పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి ‘నిర్భయ రహో’ కార్యక్రమం ద్వారా 'ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్' కార్యక్రమాన్ని నిర్వహించిన పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ


దేశవ్యాప్తంగా శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల ద్వారా 32 లక్షలకు పైగా ఎన్నికైన పంచాయతీ ప్రతినిధులను చేరుకోవడమే ‘నిర్భయ రహో’ ముఖ్య లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 11:32AM by PIB Hyderabad

‘‘హింస నుంచి విముక్తి:మహిళల భద్రత, రక్షణ కోసం చట్టపరమైన నిబంధనలపై ఎన్నికైన మహిళా ప్రతినిధుల సామర్థ్యం పెంపు’’ అంశంపై మూడు రోజుల  ‘ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌’ కార్యక్రమాన్ని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026 మే 25 నుంచి 27 వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ‘నిర్భయ్ రహో’ కార్యక్రమం కింద ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్భయ నిధి ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికైన మహిళా ప్రతినిధులు, పంచాయతీ ప్రతినిధులకు మహిళల భద్రత, చట్టాలపై అవగాహన, లింగ సమానత్వం, వ్యవస్థాగత స్పందన యంత్రాంగాలు, గ్రామ స్థాయిలో లభించే సహాయక వ్యవస్థలపై అవగాహన కల్పించి, వారి సామర్థ్యాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ శిక్షణ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి దాదాపు 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో వివిధ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులు, జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ పరిధిలోని ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పంచాయతీ రాజ్’ ప్రతినిధులు, పిరమల్ ఫౌండేషన్, ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు ఉన్నారు. ఈ కార్యక్రమం  ప్రారంభోత్సవంలో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సురేంద్రకుమార్ బాగ్డే పాల్గొని ప్రసంగించారు.

 

క్షేత్ర స్థాయిలో మహిళల భద్రతపై అవగాహన పెంచడం, వారిని భాగస్వాములను చేయడం,  న్యాయం చేకూర్చడంలో పంచాయతీ రాజ్ సంస్థల  ప్రాధాన్యతను శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రస్తావించారు. చట్టాలపై పూర్తి అవగాహన, సున్నితత్వం కలిగిన పంచాయతీ నాయకత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల రక్షణ, గౌరవం, భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.గ్రామాల్లో తక్షణమే స్పందించే సామాజిక సహాయక వ్యవస్థలను, వ్యవస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడానికి కూడా ఈ నాయకత్వం ఎంతగానో దోహదపడుతుందన్నారు. నిర్భయ నిధి కింద 2026 మార్చి 11న ప్రారంభించిన ‘నిర్భయ్ రహో’ కార్యక్రమం ద్వారా పంచాయతీల్లో మహిళల భద్రతను, లింగ ప్రతిస్పందన పాలనను బలోపేతం చేయడానికి మూడు ప్రధాన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అవి పంచాయతీల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల సామర్థ్యాలను పెంపొందించడం, వారికి చట్టాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు నిర్భయ నేత్రి... లింగ సమానత్వం, మహిళలకు సంబంధించిన సమస్యలపై ఎన్నికైన పురుష ప్రతినిధుల్లో సున్నితత్వాన్ని, అవగాహనను పెంపొందించేందుకు నిర్భయ చేతన... సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గ్రామాల్లో భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం పంచాయతీ పరిధిలోని కీలకమైన, వ్యూహాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన నిర్భయ దృష్టి ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా నిర్వహించే శిక్షణ, అవగాహన, సంస్థాగత సామర్థ్య పెంపుదల కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 14.5 లక్షల మంది ఎన్నికైన మహిళా ప్రతినిధులను, సుమారు 17.5 లక్షల మంది ఎన్నికైన పురుష ప్రతినిధులను చేరుకోవడమే ప్రధాన లక్ష్యమని శ్రీ వివేక్ భరద్వాజ్ తెలియజేశారు.

 

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ (డాక్టర్) సాయిరామ్ భట్ ప్రసంగిస్తూ... గ్రామ స్థాయిలో చట్టపరమైన అక్షరాస్యత, లింగ  సున్నితత్వం, బాధితులకు అండగా నిలిచే విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. పంచాయతీ ప్రతినిధులు గ్రామాల్లో అవగాహన పెంచడం, స్థానిక సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడం, మహిళలకు న్యాయం, వ్యవస్థాగత పరిహారాలు సులభంగా అందేలా చూడటం ద్వారా సామాజిక మార్పునకు సమర్థవంతమైన వారధులుగా మారగలరని ఆయన చెప్పారు.

 

ఈ మూడు రోజుల కార్యక్రమంలో పంచాయతీ స్థాయిలో మహిళల రక్షణకు సంబంధించిన అనేక రకాల కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వాటిలో లింగ ఆధారిత హింస,  గృహ హింస, బాల్య వివాహాల నివారణ, సైబర్ భద్రత, బాధితుల సహాయక వ్యవస్థలు, న్యాయపరమైన పరిష్కారాలు, బాధితులకు నష్టపరిహారం, సామాజిక భాగస్వామ్యం, సమస్యలు జరిగినప్పుడు తక్షణమే స్పందించే యంత్రాంగాలు వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ శిక్షణ కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా, ఆచరణాత్మక విధానంలో సాగింది. ఇందులో భాగంగా నిపుణుల ఉపన్యాసాలు, బృంద చర్చలు, కేస్ స్టడీస్ (నిజ జీవిత సంఘటనల విశ్లేషణ), మూట్ కోర్టు వ్యాయామాలు (కల్పిత కోర్టు రూపంలో శిక్షణ), రోల్-ప్లే సిమ్యులేషన్స్ (వివిధ పాత్రలు పోషిస్తూ నేర్చుకోవడం), అనుభవపూర్వక అభ్యాస పద్ధతులను ఉపయోగించారు.

ప్రముఖ న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, క్షేత్రస్థాయి పరిశోధకులు సమావేశాలను నిర్వహించగా... చట్టపరమైన నిబంధనలపై ఆచరణాత్మక అవగాహన పెంచడం, బాధితుల పట్ల సున్నితంగా స్పందించే వ్యవస్థాగత చర్యలను బలోపేతం చేయడం, సిఫార్సు,  నివేదన విధానాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చలు సాగాయి. గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచడానికి అవసరమైన క్షేత్రస్థాయి జ్ఞానాన్ని ఈ శిక్షకులకు అందించారు. శిక్షణను క్యాస్కేడింగ్ పద్ధతిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించడంపై పాల్గొన్నవారి అభిప్రాయాలు, చర్చలతో ఈ కార్యక్రమం ముగిసింది. గ్రామీణ భారత్‌లో మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడటం కోసం సమాజం నేతృత్వంలో సాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేస్తూ, మరింత సమగ్రమైన, బాధ్యతాయుతమైన, మహిళా స్నేహపూర్వక పంచాయతీలను నిర్మించే దిశగా ఈ కార్యక్రమం  కీలకమైన చర్యగా నిలిచింది.

***


(రిలీజ్ ఐడి: 2266318) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil