యు పి ఎస్ సి
దేశవ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)
పరీక్షను నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష విధాన పారదర్శకత, విశ్వసనీయతను కాపాడేందుకు తొలిసారిగా రియల్ టైమ్ ఫేస్ అథెంటికేషన్‌తో సహా
పలు సాంకేతిక చర్యలు చేపట్టినట్లు వెల్లడించిన యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్
నాడు పోస్టు చేయడమైనది:
24 MAY 2026 5:49PM by PIB Hyderabad
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2026తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్షను ఇవాళ మే 24, 2026న దేశవ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పరీక్షకు 8,19,732 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 5.49 లక్షల మంది, సుమారుగా 67 శాతం మంది హాజరయ్యారు. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2025లో దాదాపు 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. సుమారు 61 శాతం అంటే దాదాపు 5.8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
నకిలీ అభ్యర్థులను అరికట్టేందుకు, పరీక్షా ప్రక్రియ సమగ్రతను బలోపేతం చేసేందుకు ఈ ఏడాది తొలిసారిగా పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల రియల్ టైమ్ ఫేస్ అథెంటికేషన్‌ను కమిషన్ ప్రవేశపెట్టింది. ఎంఈఐటీవై పరిధిలోని ఎన్‌ఈజీడీ ద్వారా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ.. మొత్తం 2,072 కేంద్రాల్లో అద్భుతమైన పనితీరుని కనబరిచింది. యూపీఎస్సీ నిర్వహించిన అతిపెద్ద రియల్ టైమ్ ఫేస్ అథెంటికేషన్ ఇదే. ఇది వంద శాతం విజయవంతమవటంతో కమిషన్ సమగ్రతా ప్రక్రియల్లో కీలక ముందడుగా నిలిచింది.
పరీక్ష సజావుగా సాగినందుకు యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు. "ఈ పరీక్ష నిర్వహణకు అవిశ్రాంతంగా కృషి చేసిన యూపీఎస్సీ బృందంతో పాటు ఎన్‌ఈజీడీ (జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం), ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ప్రయత్నాల పట్ల సంతోషంగా ఉంది. ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ అమలు అత్యంత క్లిష్టమైన నిర్వహణ ప్రక్రియల్లో ఒకటి. దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయటం మాకెంతో సంతృప్తినిచ్చింది" అని డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు.
నిర్దేశిత సంస్థాగత మార్గదర్శకాలు, పరీక్షా నియమావళిని పాటిస్తూ రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు జనరల్ స్టడీస్ (పేపర్-I), మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) [పేపర్-II] నిర్వహించారు.
అత్యధిక రద్దీ ఉన్న కేంద్రాల్లో.. మొత్తం 144 సెంటర్లలో 70,885 మంది అభ్యర్థులతో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. 100 సెంటర్లలో 44,209 మంది అభ్యర్థులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా.. 79 సెంటర్లలో 39,147 మంది అభ్యర్థులతో పాట్నా మూడో స్థానంలో ఉంది. కార్గిల్‌లోని ఒకే ఒక్క సెంటర్‌లో 98 మంది అభ్యర్థులతో చివరి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో పోర్ట్ బ్లెయిర్ ఉంది. అక్కడ ఒకే కేంద్రంలో 270 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, లే (లడఖ్)లోని రెండు కేంద్రాల్లో 308 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
***
(రిలీజ్ ఐడి: 2264887)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13