ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
మొహాలీలో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ల ఆధ్వర్యంలో ‘గవర్నెన్స్ సమ్మిట్-2026’
ఐఎస్‌బీ-మొహాలీలో ఒక రోజు పాటు శిఖరాగ్ర సదస్సు నిర్వహణ..
వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా డిజిటల్ వాణిజ్యం, భద్రత, ఆరోగ్య సంరక్షణ, పాలనల కోసం
కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాల్ని ప్రోత్సహించడానికి ఒక చోట చేరి చర్చించిన ఆసక్తిదారులు
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 10:34AM by PIB Hyderabad
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కి చెందిన భారతీ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ సహకారంతో ‘గవర్నెన్స్ సమ్మిట్-2026’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2026 మే నెల 23న ఐఎస్‌బీ-మొహాలీ క్యాంపసులో నిర్వహించింది.
ఈ శిఖరాగ్ర సదస్సు నాలుగో సంచికను కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ కీలకోపన్యాసంతో మొదలుపెట్టారు. డిజిటల్ సేవలు ప్రధానంగా ఉండే ఆర్థిక వ్యవస్థలోని చివరి అంచె వ్యక్తులు సహా, పౌరులందరికీ ఉపయోగపడేలా ఏఐ విస్తారిత అనుబంధ వ్యవస్థను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ కృష్ణన్ తెలిపారు. ‘‘ఉత్పాదకతను పెంచుకోవడం, పాలనను మెరుగుపరుచుకోవడం, ఆరోగ్య సంరక్షణ, విద్య, తయారీ, ఆర్థిక సేవల్ని అందరి చెంతకూ చేర్చడం వంటి రంగాల్లో లభ్యతను విస్తరించడం కోసం వీటిలో పెనుమార్పుల్ని తీసుకురాగల అవకాశాలను కృత్రిమ మేధ (ఏఐ) భారత్‌కు అందించగలుగుతుంది’’ అని ఆయన వివరించారు. ఏమైనా, నైపుణ్యాలతో ముడి పడిన ఉద్యోగాలపై ఏఐ ప్రసరింపచేసే ప్రభావం విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలు అర్థం చేసుకోదగ్గవని ఆయన అన్నారు. అలా ఆయన అంటూనే, సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా పయనించడంలో ఈ సాంకేతికత ఇవ్వజూపే ప్రయోజనాల్ని సద్వినియోగపరుచుకోగల సామర్థ్యం భారత్‌కు ఉందని తెలిపారు.
రోజంతా నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు ముఖ్య విషయాలపై బృందాలవారీగా చర్చించారు. వాటిలో.. డిజిటల్ వాణిజ్యంలో ఏఐ పాత్ర, ఆన్‌లైన్ మాధ్యమాన్ని వినియోగించుకోవడంలో మహిళలకు, బాలలకు ఎదురయ్యే ఆపదలకు తగిన భద్రతా చర్యలను రూపొందించడం, ఆరోగ్య సంరక్షణ సేవలను తక్కువ ఖర్చులో అందరి అందుబాటు లోకీ తీసుకురావడం, ఉద్యోగావకాశాల కల్పనతో పాటు డిజిటల్ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తిని ప్రోత్సహించడం వంటి అంశాలు ఉన్నాయి. మరో వైపు, దీనికి సమాంతరంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వాల మొదలు గ్రామ పంచాయతీల దాకా.. చివరి దశ వరకూ ప్రజా సేవల అందజేతలో ఏఐ ప్రధానపాత్ర వహించేలా నిర్వహణ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాల్సిన అవకాశాల్ని పరిశీలించారు.
ఐఎస్‌బీకి చెందిన భారతీ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ప్రొఫెసర్ అశ్వినీ ఛత్రే ప్రారంభోపన్యాసాన్ని ఇచ్చారు. కృత్రిమ మేధ (ఏఐ) ఫలాలను ఆచరణీయ పాలన ప్రణాళికల్లో భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘‘తదుపరి తరం భవిష్యత్తుకు రూపురేఖలను కల్పించే ఒక దీర్ఘకాలిక జాతీయ మిషన్‌గా ఏఐని లెక్కలోకి తీసుకోవాలి. అసమానతలు, శీఘ్ర గతిన దూసుకు వస్తున్న అవకాశాలు, రాబోయే కాలంలో రూపురేఖల్ని మార్చుకోబోతున్న ఉద్యోగాలు.. ఇవి సరికొత్తగా తెర మీదకు వస్తున్న ఏఐ స్వరూపానికి సంబంధించిన కీలక పార్శ్వాలు అని గుర్తు పెట్టుకోవాలి’’ అని ఆయన అన్నారు. తగిన భద్రతాచర్యలు, సామాజిక భద్రతా యంత్రాంగాలు, సకారాత్మక కార్యాచరణలను అనుసరిస్తూ ఏఐ అందించే అవకాశాల్ని అందరూ సమాన స్థాయుల్లో చేజిక్కించుకోవాలని ప్రొఫెసర్ ఛత్రే స్పష్టం చేశారు.
ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రభుత్వ సీనియర్ అధికారులు, పరిశ్రమతో పాటు విద్యా రంగ ప్రముఖులు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. వారు సమ్మిళితత్వాన్ని పెంపొందింప చేయడానికి, పాలనను బలోపేతం చేయడానికి, భారత్ అభివృద్ధి అజెండాకు అతి త్వరగా కార్యరూపాన్ని ఇవ్వడానికి కృత్రిమ మేధను ఏయే విధాలుగా వినియోగించుకోవచ్చో ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ రిటైల్, మాస్టర్‌కార్డ్, అపోలో హాస్పిటల్స్, ఐఐటీ మద్రాస్, యూనిసెఫ్ ఇండియా, పంజాబ్ పోలీస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు పాలుపంచుకున్నాయి.
(రిలీజ్ ఐడి: 2265219)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7