ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి అధ్యక్షతన 51వ ప్రగతి సమావేశం
రైల్వే, విద్యుత్, రహదారి రంగాల్లోని ఏడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన ప్రధానమంత్రి
9 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులపై మొత్తం పెట్టుబడి సుమారు రూ. 30,000 కోట్లు
కెన్-బెత్వా అనుసంధాన ప్రాజెక్టు, స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0లనూ సమీక్షించిన ప్రధానమంత్రి
అంతర్-రాష్ట్ర జల వివాదాల సామరస్య పరిష్కారం కోసం ఇతర రాష్ట్రాలకు నమూనాగా 'కెన్-బెత్వా నదుల అనుసంధాన పథకం'
ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాలైన వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, 'గోబర్ధన్' ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరిన ప్రధానమంత్రి
పట్టణ ప్రాంతాల్లో మిషన్-మోడ్ రూఫ్‌టాప్ సోలార్ కవరేజీ కోసం పిలుపు
ప్రధానమంత్రి సలహాతో అమలులోకి రాష్ట్ర స్థాయి సామాజిక రంగ పథకాల నెలవారీ సమీక్షా విధానం
స్వచ్ఛ భారత్ మిషన్ సమీక్షతో ప్రారంభమైన ప్రక్రియ
प्रविष्टि तिथि:
27 MAY 2026 9:08PM by PIB Hyderabad
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిని సమర్థంగా సమన్వయం చేయడం ద్వారా క్రియాశీల పాలనను, సకాలంలో పథకాల అమలును నిర్ధారించడం లక్ష్యంగా పనిచేసే ఐసీటీ ఆధారిత బహుళ-మాధ్యమ వేదిక 'ప్రగతి' (పీఆర్ఏజీఏటీఐ) 51వ సమావేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఉదయం 'సేవా తీర్థ్'లో జరిగింది.
తొమ్మిది రాష్ట్రాల్లో... రైల్వే, విద్యుత్, రహదారి రంగాల్లో చేపట్టిన సుమారు రూ.30,000 కోట్ల విలువైన ఏడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని ఈ సమావేశంలో ప్రధానమంత్రి సమీక్షించారు. ఆర్థిక వృద్ధికి, ప్రజా సంక్షేమానికి కీలకమైన ఈ ప్రాజెక్టుల కాలపరిమితులు, ఏజెన్సీల మధ్య సమన్వయం, సమస్యల సకాల పరిష్కారంపైనా సమీక్ష నిర్వహించారు. కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్, స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 ప్రాజెక్టుల పురోగతినీ ప్రధానమంత్రి సమీక్షించారు.
విద్యుత్ రంగ ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా నగరాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి... రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. గృహ, సామాజిక స్థాయిలో విద్యుత్ ఖర్చులను తగ్గించడానికి, ఇంధన భద్రతను మెరుగుపరచడానికి, పరిశుద్ధ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి రూఫ్‌టాప్ సోలార్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన ఉద్ఘాటించారు.
రహదారులు-నౌకాశ్రయాల కనెక్టివిటీ ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే లాజిస్టిక్స్ వ్యవస్థను సృష్టించడానికి ప్రతి ప్రధాన రవాణా విధానాన్ని సజావుగా అనుసంధానించేలా... వధావన్ పోర్ట్‌ను పోర్ట్-ఆధారిత, మల్టీ-మోడల్ అభివృద్ధికి ఒక నమూనాగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును కేవలం ఒక పోర్ట్‌గా మాత్రమే కాకుండా... తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాలు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, హై-స్పీడ్ రైలు కనెక్టివిటీ, హైవేలు, విమానాశ్రయాలను అనుసంధానించే దేశపు ముఖద్వారంగా చూడాలన్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ 2.0ను సమర్థంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మిషన్ కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా... నిరంతర పర్యవేక్షణ, పౌరుల భాగస్వామ్యం, వివిధ భాగస్వాముల మధ్య సమన్వయం ద్వారా విశ్వసనీయ ఫలితాలను సాధించాలని ఆయన ఉద్ఘాటించారు. వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు, గోబర్ధన్ ప్లాంట్లు సహా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన రాష్ట్రాలను కోరారు.
కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు సమీక్షలో భాగంగా... రాష్ట్రాల మధ్య జల వివాదాలను సహకారం, సకాలంలో లభించే అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, మిషన్-మోడ్ అమలు ద్వారా పరిష్కరించుకోవడంలో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలవాలని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక జల భద్రతను కల్పించే దిశగా... నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సమర్థ సాగునీటి వినియోగం వంటి అంశాలను సమగ్ర రీతిలో చేపట్టడానికి వీలుండే ఇతర అవకాశాలనూ గుర్తించాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజా ప్రాజెక్టుల అమలులో జాప్యం వల్ల వ్యయాలు పెరగడమే కాకుండా... అవసరమైన సౌకర్యాలు, అభివృద్ధి ప్రయోజనాలను పౌరులు సకాలంలో పొందలేకపోతున్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ జాప్యం ప్రజల జీవితాలు, ప్రాంతీయ అభివృద్ధి, ప్రజా వనరులపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, అడ్డంకులను తొలగించడానికి, వేగవంతమైన అమలును నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు మరింత చురుకైన, కాలపరిమితితో కూడిన విధానాన్ని అవలంబించాలని ఆయన ఉద్ఘాటించారు.
స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి కోసం కాలువల వెంబడి, కాలువలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం సహా... కాలువల వ్యవస్థలను వినూత్నంగా ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలని ప్రధానమంత్రి సూచించారు. భూ వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడానికి, బాష్పీభవన నష్టాలను తగ్గించడానికి, పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి, జల మౌలిక సదుపాయాల నుంచి అదనపు ఆర్థిక విలువను సృష్టించడానికీ ఇది సహాయపడుతుంది.
సమావేశం ప్రారంభంలో క్యాబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్ర స్థాయిలో సామాజిక రంగ పథకాల నెలవారీ సమీక్షా విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయిల్లో నిరంతర పర్యవేక్షణను, అమలు సంబంధింత సమస్యల వేగవంతమైన పరిష్కారాన్ని, మరింత జవాబుదారీతనాన్ని నిర్ధారించడమే ఈ విధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా... ప్రాథమిక దశలో రాష్ట్ర స్థాయి సమీక్ష కోసం 'స్వచ్ఛ భారత్ మిషన్'ను ఎంపిక చేశారు.
***
(रिलीज़ आईडी: 2266298)
आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada