వహించిన మొదటి ఎస్ఎంఈ కార్యాచరణ బృంద సమావేశం అనంతరం.. 2026 మే 26న బ్రిక్స్ పార్ట్‌నిర్ ట్రాక్ కింద ‘ఎంఎస్ఎంఈలకు సాంకేతికత లభ్యతను మెరుగుపరచడం’ అన్న అంశంపై రెండో ఎస్ఎంఈ కార్యాచరణ బృంద సమావేశాన్ని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ విజయవంతంగా నిర్వహించింది. ‘ఎంఎస్ఎంఈల కోసం ఆవిష్కరణల సద్వినియోగం, సాంకేతికత వాణిజ్యీకరణ’, ‘ఎంఎస్ఎంఈ సాంకేతిక స్వీకరణ కోసం పారిశ్రామిక సన్నద్ధమైన నైపుణ్యాభివృద్ధి, వికాసం’ అంశాలపై దృష్టి సారిస్తూ బ్రిక్స్ సభ్య దేశాల నడుమ ప్రధానంగా చర్చలు సాగాయి.
బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, ఆవిష్కరణలు, సమ్మిళిత అభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్రను స్పష్టం చేస్తూనే.. అనుభవాలను, అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకునేలా ఒక చక్కటి వేదికను ఈ సమావేశం అందించింది. సాంకేతిక పరిజ్ఞానంలో అంతరాలను తొలగించడానికి బహుముఖ వ్యూహం అవసరమని ఈ చర్చలు స్పష్టం చేశాయి. ఇందులో భాగంగా డిజిటల్ భాగస్వామ్యాన్ని పెంచడం, ఆవిష్కరణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, అలాగే ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ప్రతీ దశలోనూ ఎంఎస్ఎంఈల ప్రాతినిధ్యాన్ని పెంచేలా సాంకేతిక సన్నద్ధతను మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
ఎంఎస్ఎంఈల కోసం సాంకేతికతను అందుబాటులోకి తేవడం, ఆవిష్కరణ వ్యవస్థలను పెంపొందించడం, నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడం వంటి అంశాల్లో బ్రిక్స్ దేశాల నడుమ మరింత బలమైన సహకారం అవసరమని ఈ సమావేశం స్పష్టం చేసింది. ఒకే రకమైన అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొంటున్న దేశాల నడుమ విలువైన విధానపరమైన చర్చలకు ఈ సమావేశం వీలు కల్పించింది. అలాగే బ్రిక్స్ దేశాల్లో పటిష్టమైన, సమ్మిళిత, ప్రపంచ స్థాయిలో పోటీపడగల ఎంఎస్ఎంఈ రంగాలను నిర్మించాలన్న ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం మరింత బలోపేతం చేసింది.
ఈ సమావేశం అత్యంత విజయవంతంగా, ఫలప్రదంగా సాగింది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య అర్థవంతమైన చర్చలతోపాటు సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు వేదికగా నిలిచింది. బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థల్లో ఎంఎస్ఎంఈలకు సాంకేతికతను మరింతగా అందుబాటులోకి తేవడం, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే దిశగా విలువైన సూచనలను ఈ సమావేశం అందించింది.
***
(రిలీజ్ ఐడి: 2266830)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6